అది ఓ మాదిరి ఊరు. అటు మరీ పల్లెటూరు కాదు. ఇటు పెద్ద పట్టణమూ కాదు. పచ్చని పొలాలు, పాడిపంటలతో అందరికీ అన్నీ సమృద్ధిగా లభించే ఊరు అది.సాయంత్రం నీరెండ ఆహ్లాదకరంగా ఉంది. దీపికావాళ్ళ ఇంటి డాబామీద ఆమె స్నేహితురాళ్ళంతా కలుసుకున్నారు. తమ పరీక్షలు అన్నీ అయిపోయాక ఆఖరు రోజు తమ అలసట మరచిపోవడానికి అంతా అక్కడ కలుసుకుని కాసేపు ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.చదువులు ఇక అయిపోయినట్లే. కనుక తమ జీవితాలలో ఇక ముఖ్యమైన ఘట్టం వివాహం అనే ఆలోచనలో ఉన్నారు అందరూ. 

ఎవరెవరు ఎలాంటి కలలు కంటున్నారో కాస్త బిడియంగానూ, కాస్త కలివిడిగాను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. అందరిలోకి కాస్త మొగమాటం తక్కువగా ఉండే జ్వాల ఆ చర్చకు నాంది పలికింది.‘‘చెప్పండి. అలా మొగ్గల్లా ముడుచుకుపోతే ఎలా? ఒకసారి బయటకు చెప్పుకుంటే కనీసం మీ మనసుల్లో ఉన్న ఆలోచన్లు మీకన్నా తెలుస్తాయి. అప్పుడు వీలు చూసుకుని మీ బామ్మకో, అమ్మకో చెప్తే వాళ్ళే అటువంటి సంబంధాలు వెతికే తంటాలు పడతారు. ఏమంటారు?’’ అంది చుట్టూ చూసి.

దీపిక నవ్వి ఊరుకుంది. ఆమె స్నేహితురాళ్ళు రాణి, వనజ, మహతి, మాధవి కిల కిల నవ్వి, ‘‘ముందు నువ్వు చెప్పొచ్చుగా’’ అన్నారు కోరస్‌గా.‘‘ఓ...నాకేం భయం. ఒక పెద్ద బిజినెస్‌ మ్యాన్‌ని చేసుకుంటా. నాకు విదేశాలు తిరగాలని చాలా ఆశ. బాగా డబ్బున్నవాడైతే నన్ను అన్నిచోట్లకు తిప్పుతాడు. నాకు షాపింగ్‌ చేసుకోవడానికి బోలెడు డబ్బులు ఇస్తాడు’’ అంది జ్వాల ముసి ముసిగా నవ్వుతూ.