ఏదైనా సాధించాలంటే ముందు మానవ ప్రయత్నం చెయ్యాలి. మన బలం సరిపోనప్పుడు ఆ దేవుడికి మన సమస్య చెప్పుకుని మ్రొక్కుకోవాలి, మనవడికి వివరంగా చెప్పింది బామ్మగారు. చిన్నచిన్న వాటికి మనం మ్రొక్కులు మొక్కకూడదని కూడా మనవడికి కౌన్సిలింగ్ చేసిందాబామ్మగారు. ఒక శుభముహూర్తాన ఆ మనవడు కూడా దేవుడికి మాంఛి మ్రొక్కు మొక్కుకున్నాడు. ఏమిటా మ్రొక్కు?

ఆరోజు గురువారం. శనివారం అమ్మ మ్రొక్కు తీర్చడానికి యాదగిరిగుట్ట వెళ్ళాలి.నిన్నటి నుంచీ ఆకాశం మేఘావృతమై ఉంది. ఉండుండి వాన తుంపర పడుతోంది. వాతావరణశాఖ అంచనా ప్రకారం - రేపటికిది పెనుతుఫానుగా మారొచ్చు.‘‘వెధవ వాన. సరిగ్గా సమయానికి పట్టుకుంది’’ విసుక్కున్నాను.‘‘యోగముంటే ఈ శనివారం వెడతాం. లేకుంటే పై శనివారం వెళ్ళొచ్చు. అనవసరంగా వానని తిట్టకు’’ మందలించింది అమ్మ.ఎండిన బీడుని పచ్చని తోటగా మార్చేదీ వానే. పండిన పంటని తడిపిముద్దచేసి నిరర్థకం చేసేదీ వానే. నదుల్ని నింపేదీ వానే. ఊళ్ళని ముంచేది వానే.ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలి కానీ - ప్రకృతి ప్రసాదించిన వరమైన వానని ఏమీ అనకూడదు.అమ్మకి అలాగే అనిపిస్తుంది. ఆమె మ్రొక్కు కూడా వానలాంటిదే.మా క్షేమంకోసం తను మ్రొక్కుకుంటుంది. అది తీర్చడానికి నేను ఇబ్బంది పడాలి.ఇదిగో ఇప్పుడు యాదగిరిగుట్టకి ప్రయాణం అలాంటిదే!వాన గురించి అమ్మకంటే నేనే కలవరపడ్డాను కానీ, శుక్రవారం సాయంకాలానికే వాన పూర్తిగా తెరిపిచ్చి, కొంచెం ఎండపొడ కూడా కనిపించింది.

శనివారం ఉదయం ఆరుగంటలకే కార్లో యాదగిరిగుట్టకి బయల్దేరాం.నేను డ్రైవింగ్‌ సీట్లో, పక్కనే నా భార్య లత. వెనక సీట్లో - డెబ్బయ్యో పడిలోని అమ్మానాన్నలు. ఐదేళ్ళ నా కొడుకు చింటూ.ఇలాంటి యాత్రలు మాకు మామూలే. అమ్మకి భక్తి ఎక్కువ. ఆ భక్తితో మ్రొక్కే మ్రొక్కులూ ఎక్కువే. తనకి నేను లేక లేక పుట్టిన ఏకైక పుత్రరత్నాన్ని. నా పుట్టుక తన మ్రొక్కుల ఫలితమే అంటుంది అమ్మ. ఫలితంగా ఇప్పుడు ఆమె మ్రొక్కులు తీర్చే బాధ్యత నాదయ్యింది.నాన్నగారికి కొత్త కొత్త ప్రదేశాలు చూడ్డం, ప్రదేశం పాతదైనా ప్రకృతిని ఆస్వాదించడం ఆయనకు చాలా ఇష్టం. ఆయనకి భక్తి ఉంది కానీ మ్రొక్కుకునే అలవాటు లేదు. ఆధ్యాత్మిక గ్రంథాలు విపరీతంగా చదువుతారు. స్నానం చేశాక ఓ గంట జపం చేస్తారు. ఆధునికుల కోసం దాన్ని మెడిటేషన్‌ అన్న పేరుతో సమర్థించుకుంటారు.