‘‘అక్కా...! నాయనమ్మ ఇప్పుడు ‘నందిని’ చూస్తా ఉండి ఉంటుంది కదా...’’ పుస్తకాల బ్యాగ్‌ని భుజం మార్చుకుంటూ, బరువుగా అడుగులేస్తూ అంది గీత.వెనక నుంచి చెల్లెలు అన్న మాటలకి, ‘‘హ్హే... నోర్మూసుకో! ఎప్పుడూ నాయనమ్మ సీరియల్స్‌ మీదే నీ చూపు. అవును. చూస్తుంది. ఇప్పుడు నందిని, ఆ తర్వాత మొగలిరేకులు, తర్వాత మరొకటి... నీకేంటంట? అయినా నాన్నేం చెప్పారు నీకు?’’ కోపంగా అరిచింది అక్క ఆద్య ఆగకుండా నడుస్తూనే.

‘‘నువ్వే మూసుకో...!’’ పైకి అంటే ఎక్కడ కొడుతుందోనని నోట్లోనే గొణుక్కుంది గీత.అంతకుముందే స్కూల్‌ బస్‌ వీళ్ళిద్దర్నీ వీధి మొదట్లో దింపి వెళ్ళిపోయింది. వీళ్ల ఇల్లు డెడ్‌ ఎండ్‌లో ఉండటంతో లోనికెళితే బస్సు మలుపు తిరగటం కష్టమని వీధి మొదట్లో దింపేసి వెళ్ళిపోతాడు స్కూల్‌బస్‌ డ్రైవర్‌. నాలుగడుగులేస్తే ఇల్లొచ్చేస్తుంది. అయిదు నిమిషాలు కూడా పట్టదు.ఆ రోజుతో పరీక్షలు ముగిశాయి. పరీక్షలు జరిగినన్నాళ్ళూ ఎలాగూ టీవీ చూడలేదు. పరీక్షలైపోయాయి కాబట్టి ఇప్పుడైనా టీవీ చూడొచ్చని గీత ఆశ. కానీ నాయనమ్మే... ఎప్పుడూ టీవీని వదల్దు. ఆవిడ పడుకుంటేనే గీతకి టీవీ దొరికేది. చాలా తక్కువ ఆవిడ పడుకునేది.

నిద్ర పట్టదంటుంది. ఒకవేళ అదృష్టం కొద్దీ ఎప్పుడైనా కాసేపు పడుకున్నా వాల్యూం తక్కువ పెట్టుకోవాలి. సౌండ్‌కి నాయనమ్మకి నిద్ర పట్టదంట.అదస్సలు ఇష్టం ఉండదు గీతకి. ఆ మాటే పైకంటే...‘చదూకోవచ్చు కదా...! మేథ్స్‌లో ఎప్పుడూ మార్కులు తక్కువే. మేథ్స్‌ ఎంత బాగా ప్రాక్టీస్‌ చేస్తే అంత ఎక్కువ మార్కులొస్తాయి. అస్సలు ప్రాక్టీస్‌ చెయ్యవు, స్కూల్లో చేసింది తప్ప. టీవీ కావాలంట టీవీ...’ అంటున్నారని గొణుగుళ్ళన్నీ లోలోపలే. కానీ... రేపట్నుంచీ సెలవులు. బయటికి వెళ్లనివ్వరు. ఇంట్లో టీవీ దొరకదు. ఆ సీరియళ్ళేమో యమబోర్‌. తిట్టుకుంటూనే అక్కననుసరించింది గీత.