‘‘హాయ్‌, నిత్యా .. గెస్‌, హుయీజ్‌ కమింగ్‌’’ సెల్‌ ఫోనులో అట్నుంచి కవ్వింత గొంతు.‘‘ఓ, యూ.. కాళిందీ.. వాటె ప్లెజంట్‌ సర్‌ఫ్రైజ్‌! ఏమిటి సడన్‌గా ఇన్నాళ్లకి నేను జ్ఞాపకం వచ్చాను?’’‘‘నిత్యా, యిదే ప్లెజంట్‌ సర్‌ఫ్రైజ్‌ అయితే, ఇంక రేపేమంటావో?’’‘‘ఇండియా వచ్చావా? ఎప్పుడు? ఎన్నాళ్లయిందీ నిన్ను చూసి’’ ఉద్విగ్నంతో అంది నిత్య.‘‘ఏమే, రేపు లంచ్‌కి వస్తున్నా. అమ్మతో చెప్పు, నాకిష్టమైనవన్నీ చెయ్యమని. నీకో పెద్ద సర్‌ఫ్రైజ్‌ రేపటి వరకు ఎదురుచూడు..’’ కవ్వించింది కాళింది.

‘‘ఏమిటి అంత ఊరిస్తున్నావు? చూసేదా, చెప్పేదా, వినేదా.. ఎనీ క్లూ ప్లీజ్‌’’‘‘వెయిట్‌ అండ్‌ సీ, ఒకే.. రేపు పన్నెండు కల్లా వస్తా. సాయంత్రం వరకు కబుర్లే కబుర్లు. సరేనా?’’ ఫోన్‌ పెట్టేసింది.పక్కన నుంచుని ఎవరూ అన్నట్టు చూస్తున్న తల్లితో ‘‘అమ్మా, కాళింది. ఇండియా వచ్చిందట. రేపు లంచ్‌కి వస్తానంది. తనకిష్టమైన వంటల లిస్టు నీకు తెలుసంది. చెయ్యాలట ..’’‘‘వంటేం భాగ్యం .. యిన్నాళ్లకి వచ్చిందా, ఈ మఽధ్య అంతా వాళ్ల అమ్మే వెళ్లివచ్చేది. ఎప్పుడో చాలా రోజుల క్రితం బజారులో కనపడి మాట్లాడిందని చెప్పాగా.. ప్రేమ, పెళ్లి, డైవోర్స్‌ .. అన్ని విషయాలు చెప్పి ఎంతో బాధపడింది. పాపం.. మళ్లీ పెళ్లి చేసుకుందా .. సర్‌ఫ్రైజ్‌ అంటోంది’’ వరలక్ష్మి కుతూహలంగా అంది.‘‘ఏం చెప్పలేదుగా, ఊరించింది. రేపటి వరకు చూడు’’ అంది నిత్య.

****************

సరిగ్గా పన్నెండు గంటలకి కాలింగ్‌ బెల్‌ మోగింది. పరిగెత్తినట్టే వెళ్లి తలుపుతీసింది నిత్య .. ఎదురుగా కాళింది! చేతిలో ఫారెన్‌ బొమ్మలాంటి పాప. రెండో చేతినిండా బ్యాగులతో నిలబడ్డ కాళిందిని కాక ఫారెన్‌ పాపాయినే ఆశ్చర్యంగా చూస్తూ, మాటలు మరిచిన దానిలా వుండిపోయిన నిత్యతో ‘‘ఏమిటి ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములనే చూస్తున్నట్టు, నావంక చూడకుండా, రమ్మనకుండా .. ఓ హగ్‌ లేదు, కిస్‌ లేదు .. ’’ అంటూ చేతిలో బ్యాగులన్నీ ఓ సోఫాలో పడేసి, పాపని నెమ్మదిగా సోఫాలో పడుకోబెట్టింది. నిత్య తేరుకుని స్నేహితురాలిని చుట్టేసింది అభిమానంగా.