‘‘నీ కోపం తగ్గినట్టుందేం’’ కుంపటి విసురుతున్న పచ్చిగుళ్ల నూకరాజు నిమ్మళంగా అన్నాడు.‘‘పని చూడవయ్యా మహానుభావా. అక్కర్లేని మాటలెందుకు’’ విసుక్కుంది లక్ష్మి.వదిలిపెట్టదలుచుకోలేదు రాజు.‘‘అయినా అదంతా ఎప్పటి భోగట్టా. ఆ కోపాలూ తాపాలూ ఇప్పుడెందుకుంటాయి. మనవరాలితో మొన్న బాగానే మాట్లాడావులే. ముద్దు కూడా చేయిస్సేవు’’ ఇత్తడి గిన్నెలో మరుగుతున్న ఎర్ర రంగు పంచదార పాకాన్ని గరిటెతో మిళాయిస్తూ మెత్తగా మాట్లాడాడు.‘‘కాలుతో కలుపుకోవడం చేత్తో జుర్రుకోవడం నాకేం చేతవదు. బాలపాపలెవరన్నా ఇష్టమే’’ పాకాన్ని తెమ్మనమని సైగ చేస్తూ అనేసింది లక్ష్మి.గుడ్డవాసెనతో భార్య దగ్గరకు గిన్నె పట్టుకొచ్చాడు నూకరాజు. క్షణమైనా ఆలస్యం చెయ్యకుండా ఆ వేడిగిన్నెను తెల్లటి వస్త్రంతో అందుకుంది లక్ష్మి.అచ్చుబల్లలోకి వాటంగా పాకాన్ని ఒంపడం మొదలెట్టింది. బుసబుసమంటూ ఒక ఖాళీ నిండగానే మరో కంత మీదికి వెళ్లిపోయింది. పన్నెండు చిలకల గళ్లూ జాయిగా పండాయి.

**************

పంచదార చిలకలంటే తెలియనివాళ్లు పల్లెటూళ్లలో ఉండరు. ఈ తరం వారికి అంచనా లేపోవచ్చునేమోగానీ పాతవారికి అవి పసందే. ఒకప్పుడు విశాపట్నం జిల్లాలో పండగయినా, తీర్థమయినా, పరస అయినా ఈ చిలకలే ఆకర్షణ. సారెల వేళ మరీ గిరాకీ. అమ్మాయిని పురిటికి తీసుకొచ్చేప్పుడు వియ్యాలవారికి మిఠాయిలతో పాటు ఈ చిలకల్నీ సూడిదగా అప్పగించి వస్తుంది పిల్ల తల్లి. కడుపు చలవకు ప్రతిరూపంగా జనపదాల్లో ఈ చిలకలు పేరెళ్లాయి కూడాను.వీటి తయారీలో చాలా మంది ఉద్ధండులే వెనకటి కాలాన ఉండేవారు. ఈ పనిలో నైపుణి మాత్రం మహిళలకు పట్టుబడినట్టుగా మరెవ్వరికీ దక్కేది కాదు. అలాంటి నిపుణతను సొంతం చేసుకుని ప్రఖ్యాతమైంది పచ్చిగుళ్ల సూర్యలక్ష్మి. ఆమె స్వస్థలం కోటపాడు. చిలకల పోతకు, వీటిని అచ్చులుగా తీసే పోతబల్లలకూ ఆ ఊరు ప్రసిద్ధి.ఓపాటి మందంగల రెండు చెక్కబల్లల్ని వడ్రంగులు చాకచక్యంగా చెక్కుతారు.

సగం చిలక ఆకారాన్ని ఒక బల్లమీద, మరో సగం మరో చెక్కమీద డొల్లగా మలచి రెంటినీ జోడా చేస్తారు. చిలక నిలబడేందుకూ మట్టు కొడతారు. ఆ రంధ్రం నుంచే పదునుదేరిన పంచదార పాకాన్ని పోతగాళ్లు జారవిడుస్తారు. ఆరిన తర్వాత అచ్చుల్ని వేరు చేస్తారు. తియ్యతియ్యని అందాల చిలకలు బయల్పడతాయి. అచ్చుబల్లల తయారీ ఎంత కళాత్మకమో, పాకం పోసి చిలకలు పోల్చడమూ అంతపాటి కళే. చక్కెరకి ఎక్కువ నీళ్లు కలిపితే కుదరదు. తక్కువ జలాలు పోస్తే నడవదు. ఎన్ని పొయ్యాలో అన్నే పొయ్యాలి. తీగపాకం కూడదు. ఉండపాకం నప్పదు. చిలకపాకం తెలియడమే సిసలైన ప్రతిభ. లేపోతే అచ్చుల్లోంచి బయటకు రావడమే తడవుగా అవన్నీ ఫెళ్లు ఫెళ్లుమని విరిగిపోతాయి.