పెద్ద రైల్వే జంక్షను.దాని పొలిమేరలో రైలు పట్టాలకు అటూ ఇటూ చెల్లాచెదురుగా పడివున్న శవం ఖండిత భాగాలు.పట్టాలమీద, రాళ్లమీద ఎండిపోయిన జిగట రక్తం. చీలికలు పేలికలైపోయిన చీరముక్కలు. నల్లటి వృద్ధ స్త్రీశరీరం. భయానక దృశ్యం.

అక్కడికి అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు శివన్న. ఆ శవభాగాలను ఒకచోటకు చేర్చి, చాపలోచుట్టి మార్చురీకి చేర్చడం అతని పని. దానికోసం ఒక కర్రబల్ల రిక్షా తెచ్చుకున్నాడు. దాన్ని పట్టాలపక్కన మొక్కల్లో నిలిపి ఉంచాడు. ఈ పని చేసినందుకుగాను శవం తాలూకా మనుషులుగానీ, లేదంటే పోలీసులుగానీ ఎంతోకొంత ఇస్తారు. దాంతో శివన్నకి మూడుపూటలా గడుస్తుంది. శవాలవాసన భరించడానికి తాగుతాడు. ఆ ఖర్చుకూడా వాళ్ల దగ్గరనుంచే వసూలు చేస్తాడు. దిక్కుమాలిన శవాలకు డబ్బులు ఇచ్చేవారు ఉండరు. ప్రభుత్వనిధులూ ఉండవు. పోలీసులు చెయ్యాల్సినపని తను చేస్తున్నందుకుగాను తృణమో పణమో ఇస్తారు. దాంతో ‘అమ్మా సామి’ అనిపించేస్తాడు. నా అనే ఎవరూలేనివారిని పిడికెడు బూడిద చెయ్యడానికి సిద్ధపడతాడు.

అలా ఎన్నోశవాలు శివార్పణం చేశాడు శివన్న.వాడి అంకితభావం చూసి పోలీసులకు శివన్నమీద నమ్మకం కలిగింది. ఆ పని ఇంకెవ్వరికీ అప్పజెప్పరు. అర్థరాత్రయినా, అపరాత్రయినా శివన్న వచ్చేవరకు పట్టాలమీద పడిన శవం అలా ఉండాల్సిందే. ఈలోపు ఎఫ్‌.ఐ.ఆర్‌. క్లూస్‌టీమ్‌ వాళ్ళు తమ రిపోర్టులు రాసేసుకుంటారు. గుర్తించలేని శవాలకు అంతా తూతూ మంత్రంగా జరిగిపోతుంది.కానీ శివన్న మాత్రం ప్రతి శవం విషయంలోనూ సీరియస్‌గానే ఉంటాడు. తాను చేస్తున్నపని మహాశ్రద్ధగా చేస్తాడు.‘‘శవాలమీద నీకెందుకంత శ్రద్ధ?’’ అని అడిగారు ఎందరో.ఏమీ సమాధానం చెప్పడు. గంభీరంగా ఉంటాడు. తన పని తను చేసుకుపోతుంటాడు. పనంతా అయిపోయిన తరువాత ఆకాశంవైపు చూసి ఒకదండం పెడతాడు. రైలు పట్టాలవైపు చూసి ఒక వేదాంతపరమైన నవ్వు నవ్వుతాడు.