చింతనాగ్ని’ని రగిల్చిన దార్శనికుడు
 
తత్వ, మనోవిజ్ఞాన శాస్ర్తాలను కాచి వడపోసిన అన్నపరెడ్డి బుద్ధఘోషుడు (అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి) జగమెరిగిన పరిశోధకుడు. పైగా అధ్యాపకుడు, సంపాదకుడు.  ‘మిసిమి’ అనే పత్రికకు సంపాదకుడిగా పనిచేస్తున్నపుడు అందులో తత్వ, మనోవిజ్ఞాన శాస్ర్తాలపై రాసిన అనేక పరిశోధనాత్మక వ్యాసాలలో ఆణిముత్యాలనదగిన 41 వ్యాసాలను గుదిగుచ్చి ఈ ‘చింతనాగ్ని కొడిగట్టిన వేళ’కు రూపకల్పన చేశారు. ఈ మధ్య రాసిన 29 బౌద్ధ గ్రంథాలతో కలుపుకుని వివిధ తాత్విక అంశాల మీద ఆయన మొత్తం 75 గ్రంథాలను రాశారు. ఈ వ్యాసాలన్నిటిలోనూ తర్కం, మీమాంస, మనస్తత్వ శాస్త్రం, సమాజ శాస్త్రం, తత్వ శాస్త్రం వంటి ‘చింతన’ సంబంధమైన అంశాలు ప్రతిఫలిస్తూనే ఉంటాయి. వ్యాసాల అధ్యయనం పూర్తయ్యేసరికి ‘అన్నపరెడ్డి’లోని దార్శనికుడు కట్టెదుట నిలబడ తాడు. 
అతి వేగంగా చోటు చేసుకుంటున్న ప్రపంచీకరణలో మనిషి అనేక విధాలుగా విచ్ఛిన్నమవుతున్నాడు.  విజ్ఞానశాస్త్ర పరంగా, అభివృద్ధి పరంగా నింగిలోకి దూసుకుపోతున్నట్టు కనిపిస్తున్నా,  మూఢనమ్మకాలు, దురాచారాలు, దురలవాట్లు తదితర అనేక వికృత గమనాలతో వెనుకపట్టు పడుతూనే ఉన్నాడు. మనిషిలో అంతర్లీనంగా కాస్తో కూస్తో నిక్షిప్తమై ఉండే చింతనాగ్ని క్రమంగా కొడిగడుతోందే తప్ప శోభాయమానంగా ప్రభవించడం లేదు. మానవ ప్రపంచం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండడానికి, ఈ ప్రపంచం తన సొంత ఇల్లు అనే స్థాయిలో మానవాళి జీవించలేకపోవడానికి ఇదే కారణమని ఆయన ఇందులోని అనేక వ్యాసాలలో కళ్లకు కట్టినట్టు వివరించారు. మానవుని బౌద్ధిక నేపథ్యం రోజురోజుకూ బలహీనమైపోతోందనే ఆవేదనను ఆయన అనేక సందర్భాలలో వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆధునిక జీవితాన్ని, ఆధునికానంతర జీవితాన్ని కూడా మెరుగుపరచుకోవడానికి ఆయన ఈ చిరు గ్రంథం ద్వారా మార్గనిర్దేశనం చేశారు. తన మేధో ప్రయాణంలో మనలనూ భాగస్వాముల్ని చేశారు.
   - జి. రాజశుక
చింతనాగ్ని కొడిగట్టిన వేళ, అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి

పేజీలు : 277, 

వెల : రూ.150,

ప్రతులకు: పల్లవి పబ్లికేషన్స్‌, సెల్‌: 98661 15655