సుబ్బారావుకి రాత్రంతా నిద్దరలేదు. ఆలోచించి... ఆలోచించి బుర్ర వేడెక్కిపోయి తలకాయలోంచి సెగలు, పొగలు కూడా వచ్చేస్తున్నాయ్‌. చివరాఖరికి ఈ ఆలోచన ఎక్కడికి దారితీస్తదా? అన్న భయం కూడా పట్టుకుంది.అసలీ ఆలోచన యొక్క అంతుకానీ తేలిందా? ఆ దెబ్బకి నోబెలో.. గ్లోబలో కాకున్నా... చిన్నదో.. పెద్దదో ఏ నందో, పందో లాంటి అవార్డన్నా వచ్చి ఒళ్లోపడేలా ఉందనిపించింది. వెధవ బుర్ర! నొప్పొస్తే వచ్చింది కానీ, ఇంతటి దివ్యమైన ఆలోచనొచ్చి ఆచంద్రార్కం నీ పేరు, మీ వంశం పేరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోయే అవకాశం వచ్చేసిందిరా వెర్రిసుబ్బడూ! అని అతని అంతర్‌ శరీరవాణి గుండె లోతుల్లోంచి ఘోషించడం మొదలెట్టింది.అక్కడికీ సుబ్బారావు తనకొచ్చిన అనుమానం మరీ అంత గొప్పదేమీ కాదేమో అని, మరీ ఎక్కువ ఊహించుకుంటున్నానేమో అని ఒకటికి, రెండుసార్లు అనుకోకపోలేదు.

‘ఇంగో సుబ్బడూ! గొప్ప, గొప్పవాళ్ళయిపోయినోళ్లందరికి మొట్టమొదట ఇట్లాంటి పనికిమాలినాలోచనలే వచ్చాయిరా. లేకపోతే అతనెవరు న్యూటనా? బోటనా?చెట్టు మీద నుంచి సీమరేక్కాయ మీదడితే దాన్ని గుటుక్కున మింగెయ్యకుండా కిందకే ఎందుకు పడింది? పైకెందుకు పోలేదు అంటా ఆలోచిత్తాడా చెప్పు? అలాగే బూజులోంచి పెన్సిలిన్‌ తీసిన ప్లెమింగూ, షాక్‌ కొట్టుద్దని తెలిసీ గాలిపటం దారానికి తాళంచెవి కట్టి, దానెనుక పరిగెత్తి మరీ ప్రాణం మీదకు తెచ్చుకున్న ప్రాంక్లినూ ఇలా ఎందరెందరో గొప్ప, గొప్ప శాస్త్రవేత్తల మెదళ్ళని నీకొచ్చినలాంటిదే. పనికొచ్చేదో, పనికిమాలినదో ఏదోటంటూ ఒక ఆలోచనంటూ వచ్చి కుదిపెయ్యబట్టే కదా ఆళ్ళంత గొప్పోళ్ళు అయ్యింది. నువ్వు కూడా నీకొచ్చిన డౌటనుమానాన్ని తేలిగ్గా తీసిపారెయ్యకుండా దానంతు, పంతు చూసి ఆళ్ళలాగా చరిత్రలో కాస్త చోటు సంపాదించేసుకో’ అని హితబోధోకటి చేసిపడేసింది.ఇంతకీ సుబ్బారావుని నానారకాలుగా ఇబ్బంది పెట్టేసి, తర్జనభర్జనకు గురిచేస్తున్న ఆ బృహత్తరమైన ఆలోచన ఏమిటంటే వడ్లగింజలో బియ్యపుగింజ - ‘ఆవకాయకి ఆ పేరు ఎలా వచ్చిందా?’ అని. అదేంటో కనుక్కునే దాక ఆరు నూరైనా వెనుతిరిగేది లేదంతే అని ఫిక్సయిన సుబ్బారావు విషయమేమిటో తేల్చుకుందామని ముందుగా అప్పటివరకు ఎప్పుడూ లైబ్రరీ మొఖమే చూడనివాడైనా మరీ పక్కూరిలో ఉన్న గ్రంఽథాలయానికి వెళ్ళాడు. వెళ్ళటం వెళ్ళడమే సరాసరి లైబ్రేరియన్‌ దగ్గరికెళ్ళి కొత్తగా అప్పుడే వీధి బళ్ళో జాయినయిన పిల్లోడిలాగా చేతులు కట్టుకుని నిలబడి ‘గురువుగారూ? అసలు ఆవకాయకి ఆ పేరు ఎలా వచ్చిందంటారూ?’ అని అడిగాడు. అతగాడికి సదరు సుబ్బారావు అడిగిందేమిటో అర్థం కాక, ‘ఊరగాయ పెట్టడం కూడా ఒక కళ’ అన్న ఓ పుస్తకం తెచ్చి సుబ్బారావు చేతిలో పెట్టాడు.