నిద్రపోతేనే కదా... కల వచ్చేదీ! మళ్ళీ ఆ కలలో నిద్రపోతే...!?ఒక్కొక్కప్పుడు అలాగే జరుగుతుంది. ఇలలో చేసిన అన్ని పనులూ, కలలో కూడా చేస్తాం కదా! ఎవరినో కౌగిలించుకున్నట్లూ, ముద్దు పెట్టినట్లూ, సుఖం పొందినట్లూ మాత్రమే కాదు... పరుగెత్తినట్లూ, అలసిపోయినట్లూ, నిద్రపోయినట్లూ కల వస్తుంది.

మొద్దు నిద్ర. నిద్రలోని నిద్ర. కలలోని నిద్ర. మెలకువ వస్తే బాగుణ్ణు. గింజుకుంటున్నాడు. కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఎవరో ఒకరు తన్ని లేపాల్సిందే. ఆ పని తన పక్కలో పడుకున్న ప్రార్థన చెయ్యాలి. కానీ చెయ్యలేదు.‘తన్ను ప్రార్థనా.. నన్ను తన్ను ప్రార్థనా..!’తడిమి చూశాడు, ఆమె దొరకలేదు; అరచి చూశాడు, పలకలేదు. ఇదంతా కలలోపలి నిద్రలోనే.. కడకు తానే ఒక్క ఉదుటన లేవబోయాడు. నొప్పి!కలలోని కల చెదిరింది. నిద్రపోతున్నట్లు వచ్చిన కల తొలిగింది. అలల్లేని కడలి లాగా, కలల్లేని సాదా సీదా నిద్ర మిగిలింది. చిన్నగా మూలిగాడు కలిదిండి విభాత వర్మ.‘... ండీ...! ఏమండీ..! ఏమయ్యిందీ..?’ ఒక చేత్తోనే అతడి భుజంమీద చెయ్యివేసి, చెట్టును ఊపినట్లు ఊపేసింది ప్రార్థన.

వర్మకు పూర్తి మెలకువ.. సంపూర్ణ విముక్తి! చేప పిల్ల, నేల విడిచి నీటిలోకి దూకినంత సంతోషం. తన శరీరాన్ని తాను అనుకున్నట్లు కదపగలుగుతున్నాడు. కుడికాలి చిటికెనవేలులో చిన్న నొప్పి. తాను పొందిన విమోచనముందు, నొప్పి చాలా చిన్నది. అయినా తన కాలి వైపు చూసుకున్నాడు. వీల్‌ చైర్‌ గోడకు కొట్టుకుని, పాతకాలపు గోడగడియారంలోని లోలకం లాగా ఊగుతోంది.పక్కలోనే, లేచి కూర్చుని తన తల నిమురుతోంది ప్రార్థన.‘అవేం కలవరింతలూ!? నేను మిమ్మల్ని తన్నాలా!?‘అలా అన్నానా?’‘నేనసలు తన్నగలనా!?’ ఇలా ప్రార్థన అనబోతుంటే, తానూ లేచి కూర్చుని ఆమెనోటికి చెయ్యి అడ్డుగా పెట్టి, ‘ఛ.ఛ. అలా ఆలోచించకు రా!’ అని మంచం దిగిపోయాడు. ఊగుతున్న వీల్‌ చైర్‌ను పట్టుకుని మంచం పక్కకు ప్రార్థన కూర్చున్న వైపు తెచ్చి, ఆమెను అమాంతం ఎత్తి అందులో కూర్చోబెట్టి, వాష్‌ రూమ్‌ వైపు తిప్పాడు.‘కాళ్ళు పనిచేస్తే మాత్రం.. మిమ్మల్ని తన్నగలనా? అంత అపచారం చేస్తానా!?’