పిల్లల గదిలోంచి ఏదో తుఫాను వాతావరణం రాజుకుంటోందని అనిపిస్తుంటే అటో చెవి వేస్తూనే మోగుతున్న ఫోన్‌ అందుకుని, ‘‘చెప్పక్కా’’ అంటూ తోటికోడలుని పలకరించింది నందిని.‘‘నందినీ, శ్రావ్యమైన గొంతుతో మన శ్రావ్య చక్కగా సినిమా పాటలు పాడేస్తోందని దాన్ని తీసుకెళ్లి సంగీతం క్లాసుల్లో చేర్చాం కదా. అక్కడ చేర్చేందుకు, ఆ టైం స్లాట్‌ కోసం ఎంత ప్రయాస పడ్డాం ఇద్దరం! అదిప్పుడు సంగీతం ఇష్టంలేదంటోంది. మరీ మరీ అడిగితే హోం వర్క్‌ చేసేందుకు టైం ఉండట్లేదనీ గొడవ. అసలు కారణం ఇంకేదో ఉందని నాకనిపిస్తోంది. 

నువ్వంటే గురి ఉంది, చెబితే వింటుందేమో అని ఆశ. గట్టిగా కోప్పడి నేనే చెబుదామంటే చేతకావట్లేదు. బొత్తిగా భయం నేర్పకుండా తప్పు చేశాననిపిస్తోంది.’’‘‘భయం నేర్పటమేంటక్కా. వాళ్ల భయాలు వాళ్లకెటూ ఉంటాయి. చిన్నప్పటి రోజులు మర్చిపోయావా నువ్వు? నేనైతే ‘అదిగో, బూచాడొస్తున్నాడు’ అంటే వణికిపోయేదాన్ని. సరే, శ్రావ్యని ఒకసారి పంపించు. మళ్లీ మాట్లాడతా’’ అంటూ ఫోన్‌ పెట్టేసి, పిల్లల గదిలో చూస్తే చెల్లి మీద విసుక్కుంటూ కనిపించాడు రాహుల్‌.‘‘చెల్లితో స్నేహంగా ఉండాలి’’ అంటూ ఎప్పటిలాగే వాడికి చెప్పి, ‘‘అన్న బొమ్మలు వేసుకుంటుంటే మాట్లాడించకు’’ అని కూతురికి చెప్పి వంటింట్లోకి వెళ్ళింది.అంతలో డోర్‌ బెల్‌!‘‘రాహుల్‌, తలుపు తియ్యి, ఎవరో వచ్చినట్టున్నారు’’ అంటూ తల్లి పురమాయించే సరికి గబుక్కున లేచి ముందు గదిలోకెళ్లాడు. వాచ్‌మన్‌ ఏదో సర్క్యులర్‌ అందించాడు. దాన్ని తల్లికి అందించి, తన గదిలోకొస్తూనే ఒక్క కేక పెట్టాడు. సంజన రంగులన్నీ కలగాపులగం చేసి బ్రష్‌తో అన్న వేసిన బొమ్మమీద స్వేచ్ఛగా గీసేస్తోంది. ఆ అరుపుకి తనేదో తప్పుచేసినట్టు తోచి, సంజన అలాగే నిలబడి చూస్తోంది. రాహుల్‌ మాత్రం గట్టిగా ఏడుపందుకున్నాడు.రాత్రి తొమ్మిది దాటింది. పిల్లలు నిద్రపోతుండటంతో ఇల్లంతా రాత్రి నిశ్శబ్దానికి మరింత చిక్కదనాన్నిస్తోంది.‘‘ఈరోజు పిల్లల అలికిడి లేదేం?’’ భర్త ప్రశ్నకి జవాబు చెప్పకుండా,‘‘కాస్త భయం చెబుదూ నీ ముద్దుల కూతురికి’’ భోజనం వడ్డిస్తూన్న నందిని మాటలకి సందీప్‌ ప్రశ్నార్థకంగా చూశాడు.