‘‘ఎత్తెత్తి కాలేస్తే ఎంగిలాకులో పడిందిట! అలాగయ్యింది ఆవిడ పరిస్థితి’’ అన్నాడు శవంలో బేతాళుడు. ‘‘ఎవరావిడ? ఏమా కథ? అని నువ్వు అడగక్కర్లా.. నేనే చెప్తా’’ అన్నాడు మళ్ళీ తనే. ‘‘శ్రమ తెలియకుండా విను. పూర్వం... పూర్వం కాదులే ఈమధ్యే ఓ ఊళ్ళో కర్ణభేరి, లావాదేవి అనే భార్యాభర్తలున్నారు’’‘అవేం పేర్లూ?’’ అడిగాడు రాజు.‘‘కర్ణభేరిగారి అసలు పేరు శాతకర్ణి. స్కూల్లో చేర్చేటప్పుడు మేస్టారు ఏదో ధ్యాసలో ఉండి ‘కర్ణభేరి’ అని రిజిస్టర్లో రాసేశాడు. దాంతో ఆ పేరే ఆయనకి ఖాయం అయిపోయింది. ఇక ఆమె విషయం. ఆమె తండ్రి ఓ వణిక్‌ ప్రముఖుడు. వ్యాపారంలో బాగా కలిసొచ్చాక లేక లేక కలిగిన తన బిడ్డకి అమ్మవారి పేరు కూడా కలపాలని ‘లావాదేవి’ అని పేరు పెట్టాడు. కథ రంజుగా సాగుతున్నప్పుడు మధ్యలో ఇలా ప్రశ్నలేస్తే నేను చెప్పను. మిడిల్‌ డ్రాపై పోతా. ఆపైన నీ ఇష్టం’’ అన్నాడు బేతాళుడు.‘‘ఓర్నీ అసహనం పాడుగానూ, ఇంక అడగన్లే, చెప్పు’’.

‘‘వాళ్ళకి పిల్లల్లేరు. గుళ్ళూ గోపురాలకీ యధాశక్తి చందాలిచ్చే అలవాటుండేది లావాదేవికి. ఓరోజు కొందరు యువకులొచ్చి ఊరవతల కొండమీద ‘అత్యానందస్వామి’కి ఆశ్రమం కడుతున్నామనీ, తోచిన చందా ఇవ్వమనీ అడిగారు. ఆలోచించి చెబుతా వెళ్ళమంది లావాదేవి.ఆ రోజు దీపావళి. టీవీలో శ్రీకృష్ణుడి సినిమాలు వరసపెట్టి వేసేస్తున్నారు. శ్రీకృష్ణ తులాభారం సినిమాలో రుక్మిణి తన భక్తిని చాటుకున్న దృశ్యం చూసి లావాదేవి కళ్ళ నీళ్ళెట్టుకుంది. ఆ మాటకొస్తే తను కూడా అంతటి పతివ్రతే! తనకేం తక్కువ? అవకాశం వస్తే తను కూడా రుక్మిణిలా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోగలదు. అలా అనుకోగానే ఆమెకో ఐడియా వచ్చింది.

తన భర్తని ధర్మకాంటాలో తూచి, అలా తూగిన ధనాన్ని ఆశ్రమానికి విరాళంగా ఇస్తే ఎలా ఉంటుంది? అత్యానందస్వామి కూడా ఆనందిస్తారు అనుకుంది. వెంటనే ‘అత్యానందం కాదు నీకది అంత్యానందం అవుతుంది. అంతడబ్బే? దిబ్బయిపోతావు’ అంటూ అంతరాత్మ లోపల్నించి అరిచింది. మరైతే దేంతో పెట్టి తూద్దాం? ఏదో ఒకటి తూచాల్సిందే! బియ్యమా? పళ్ళూ కూరగాయలా? పప్పులూ ఉప్పులా? ఇల్లంతా కలయచూసింది. ఎక్కడ చూసినా పాత న్యూస్‌పేపర్లు తప్ప ఇంకేం కనబళ్ళా. ఎస్‌! ఐడియా! పాత పేపర్లతో తూద్దాం. ఎప్పట్నించో మంచిరేటు వస్తుందని ఎదురుచూస్తూ గుట్టలు గుట్టలుగా పెట్టుక్కూర్చున్నాడు తన భర్త. వాటిని వాడేస్తే ఇల్లు కూడా ఖాళీ అవుతుంది. భలే ఐడియా! ‘ఎంతైనా నువ్వు తెలివైనదానివే లావా!’ అంతరాత్మ లోపల్నించి అరిచింది. ఈ ఐడియాతో ఆమె జీవితం మారిపోలేదు గానీ, భర్త జీవితం మారిపోయింది.