ఓ కేసు విచారణ జరుగుతోంది. అసలు ఏంజరిగిందో నువ్వు చెప్పమ్మాయ్‌..అన్నారు న్యాయమూర్తి. ఆమె చెప్పిందంతా విన్నాక కోర్టుహాలంతా సానుభూతితో నిండిపోయింది. ఆ తర్వాత జరీఅంచునీలంచీర స్ర్తీ ఒకామె బోనులోకి ప్రవేశించింది. ఆమె ఎవరో తెలిశాక అంతా అవాక్కయ్యారు. ఆమె మాట్లాడాక కోర్ట్‌హాలులో ఎవ్వరికీ నోరుపెగలలేదు. న్యాయమూర్తి సైతం ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఆమె ఎవరు? అక్కడ ఏం జరిగింది?

================

‘‘నీ పేరు?’’‘‘తల్లిదండ్రులు పెట్టినపేరు గోదావరి. బజారుపేరు లక్కీ’’. ఎడారిలాంటి ముఖం, ఆమె చూపుల్లో సమాజంపట్ల అసహ్యంతో కూడిన నిర్లక్ష్యం, మనిషిలో తెగింపు.‘‘నీ తరఫున వాదించటానికి లాయర్‌ ఉన్నారా?’’ నిస్సారమైన నవ్వే ఆమె జవాబు. ‘‘ప్రాణం నిలుపుకోవడానికి మానం అమ్ముకునేదాన్ని, లాయర్ని పెట్టుకునేంత స్తోమత నాకెక్కడిది సార్‌? అయినా మా దేహాన్ని కోరే వాళ్ళుంటారుగానీ, మా క్షేమం కోరేవాళ్ళెక్కడుంటారు?’’‘‘బజారులో సినిమాహాళ్ళ ప్రక్కన నిలబడి మగవాళ్ళని రెచ్చగొట్టి, నీతో తీసుకుపోయి సమాజాన్ని చెడగొడుతున్నావని నీ మీద కేసు. నిజమేనా?’’ఒక్కసారిగా ఆక్రోశంతో అరచింది ఆమె. ‘‘అది నావృత్తి సార్‌.. నా పొట్ట నింపుకోవడానికి వేరే మార్గం లేదు, లేకుండా చేసింది ఈ సమాజం’’ ఆవేశం అణచుకోవడానికి ప్రయత్నిస్తూ ఓ నిమిషం వగర్చింది. ‘‘ఓ మంచి కుటుంబంలో పుట్టిన నాకూ అందరు ఆడపిల్లల్లాగే చదువుకోవాలని, మంచి ఉద్యోగం చెయ్యాలని, పెళ్ళి చేసుకుని చక్కగా కాపురం చేసుకోవాలనే కోటి ఆశలూ, ఆశయాలూ,కోరికలు ఉండేవి. కాని అవన్నీ ఓ అందమైన దుర్మార్గుడి కారణంగా నాశనమైపోయాయి.

ప్రేమపేరుతో వంచించి వాడునన్నీ రొంపిలోకి దింపి, క్యాష్‌ చేసుకుని మాయమైపోయాడు. నా బతుకుమారే అవకాశం లేదు. నా కోరికలూ, ఆశలూ, ఆశయాలన్నీ నాతోబాటు కాలిపోవాల్సిందే. నాకు మరో దారి లేదు. నేను చేస్తున్నది చట్టం దృష్టిలో నేరమైతే శిక్షకి సిద్దమే సార్‌’’ అంది ఏడుస్తూ.మూడునెలలు సాధారణ జైలుశిక్ష విధించారు న్యాయమూర్తి. నిర్వేదంతో ఓ నవ్వు నవ్వి తలవంచుకుని పోలీసులతో వెళ్ళిపోయింది ఆమె.రెండవ కేసు... ఓ పాతికేళ్ళ యువకుడు. వస్త్రధారణలోనూ, ప్రవర్తనలోనూ కూడా మోడరన్‌స్టైల్లో నిర్లక్ష్యంగానూ, అస్తవ్యస్తంగానూ ఉన్నాడు. తీసుకొచ్చి బోనులో నిలబెట్టారు. అతని పేరు సతీష్‌. అతన్ని చూస్తూనే విజిటర్స్‌ గ్యాలరీలో ముందు వరుసలో కూర్చున్న భార్గవిముఖం ఎర్రబడింది. ప్రక్కనే ఉన్న ఆమె తండ్రి పతంజలి దవడలు బిగుసుకున్నాయి.

ఇద్దరి గుండెల్లో కోపం, ఉక్రోషం, అసహాయత ఒక్కసారిగా ఎగదన్ని, పళ్ళు గిట్టకరుచుకుపోయాయి. సతీష్‌ భగవద్గీతమీద ప్రమాణం చేశాక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ చాలా నిర్లక్ష్యంగా జవాబులు చెప్పాడతను. తనకి శిక్ష పడదన్న ధీమా అతనిలో కనిపిస్తోంది. తనుపెట్టుకున్న డిఫెన్స్‌ లాయర్‌ సామర్థ్యంమీద అతనికి గొప్ప నమ్మకం ఉంది. గ్యాలరీలో బెంచీలమీద జనం మధ్యలో సన్నని జరీఅంచు నీలంచీర కట్టుకుని కూర్చున్న ఓ యాభైఏళ్ళ స్ర్తీవైపు పదే పదే చూస్తున్నాడు అతను. ఉన్నత ఉద్యోగంచేసే ఆమెని చూస్తూంటే అతనిలో ధైర్యం ద్విగుణీకృతం అవుతోంది. ఆమె గంభీరంగా కూర్చుని ఉంది. ‘‘బాధితురాలు కుమారి భార్గవిని బోనులోకి పిలిపించవలసిందిగా కోర్ట్‌ వారిని కోరుతున్నాను యువరానర్‌’’ అన్నాడు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.