రాజారాం మావయ్య ఊరు వెళ్ళాడు. వెళ్ళి ఇప్పటికి నలభై ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిముషాలయింది. రెండు రోజుల్లో వస్తానన్నాడు. ముప్పై నాలుగు నిముషాల లేట్‌లో ఉన్నాడు, నా కంటే పదిహేను ఏళ్ళు ముందు పుట్టిన మావయ్య.అసలు మా మావయ్యని నేను రెండేళ్ల క్రితఁవే ‘మావయ్య’ అని పిలవడం మానేశాను. యూనివర్శిటీ నుంచి వచ్చి ఇరవైయవ పుట్టిన రోజు చేసుకున్న వేసవి తర్వాత, ఆ ఆషాఢమాసంలో కూడా మావయ్య నన్ను వదల్లేదు.అన్నట్టు - అప్పట్నించీ మావయ్యని నేను ‘మీరు’ అనడం అలవాటు చేసుకున్నాను నలుగుర్లో. ఏకాంతంలో మాత్రం తరుచుగా ‘మావయ్య’ అనీ, ఒకొక్క మూడ్‌లో ‘రాజా’ అని కూడా పిలవడం అప్పట్నించే.మా ‘రాజా’ గురించి మీకు తెలీదు కదా! తను విజయా వాళ్ళ సినిమా లాంటి వాడు. మేధావి వర్గం నుంచి సామాన్య ప్రజల దాకా ఆరాధనీయుడు.అలాటి మావయ్య కోసేమే నేను పుట్టానట.చూశారా! మావయ్య ఇంకారాలేదు. ఈ ఉదయం నుంచీ పడిన ఉద్వేగమంతా ఒక ఎత్తు - ఇది మావయ్యతో చెప్పేదాకా ఆగలేకపోవడం ఒక ఎత్తు.ఈలోగా మీతోనయినా ముచ్చటిస్తాను.

 

పొద్దున్నే మెలుకువ వచ్చేసింది. చూస్తే పక్కన ‘రాజా’ లేడు. సడెన్‌గా గుర్తొచ్చింది ఊరు వెళ్లాడు కదా అని. ‘ఎంత అలవాటో!’ అని నవ్వుకున్నాను. సాధారణంగా నాకు ఏదీ అలవాటు కాదు - అని చిన్న గర్వం ఉన్న నేను.అలా బద్ధకంగా పడుకునే ఉన్నాను.పియానో మెట్టునొక్కినప్పటి సన్నటి సంగీతపు ధ్వని.మావయ్యే వచ్చి వుంటాడని చటుక్కున లేచాను.మా ‘రాజా’ వస్తుంటే పియానో వాయిస్తున్నట్టుంటుదనుకుంటారేమో! కాదు సుమా! నా కోరిక ప్రకారం మా ‘వారే’ అలాటి కాలింగ్‌ బెల్‌ ఏర్పాటు చేశారు.అందుకే మావయ్యకి నేనంటే అంత ఇష్టం.‘కళని జీవితంలో అద్భుతంగా పొదుగుకున్న పిల్లవే నువ్వు’ అంటాడు. అందుకే నా కోసం అంతకాలం ఆగి ఆ ప్రౌఢ యౌవనంలో ముప్పై అయిదేళ్ళ పెళ్లి కొడుకు అయ్యాడు.ఇంతకీ తలుపు తీసేసరికి రమ, వాళ్ళాయనతో - ఊహించని విధంగా.‘‘ఏవే జయా! తెల్లవారకుండా వచ్చి పడిపోయి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేసినట్టున్నామా?’’ అంటూ సూట్‌కేస్‌లతో లోపలకు అడుగుపెట్టింది రమ.

 

                                                                ******************************************