‘‘అమ్మా.. చైనాలో సొంతంగా హాస్పిటల్‌ పెట్టాము. నీ కోడలు ‘యాంగ్‌మి’ కూడా డాక్టరే’’ చెప్పాడతను.‘‘యాంగ్‌మీ యేంట్రా హ్యాంగ్‌మీ లాగా’’ అంది.‘‘అక్కడి పేర్లు అలాగే వుంటాయిలేమ్మా’’ అన్నాడతను.నా కొడుకు ఎంత గొప్పవాడైపోయాడోనని పొంగిపోయింది. కొడుకు చెప్పే ప్రతి మాటా... చెవిలో తేనె పోసినంత తియ్యగా అనిపించి, అతను ఏం చెప్పినా కాదనలేకపోయింది.

‘‘నా ఫోన్‌ నెంబర్‌ మీకెట్లా తెలుసు?’’‘‘ఓ.. అదా! ఈ కాలంలో ఎన్నో సామాజిక మాధ్యమాలున్నాయి. ఫోన్‌ కనిపెట్టడం అంత కష్టం కాదు గదా... ఈ వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌లు చూసే మీకూ మెసేజ్‌లు పెడుతున్నాను. అంతే లక్ష్మమ్మగారూ.’’‘‘సరే బాబూ! మీరు చిట్‌చాట్‌ చేస్తుంటే ఎవ్వరూ లేని నాకు, చెప్పలేనంత ఆనందంగా వుంది. మీ ఫుల్‌ ఫోటో ఒకటి పెట్టగూడదా?’’ఆమె గుడిసె మధ్యలో కూర్చొని సెల్‌ ఆన్‌ చేసింది. రోజూ మెసేజ్‌లు పెట్టే అతనివాట్సాప్‌ చూసింది. అది ఖాళీగా వుంది. వారం పైనే అయింది. అతన్నుంచి ఏ మెసేజ్‌ రాలేదు. ఒక చేత్తో ముఖం మీద పడుతున్న నెరిసిన తెల్లజుట్టును పక్కకు తోసి, తలఎత్తి కప్పువైపు చూసింది.‘ఏమైంది తనికి? ఈమధ్యన వొగ మెసేజ్‌ కూడా లేదు. పొద్దున్నే వొగటి, రేత్రి వొగటి తప్పకుండా పంపేవాడు.

వారమైపాయె. మెసేజీనే రాలే’ ఆలోచిస్తూనే సెల్‌నుచూస్తోంది.ఈ మధ్యన ఆరు నెలల నుంచీ ‘హలో లక్ష్మమ్మగారూ.. బాగున్నారా?’ అనో, ‘గుడ్‌ మార్నింగ్‌ లక్ష్మమ్మ గారూ’ అనో, రాత్రి తిరిగి ‘గుడ్‌ నైట్‌’ అనో, ‘శుభరాత్రి’ అనో అతన్నుంచి మెసేజ్‌లు వచ్చేవి. వారం రోజులుగా అతన్నుంచి ఎలాంటి వీడియోగానీ, మెసేజ్‌గానీ రాలేదు.‘అయినా అతను నాకెందుకు మెసేజ్‌లు పెట్టాలి? అతనికీ నాకూ ఏ సంబంధం వుందనీ? అతనికి నేనేమౌతాననీ?’తనను తనే ప్రశ్నించుకుని మనసును సమాధాన పరచుకుంది.వీధిలోనుంచి వీస్తున్న చల్లగాలి గుడిసెలో దూరి పలుకరించిపోయింది.లక్ష్మమ్మ ఎలిమెంటరీ స్కూలు టీచర్‌గా రిటైరై అయిదు సంవత్సరాలయింది. ఆమెకు ఎనకా ముందూ ఎవ్వరూ లేరు. ఒంటరిగా చిన్న పూరింట్లో జీవిస్తోంది. చాలీ చాలని పెన్షన్‌తోనే బండి నెట్టుకొస్తోంది. ఆ గుడిసెలో గతించిన జ్ఞాపకాలతో కాలం గడుపుతోంది.