కౌసల్యా సుప్రజా రామా... అంటూ పాడుతున్న భార్య శ్రావ్యమైన గొంతు అతన్ని నిద్రలేపింది. ప్రాతఃకాలం వేళ అలా వినిపించే సుప్రభాతం అతన్ని ముగ్ధుణ్ణి చేస్తుంది. గమ్మత్తైన లోకాలకు తీసుకువెళ్తుంది. ఏ నిమిషాన ‘కాంతి’ మెడలో మూడుముళ్ళు వేశాడో, అప్పటినుంచి తన జాతకమే మారిపోయింది. చిన్న పెంకుటింట్లో కటాకటిగా సంసారాన్ని లాక్కొచ్చే తన సంపాదన ఉన్నట్టుండి బంగారపు పట్టాలపైన ప్రయాణించటం ప్రారంభించింది. అది తను ఏ మాత్రం ఊహించలేదు. ఇంతటి సిరి ఆమె తీసుకువస్తుందని, తన చీకటి జీవితానికి ఆమె వెలుగు చుక్కాని అవుతుందని. ఒడ్డున నిలబడి తీరం నదిని ఆహ్వానించినట్లు తన ప్రతి అడుగులోనూ ఆమె ముందుండి నడిపించేది. అది తన అదృష్టంగా భావించేవాడు ‘భావన’.

నీలపల్లి నుంచీ కాకినాడకు మకాం మార్చటం తన జీవితంలో ఓ పెద్దమలుపు. అక్కడినుంచీ పట్టిందల్లా బంగారమవ్వటం ప్రారంభించింది. అప్పటినుంచీ చెయ్యని వ్యాపారం లేదు. అన్నింటా లాభమే! మొదట్లో మూడు గదులు అద్దెకు తీసుకుని ఒక గదిని మరొకరికి అద్దెకు ఇచ్చిన తాము, అదే సంవత్సరం ఇంటిస్థలం కొనుక్కునే స్థాయికి ఎదగటం ఆశ్చర్యకరమైన విషయమే! ఇంకొన్నాళ్ళలో అక్కడే ఓ మంచి భవనం కూడా కట్టుకోగలడని తను ఏ మాత్రం ఊహించలేదు. అంతా కలలోలా జరిగిపోతోంది. తన కష్టానికి మించిన లాభాలు తలుపుతట్టి మరీ తన వాకిట నిలబడుతున్నాయి. ఇలాగే జరిగితే ఊరికో భవనం కట్టెయ్యవచ్చు అనుకున్నాడు. అనుకోవటమే కాదు దానినీ సాధించాడు.ఇద్దరు రత్నాలు లాంటి పిల్లలకు తండ్రి అయ్యాడు. కిరణ్‌, భవ్య. ప్రాణాలన్నీ వారిమీదే పెట్టుకుని పెంచుకున్నారు.

వ్యాపారంలో తను తలమునకలవుతుంటే సంసారనావ పగ్గాలను కాంతి తన చేతుల్లోకి తీసుకుంది. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం తొంగిచూసేది. ఏ సమస్యా తనదాకా వచ్చేది కాదు. ఒక పనిమనిషితో ప్రారంభమై నలుగురుగా మారారు. పిల్లలు పెరుగుతూ ఉండడంతో ఏదైనా వ్యాపారంలో స్థిరపడాలన్న ఆలోచన వచ్చింది. అలా కలప వ్యాపారంలోకి దిగాడు. ఇక తనకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. అంతస్తుల మీద అంతస్తులు, ఇళ్ళ మీద ఇళ్ళులా మూడు పువ్వులూ ఆరు కాయలుగా తను వైభవాల బాట పట్టాడు. ఇదంతా భార్య కాంతి పుణ్యమే అన్నది మాత్రం ఏనాడూ విస్మరించలేదు. ఆమెను ఒంటినిండా బంగారంతో సత్కరించడం మొదలుపెట్టాడు.

కొడుకు నల్లగా ఉన్నా, ముద్దుగా శ్రీకృష్ణుడులా ఉండేవాడు. అల్లరి ఎక్కువే చేసేవాడు. అతి గారాబమే దీనికి కారణం అని తెలిసినా తప్పించలేకపోయారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నా అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. వాడేం చెబితే అది చేస్తే గోల ఉండదు కదా అనేది కాంతి కూడా. అది బయటివారికి వింతగా అనిపించేది. పిల్లాణ్ణి అదుపులో పెట్టాల్సింది పోయి ఈవిడ ఇలా అంటుందేమిటి అని. గొప్పవాళ్ళు ఏంచేసినా తప్పుపట్టలేం అని వెనుక గుసగుసలాడేవారు. బయటకు మాత్రం మాట్లాడటం తగ్గించేశారు.