పానపురంలో సారంగుడనే యువకుడు ఉండేవాడు. అతడికి తలిదండ్రులులేరు. అన్నావదినల దగ్గర ఉండేవాడు. వేళకువచ్చి ఇంత తినిపోవడంతప్ప, ఇంట్లోవాళ్లకి ఏవిధంగానూ సాయపడేవాడుకాదు. అంతేకాక, అల్లరిచిల్లరగా తిరిగి, అన్న గోపాలుడికి చెడ్డపేరు తెచ్చేవాడు. గోపాలుడతడికి ఎన్నోవిధాల నచ్చజెప్పిచూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు ఒకరోజు గోపాలుడు, ‘‘నువ్వు ఎంతోకొంత సంపాదనపరుడవయ్యేవరకు నాఇంటి గుమ్మం తొక్కకు’’ అని తమ్ముడికి కచ్చితంగా చెప్పేశాడు.

‘‘అలా అనడానికి నువ్వెవరు? నాఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. భోజనానికి ఇంటికొస్తాను. ఎలాగూ వదిన నన్నాదరిస్తుంది’’ అన్నాడు సారంగుడు మొండిగా.గోపాలుడు భార్య సాహిణితో, ‘‘ఈరోజునుంచీ, నువ్వు వీణ్ణి ఇంటిగుమ్మం తొక్కనివ్వకు. గుమ్మంబయట నిలబడి అడిగినా, ఒక్కమెతుక్కూడా విదల్చకు. వీడికి బుద్ధిరావాలంటే అదొక్కటేమార్గం’’ అన్నాడు. అన్న ఏం చెప్పినాగానీ, వదిన తనను ఆదరిస్తుందని సారంగుడి ధీమా. అందుకే అతడు నిర్లక్ష్యంగా నవ్వి వెళ్లిపోయాడు. ఇష్టం వచ్చినంతసేపు బయటతిరిగి, భోజనానికి ఇంటికెళ్లాడు సారంగుడు. సాహిణి అతణ్ణి మందలించినా జాలికొద్దీ లోపలకు రానిచ్చి అన్నం వడ్డించింది. అంతలో ఇంటికొచ్చిన గోపాలుడు జరిగింది గ్రహించి భార్యను నానాచీవాట్ల్లూ పెట్టాడు.

ఆమె నోరుమెదపకుండా భర్తతిట్లన్నీ భరించింది. అలా మూడురోజులు గడిచేసరికి గోపాలుడు కోపంపట్టలేక భార్యను వీపుమీద దబదబ నాలుగు బాదాడు. అప్పుడు సారంగుడు కలుగజేసుకుని, ‘‘వదినని కొడతావేం?’’ అని అన్నయ్యను నిలదీశాడు. ‘‘నీవదిన నీకు భోజనంపెట్టి తప్పుజేసింది. అందుకే నేను తనని కొట్టాను’’ అన్నాడు గోపాలుడు. ‘‘ఇంటికి భోజనానికి రావడం నాతప్పు. నావదిన హృదయం మంచిది. అందుకని నాకు భోజనం పెట్టింది. నీకు కోపముంటే నన్ను శిక్షించు. వదినను ఏమీచేయకు’’ అన్నాడు సారంగుడు బ్రతిమాలే ధోరణిలో.