ఆ భార్యాభర్తలది రోజూ ఒకటేతంతు. ఉదయం హడావిడిగా వెళ్ళడం, ఏ రాత్రికో తిరిగొచ్చి ఏదో తిన్నిమనిపించడం, అర్థరాత్రిదాకా ల్యాప్‌టాపులూ, సెల్‌ఫోన్లూ పట్టుక్కూర్చోవడం. ఉదయం లేచి మళ్ళీ పరుగులు తీయడం. ఒకవేళ మాట్లాడుకుంటే, లోన్లూ, కొత్త విల్లాలు కొనడం గురించే! ఆవిడ వాళ్ళింటికొచ్చి నాలుగురోజులైంది. ఆ తంతుచూశాక ఇక విసుగొచ్చి, ‘ఇకనేను బయలుదేరతానర్రా’ అంది. అప్పుడు బయటకొచ్చింది అసలు విషయం. అదేమిటంటే.....

************************

‘‘గుర్తుందిగా! ఈ రోజు మధ్యాహ్నం మా అత్త ఊరునుండి వస్తోంది. స్టేషన్‌కు ఒంటిగంటకల్లా వెళ్లి పిక్‌ చేసుకోవాలి!’’ ఆఫీసుకువెళ్లే హడావుడిలో పెదవులకు లిప్‌స్టిక్‌ వేసుకుంటూ అంది నిఖిల భర్తతో.‘‘ఆ! ఆ! అలాగేగానీ టైముకు ముందుగా నాకు మెసేజ్‌ ఇవ్వు. పని హడావుడిలో మరచిపోతానేమో!’’ అన్నాడు అంతే హడావుడిగా అమిత్‌ కావాల్సినవి సర్దుకుంటూ.‘‘సరే అమిత్‌, నేను బయల్దేరుతున్నా, రాత్రికి కలుద్దాం!’’ అంటూనే హ్యాండ్‌బ్యాగ్‌ భుజానికి తగిలించుకుంటూ ఇంట్లో నుంచి బయటపడింది నిఖిల.

************************

‘‘అరె! అత్త ఇంట్లో ఉన్న విషయమే మరచేపోయాను తొందరగా ఇంటికి వెళ్లాలి!’’ రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత గడియారంవంక చూస్తూ అనుకున్నది నిఖిల. మధ్యాహ్నం అమిత్‌ తన మేనత్తని ఇంట్లో ఒంటరిగా వదిలి వచ్చిన విషయం అప్పుడే ఆమెకు గుర్తుకొచ్చింది.నిఖిల ఇంట్లో అడుగుపెట్టేసరికి ఎనిమిది గంటలు దాటింది.‘‘ఏమనుకోకు అత్తా! ఆఫీసులో ఆలస్యమైపోయింది. నిన్ను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచాల్సివచ్చింది!’’ మేనత్తనే చూసి నొచ్చుకుంటూ ఆమె చేతులుపట్టుకుని ఆప్యాయంగా చెప్పింది. అంది.మళ్లీ తనే,‘‘మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేశావా? నా వంట అంత గొప్పగా ఉండదు, కనీసం నువ్వు కాఫీ అయినా కలుపుకుని తాగావా? వంటింట్లో అన్నీ నీకు చూపించి రమ్మని అమిత్‌కు చెప్పాను. ముందు నీకు తినడానికి ఏమైనా చేస్తానుండు. అవునూ, నీకు రాత్రిళ్ళు ఫలహారమేగా!’’ అంటూనే ఫ్రిజ్‌ దగ్గరకు వెళ్లింది నిఖిల.‘‘ఉండవే నీ హడావుడి బంగారంగాను! అబ్బాయి చూపించాడులే. కాఫీ తాగానులేగానీ, ఆఫీసులో అలసిపోయి వచ్చావు, నేను చేస్తాలేగానీ, కాసేపు నువ్వలా కూర్చో. ఏవెక్కడున్నాయో చూపించు చాలు!’’ అంటూ జాబిలమ్మ లేచింది.