అతడు ఆ ఇంటికి పెద్ద కొడుకు. తల్లితో సహా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ రైల్వేస్టేషన్‌కెళ్ళి అతన్ని రిసీవ్‌ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళారు. ఎంతో సంబరపడ్డారు. వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా గుంటూరు సమోసాలు, జీడిపాకం, బండమిఠాయిలు తెచ్చి ఇచ్చాడతను. ఆనందంగా అందరూ రెండు రోజులు సంతోషాలు పంచుకున్నారు. ఆ కుటుంబాన్ని చూసి ఎంతో ఉత్తేజితుడైన పక్కింటి పరబ్రహ్మం ఏంచేశాడు?

ప్లాట్‌ఫారం మీదకు ప్రవేశించింది రైలు. సీట్లోంచి లేచి, బ్యాగులు భుజానికి తగిలించుకున్నాను. ప్రయోజకుడై సొంత ఊరికి తిరిగి వచ్చే సినిమా హీరోలాగా, మా వాళ్ళందరికీ కనపడే విధంగా వెళ్ళి బోగీ ఎంట్రన్స్‌ దగ్గర నిలబడ్డాను ప్లాట్‌ఫారంమీదకు చూస్తూ. ఓ నిముషానికి మా వాళ్ళు కనిపించారు. ముందుగా మా రెండో చెల్లెలు, పక్కనేమో అమ్మ, తర్వాత మిగిలిన వాళ్ళు నన్ను చూశారు. చెయ్యి ఊపాను.

‘‘అడుగో అన్నయ్య’’ నా రెండో చెల్లెలు లక్ష్మి పెద్దగా అరిచింది. అంతా ఒక్కసారిగా నేను నిల్చున్న రైలు పెట్టి వెంట చిన్నగా పరుగు దీశారు. నాకెంతో సంతోషం కలిగింది. రైల్లోంచి దిగగానే ముందుగా అమ్మను పలకరించాను. నన్ను చూడగానే అమ్మ కళ్ళల్లో సంతోషం కనపడింది. నేను పెద్దకొడుకును. అంతా కలిసి స్టేషన్‌ బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత నా రెండో చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆటోలు మాట్లాడుతోంది. అంతా అక్కడే ఉన్నారు. నాకు జరదాపాన్‌ నమిలే అలవాటు. దానికోసం స్టేషన్‌ బయట పాన్‌ దుకాణం దగ్గరకు బయల్దేరాను. నా కదలికను గ్రహించి నేను రెండడుగులు వెయ్యగానే ‘‘అన్నయ్యా’’ అని పిల్చాడు నా ఆఖరి తమ్ముడు జగదీష్‌.ఆగి వెనక్కు తిరిగాను. అప్పుడు వాడు, ఐదారు పాన్‌లున్న మైనపు కవరు జేబులోంచి తీసి నాకు చూపిస్తూ పాన్‌లు ఉన్నాయి. నువ్వు వెళ్ళొద్దు’’ అన్నాడు నవ్వుతూ. నా అలవాటు వాడికి తెలుసు. అందుకే ముందుగా పాన్‌లు తీసుకుని జేబులో ఉంచుకున్నాడు. తిరిగి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే రెండు ఆటోలు మాట్లాడింది మా చెల్లెలు.