ధర్మం శరణం గచ్చామి

బుద్ధుడు పేరు వినగానే ‘ధర్మం’ పర్యాయ పదంగా మన గుండెల్లో ధ్వనిస్తుంది. 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చేసిన బోధనలు నేటికీ ఆచరణీయాలు, అనుసరణీయాలు. ధమ్మపదం అంటే పాలీ భాషలో ధర్మ మార్గం. దీనిని బుద్ధుని బోధనల సారాంశంగా పరిగణిస్తారు పండితులు.జేతవనం, వేణువనం, అంతరామ గయ వంటి పలు ప్రాంతాల్లో తన శిష్యులకు, జిజ్ఞాసువులకు, బాధితులకు బుద్ధుడు ఇచ్చిన సందేశాల సమాహారమే సమకాలీనమైన, సార్వజనీనమైన మహా ధార్మిక కావ్యం ‘ధమ్మపదం’గా రూపుదిద్దుకుంది.‘‘బంగారు నాణేల వర్షం కురిసినా, చల్లారవు మనసున ప్రజ్వరిల్లే విషయవాంఛలు’’ ... ‘‘అనంతానందం కోసం పరిత్యజించాలి స్వల్ప సుఖాలను’’, ‘‘భయం అవసరం లేని చోట భీతి చెందువారు - భయ హేతువులున్నా భయపడక భ్రాంతిలో బతికేవారు, దుర్గతిలో పడక తప్పదు తమ మిధ్యా దృష్టితో ’’ఇలా .... 26 అధ్యాయాలలో 423 గాథలున్నాయి. మాక్స్‌ముల్లర్‌ తన ‘సేక్రెడ్‌ బుక్స్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అను గ్రంఽథ సముదాయంలో పదవ సంపుటంగా ధమ్మపదంను ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఆ ఆంగ్లానువాదం ప్రాతిపదికగా రచయిత బెందాళం కృష్ణారావు దీనిని తెలుగీకరించారు. ఆయన కృషి అభినందనీయం. ఏది ఏమైనా పాలీ భాషలో అంతో ఇంతో ప్రవేశముంటేనే ఏ అనువాదమైనా మూలానికి దగ్గరగా వెళ్ళగలుగుతుంది. ‘ధమ్మపదం’ పేరుతోనే గతంలో ప్రముఖ కవి, అభ్యుదయవాది గజ్జెల మల్లారెడ్డి చేసిన అనువాదాన్ని చెన్నూరి ఆంజనేయరెడ్డి ప్రచురించారు. ఇప్పుడు పల్లవి పబ్లికేషన్స్‌ మరోసారి ఆ ప్రయత్నం చేసింది.

- రామినేని కృష్ణ ప్రసాద్‌

ధమ్మపదం, బెందాళం క్రిష్ణారావు

పేజీలు : 274, వెల : రూ.150, ప్రతులకు : 98661 15655