ఓ రోజు తెల్లవారుజామున గాఢనిద్రలో ఉండగా...ట్రింగ్‌ ట్రింగ్‌ ట్రింగ్‌ అంటూ సెల్‌ ఫోన్‌ మోగింది. మెలకువ వచ్చింది. లేచి కూర్చుని ఫోన్‌ స్ర్కీన్‌పై చూస్తే, కొత్త నెంబర్‌ కనిపించింది. చిరాగ్గా కట్‌చేశాను. హఠాత్తుగా నిద్రలేవడంతో తలనొప్పిగా అనిపించింది. ఎదురుగా గోడకున్న గడియారంవైపు చూశాను. 5.45 గంటలవుతోంది. పక్కనే ఉన్న కిటికీలోంచి బయటకు చూశాను. మెల్లిగా వెలుతురు పరుచుకుంటోంది. ఎక్కడా మనిషి జాడలేదు. వెనుకవరుసలో ఉన్న కొన్ని ఇళ్ళల్లో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. ఎక్కడో మిక్సీ తిరుగుతున్న శబ్దం. 

మా ఊరు గుర్తుకొచ్చింది. ఊరు మధ్యలో ఉండే సొంత ఇల్లు కూలిపోయింది. దీంతో ఊరికి ఓ చివర కాలనీలోని చిన్నఇంట్లో మేం అద్దెకుండే వాళ్లం. మా ఇళ్ల వరుసదాటితే పొలాలు ప్రారంభమయ్యేవి. ఈ సమయానికన్నా గంటముందే మా వీధి మేల్కొనేది. చీపుళ్ల శబ్దాలు సుప్రభాతం పాడేవి. బర్రెలు, ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్లే రైతుల కిర్రుచెప్పుల శబ్దం దరువు వేస్తున్నట్లుగా అనిపించేది. ఎదురుగా ఉన్న ఇంట్లోంచి, పాలకోసం లేగదూడల అరుపులు వినిపించేవి. కొద్దిదూరంలోని గుడిలోంచి భక్తి పాటలు వినిపించేవి. మెలకువ వచ్చినా, నిండా దుప్పటి కప్పుకుని, కళ్ళు మూసుకుని ఈ శబ్దాలన్నింటినీ వింటుంటే, ఓ వాయిద్య కచేరీలాగా అనిపించేది.ప్రస్తుతం నేను ఉంటున్నది జిల్లాకేంద్రం. ప్రింట్‌ మీడియాలో ఉద్యోగం. పదేళ్లక్రితం కుటుంబసమేతంగా ఇక్కడికొచ్చి స్థిరపడ్డాను.

ఆధునికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిందేమోగానీ, మనుషుల మధ్య మాత్రం దూరం పెంచేసింది. కుటుంబసభ్యులంతా కలిసి గంటసేపు కూర్చుని మాట్లాడుకోవడమే అపురూపమైపోయింది. ప్రతిరోజూ ఒక్కపూట కలిసి భోజనం చేయడం గగనమైపోయింది. మెదడును చిలికినట్లుగా ఆలోచనలు. కలగాపులగంగా సాగుతున్నాయి. తల విదిలించాను. పడుకుందామనుకుని దుప్పటి సవరించుకుంటూంటే ఫోన్‌ మళ్లీ మోగింది. చూస్తే అదే నెంబర్‌. కట్‌ చేద్దామనుకుని, మనసు మార్చుకున్నాను. ఆకుపచ్చ బటన్‌నొక్కి ‘‘హలో’’ అన్నాను. అవతలినుంచి ఎవరో చాలానెమ్మదిగా మాట్లాడుతున్నారు. సరిగ్గా వినిపించడం లేదు. ‘‘హలో’’ అని మరోసారి గట్టిగా అన్నాను.

‘‘బాబూ నేనమ్మా, సత్యవాళ్ల నాన్న చంద్రయ్యను’’ అన్నారు. ‘‘నమస్తేసార్‌, బాగున్నారా?’’ అన్నాను. ‘‘ఒకసారి ఊరికి వస్తావా బాబూ, మాట్లాడాలి’’ అన్నారు. ‘‘ఎందుకు సార్‌! ఏమన్నా సమస్యా?’’ అన్నాను. ‘‘సమస్య అంటే సమస్యే బాబూ, సత్య విషయం నాకేమీ పాలుపోవటం లేదు’’ అన్నారు. ఆయన గొంతు గరగరమంటోంది. దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్టు అర్థమైంది. ఆదుర్దాగా ‘‘ఏమైందకుల్‌’’ అన్నాను. ‘‘సత్య ఇల్లొదిలి వెళ్లిపోయాడు బాబూ’’ అంటూ ఫోన్‌ కట్‌ చేశారు. నాకేమీ అర్థం కాలేదు. సత్య ఇల్లొదిలి వెళ్లిపోవడం అంటే నమ్మబుద్ధికావడం లేదు. మళ్లీ పడుకునే ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది.