మంచంపై జంతువుల్లా కలిసి తెగబడిన మేము... ఇప్పుడు అనామకుల్లా రోడ్‌పై నిలబడి ఉన్నాం!హుందాగా టక్‌ చేసిన ప్యాంట్‌ షర్ట్‌ వెనుకున్న అతని నిగూఢ శరీరం నాకు తెలియనట్టు! నా అంతః పాతాళమంత వాంఛ అతను ఎరగనట్టు!ఇప్పుడు మాకు స్పర్శ అవసరం లేదు. అయినా తీసుకున్న మా కరచాలనానికి అర్థం లేదు. అనుభూతీ లేదు.‘‘ఎలా ఉన్నావ్‌?’’ఇద్దరం ఒకేసారి పెదవులు కలిపిన ముద్దులా ఒకే ప్రశ్న. నిశ్శబ్దం. మోహం రోదిస్తున్న నిశ్శబ్దం. బయటకి తన్నుకు రాకుండా దుఃఖం చేసే ప్రయత్నానికి, గుండె దిగులుగా ఉన్నా ముఖం గాంభీర్యం నటిస్తోంది.‘‘పని మీద ఉన్నావా.. లంచ్‌ చేద్దాం రా’’ పిలిచాడు.అనుభవం వద్దని చెప్తోంది. మనసు పిచ్చిది కదా! ఎప్పుడూ అదే గెలుస్తుంది. వెంట నడిచాను. ఇదివరకులా చెంగున బండిమీద తన వెనుక కూర్చొని తన నడుం చుట్టేయ లేను. దూరం పాటించాను. అతనూ మొహమాటంగానే ఉన్నాడు.మళ్లీ అక్కడికే... ఏ మాత్రం విచక్షణ లేకుండా అరుచుకొని ఏడ్చుకొని దాదాపు చేయి చేసుకున్న అదే రెస్టారెంట్‌. కనీసం అదే టేబుల్‌ మీద కూర్చోకపోతే చాలు.పోన్లే, ఏదో ఒక మూల కుదురుకున్నాం. డబల్‌ ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌, వర్జిన్‌ మొయిటో. అలవాటైన ఆర్డర్‌ అడక్కుండానే చెప్పాడు. వాళ్లు చెరొక ప్లేటు ఎదురుగా పెడతారు. ఇద్దరం తినేది ఒక దాంట్లోనే. ఇప్పుడు ఎవరి ప్లేట్‌ వాళ్ళది. ఎవరి స్పూన్‌ వాళ్ళది. కొత్తగా ఉంది. బాధగా ఉంది. కోల్పోయిన ప్రేమికుడు ఎదురుగా కేవలం తెలిసిన మనిషిగా కనబడుతుంటే గుండె తట్టుకోలేకపోతోంది. చుట్టూ గాలి స్తంభించినట్టుగా ఉంది.తనని పిలవాలి. ఏమని పిలవాలి? సహజంగా తనని ఎప్పుడూ ఏమని పిలుస్తానో అలానే పిలవాలి. పూర్తి పేరుతో పిలిస్తే కృతకంగా ఉంటుంది. ఎందుకు పిలవాలి? ఎందుకంటే మొదటి స్పూన్‌ ఎప్పుడూ నా చేత్తో తనకే పెడతాను. అది లేకుండా తినడం శీర్షిక లేని దుఃఖపు కవితలా ఉంది.‘‘ఇంకేంటి... ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా’’ తలెత్తకుండా అడిగాడు.‘‘నువ్వెలా ఉన్నావ్‌’’ తన కళ్ళు పైకెత్తు తున్నాడు అనగానే నా చూపు దించాను.

                                      ********************************************