శ్యామలకి పెళ్ళయి, కాపురానికి వచ్చిన నెలరోజులకి షాక్‌ తగిలినట్లయింది. ఆ కుటుంబ పరిస్థితికి నివ్వెరపోయింది. మెట్టింటి కుటుంబం ఆర్థికంగా పైన పటారం, లోన లొటారం అని అర్థమైపోయింది.వాళ్ళకి అప్పు ఇచ్చిన తిరుపతయ్య ఇంటి మీదకి వచ్చి ధాం ధూం చేశాడు.అంతకు రెండు రోజులు ముందు కూడా మరో నలుగురు బాకీలు అడగటానికి ఇంటికి వచ్చారు. ముగ్గురు మర్యాదగానూ, మన్నన గానూ అడిగారు. ఒకడు మాత్రం కోపంగానూ, దురుసుగానూ మాట్లాడాడు.అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అడగటం శ్యామలకి వింతగానూ, విచిత్రంగానూ వుంది. బాధగానూ, ఇబ్బందిగా కూడా అనిపించింది.వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆస్తిపరులు కాదు. చారెడు నేల లేదు వాళ్ళకి. రెక్కల కష్టమే వాళ్ళ ఆస్తి. పనికి పోవటం, పొట్ట నింపు కోవటం. వాళ్ళకి అప్పులూదెప్పులూ లాంటివి లేవు. ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ చూడలేదు.కొత్త కోడలి ముందు అప్పుల వాళ్లు అలా మాట్లాడటం శ్యామల భర్త రాంబాబుకీ, మామ ఎంకటప్పకీ, అత్త నీలవేణికీ చిన్నతనంగానూ, అవమానంగానూ అనిపించింది.ఎంకటప్పకి ఏడాది క్రితం తేలికగా పక్షవాతం వచ్చింది. అసలే సోమరీ, భయస్తుడు. ఇక మంచానికీ, వీధి అరుగుకీ అంకితమై పోయాడు. పెద్ద వయసూ కాదు. తన పనులు తను హాయిగా చేసుకోగలడు. కానీ భార్య తనని కనిపెట్టుకుని చూసుకుంటూ ఇంటి వద్ద వుండాలంటాడు.వాళ్ళకి రాంబాబు ఒక్కడే కొడుకు. రెండో సంతానం లేదు. ఆరు ఎకరాల పొలం వుంది. మంచి పొలం. వాళ్ళూ మంచి మనుషులే. చాలా మంది రైతుల్లానే వాళ్ళకీ కొన్ని అప్పులున్నాయి.మరుసటి రోజు ఎంకటప్ప కొడుకుతో చెప్పాడు.‘‘రాంబాబూ, అప్పుల వాళ్ళ చేత అడిగించుకోవటం, వాళ్ళని ఇంటి చుట్టూ తిప్పించుకోవడం ఎందుకు? మేం చేసిన అప్పులు మీరు కట్టాల్సి వస్తంది. మీరా చిన్న పిల్లలు. అప్పులు తీర్చడం మీ వల్ల అయ్యే పని కాదు. నేనా ఇక చేయలేను. నన్ను కనిపెట్టుకుని ఇంటి కాడ అమ్మ నాకు తోడుగా వుండాలి. ఒక ఎకరం అమ్మితే బాకీలు తీరి , కొంత డబ్బు నిల్వలో వుంటాం. ఎగదాల కాలవ ఒడ్డున వున్న ఎకరం చేను అమ్ముదాం. అంతకంటే ఇంక చేయగలిగేది ఏముంది?’’

                                               ===============================================