ఇచ్చిన మాటకు కట్టుబడటం, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మన ధర్మాన్ని ఆచరించడం మన వ్యక్తిత్వానికి నిదర్శనం. రామాయణకాలం నుంచీ మన మట్టిలో జీర్ణించుపోయిన గొప్ప ధర్మమిది. సామాన్యమానవుడైనా, అసామాన్య వీరుడైనా మాటకు కట్టుబడి తన కర్తవ్యం నిర్వర్తించినవాడే మార్గదర్శి. ఈ కథలో రామాచార్యులు కూడా అంతే. ఇచ్చిన మాటకోసం అతడెంత త్యాగం చేశాడంటే..

ఆ ఊరు పేరు ములకల్లంక.నిజంగానే అది లంక గ్రామం. ఊరు చుట్టూ గోదారమ్మ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఒక్క మే నెల ఎండల్లో మాత్రం ఒకవైపు ఇసుకపాయలో నీరు తగ్గి దారి ఏర్పడుతుంది. నీరు ఉన్నప్పుడు పడవలమీద, లేనప్పుడు కాలినడకన గోదారిపాయ దాటి పట్నంవెళ్ళి పనులు చూసుకుని వస్తుంటారు.ఊరంతా ఉన్నది పదివేల ఎకరాల వెడల్పు ఉన్న లంకమీద. అందులో వెయ్యిఎకరాలు ఊరు విస్తరించి ఉంది. మిగిలినదంతా పొలాలే. అంతేకాదు, ఊరుచుట్టూ చిన్నచిన్న లంకలు ఉన్నాయి. అవి కూడా ఆ ఊరు పంచాయితీలోకే వస్తాయి. అవి కూడా కొన్నివేల ఎకరాల్లో ఉంటాయి.

ఈ నీటిమధ్యన లంకల్లో ఊరు ఎవరు కట్టారో, ఎందుకు కట్టారోగానీ ఆ ఊరు ఏర్పడి వందలసంవత్సరాలు అయ్యిందంటారు. అక్కడ ఉన్న పురాతన పాఠశాలమీద రెండువందల ఏళ్ళక్రితంనాటి శిలాఫలకం ఉంది. పిఠాపురం రాజావారే ఆ పాఠశాల కట్టించినట్టు ఆ శిలాఫలకంమీద కూడా ఉంది.ఊరు జనాభా ఐదువేలు. ఆ ఊళ్ళో ముంపుప్రాంతాలను గోదావరికి ఒకవైపున్న ఏటిగట్టు అవతలకి తరలించారు. అయినా ఊరుకు తరుగులేదు. ఊరువన్నె తగ్గలేదు. ఊరంటే ఊరుకాదు. ముచ్చటైన ఊరు. జనం కలిసిమెలిసి ఉండే ఊరు. పొరపొచ్చాలు లేవనికాదు. వాటిని దాచుకుని కలిసిపోయే ఊరు.ఆ ఊళ్ళో తలలో నాలుకలాంటివాడు రామాచార్యులు. అతను ఆ ఊరి పురోహితుడు. తాతలు, తండ్రులకాలం నుండి వారసత్వంగా వస్తున్న వృత్తినే చేపట్టి గౌరవంగా బ్రతికేస్తున్నాడు. ఊరివారికి ఏ కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఆయనే ముందుండేవాడు. ఆయనకు వైద్యంకూడా కొంత తెలిసి ఉండడంచేత అందుకుకూడా ఆయన్ని పిలుస్తూ ఉండేవారు.రామాచార్యులు మంచి లౌక్యుడు. కీలెరిగి వాతపెట్టే లక్షణం ఉన్నవాడు. తను పౌరోహిత్యం వృత్తిని ఎంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నాడో ఊరివాళ్ళు కూడా తనను అలాగే చూడాలనుకునేవాడు. అవకతవకలకు పాల్పడేవాళ్ళకు చురకలువేసి మరీ వాళ్ళను దారికి తెచ్చేవాడు.