చూపుతో రాస్తే అవి కథలు అవుతాయి గానీ గొప్ప కథలు కావు. మంచి కథకి దృష్టి (దృష్టికోణం లేదా దృక్పథం) తప్పనిసరి అంటారు కథా రచయిత బమ్మిడి జగదీశ్వరరావు. కథ, కవిత, వ్యాసం, గల్పిక, అల్పిక (స్కిట్‌), నాటకం వంటి ప్రక్రియల్లో తనదైన మార్గంలో కృషిచేస్తున్నారాయన.జానెడుపొట్ట జీవితాన్ని మింగేస్తోంది, ఏ ప్రయోజనం లేనిదే ఎవరూ ఎవరితో మాట్లాడలేని పరిస్థితులు వచ్చాయి. ‘పలుకుబడిగల పెద్దలు’ ఈ వ్యవస్థని పెంటకుప్పలా తయారుచేస్తున్నారు. కానీ పెంటకుప్పలోనే బలమైన మొక్కలు మొలుస్తాయి. వ్యవస్థను బాగుచేసుకునే మార్గాన్ని ప్రజలే ఎన్నుకుంటారు అంటారాయన. ఈనాటి రచయితకు వేయి చేతులు, వేయి కళ్ళూ ఉండాల్సిందే అంటారు బమ్మిడి.ఏ రచయితయినా పనిచేసేవాడిగానే ఉండాలిగానీ, ప్రదర్శకుడిగా ఉండకూడదు, రచన బాగుంటే జనమే దాన్ని మోసుకుపోతారు. వాదాలు ఎన్నున్నా నేను వేదనలకే కట్టుబడతాను, వాదాలన్నీ నా రచనలకు మెరుగులు దిద్దే పనిముట్లే అంటున్నబమ్మిడి జగదీశ్వరరావు ఇంటర్వ్యూ ఈ వారం....

మనసుకు హత్తుకునే రచన చేయడమంటే స్వచ్ఛమైన నీటిని దోసిలితో తీసుకుని తాగి ఆస్వాదించడం లాంటిదే. మంచినీటికోసం ఒక బావిని తవ్వాలంటే పలుగు,పార, డ్రిల్లింగ్‌ మిషన్‌ వంటి పనిముట్లు అవసరం అవుతాయి. అలాగే రచనలు చేయడం కోసం సమాజానికి అనుసంధానం అయినప్పుడు వ్యక్తులను, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి నేను అన్ని యిజాలను పనిముట్లుగా ఉపయోగించుకుంటాను. కంటికి కనిపించని సత్యం వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించాలంటే ఈ పనిముట్లు (ఇజాలు లేదా వాదాలు) అవసరం. వివరంగా చెప్పాలంటే స్ర్తీని గౌరవించమంటాయి సంప్రదాయాలు. ఫ్రాయిడిజం ఆపోజిట్‌ సెక్స్‌ పట్ల ఉత్సుకతను చూపిస్తుంది. చలం మాటల్లో చెప్పాలంటే స్ర్తీ స్వేచ్ఛను భిన్న సందర్భాల్లో భిన్న రకాలుగా చూస్తారు. కానీ మార్కెట్‌ మాత్రం ఆమెకు వెల నిర్ణయించి వస్తువుగా మార్చి మార్కెట్‌ ప్రోడక్టుని చేస్తుంది. దీని మధ్య వైరుధ్యాన్ని గ్రహించి కంటికి కనిపించని వాస్తవాన్ని వెలికితీయాలంటే మార్క్సిజం, ఫ్రాయిడిజం లాంటి వాదాలన్నింటినీ పనిముట్లుగా ఉపయోగించుకోవాలి. ఏ ఇజానికీ లేదా వాదానికీ కట్టుబడకుండా ఒక పరిపూర్ణమైన ఆలోచనా దృక్పథంతో కంటికి కనిపించని సత్యాన్ని వెలికితీయాలంటే ఈ ఇజాలన్నింటి తలుపులూ తెరిచి వాటిని చదివి అనుభవం ద్వారా బేరీజు వేసి అంచనావేసి రచన చెయ్యాలే తప్ప ఒక ఇజం కళ్ళజోడుతో చూడకూడదు. మనిషి అంటే కేవలం ఫిజిక్స్‌ మాత్రమే కాదు. కెమిస్ర్టీ కూడా. మనిషి అంటే ఏకకాలంలో అటు వైయుక్తికం, ఇటు సామూహికం. ఈ రెంటినీ కలగలిపి చూడాలి. రిజిడిటీ వచ్చినప్పుడు చూపు అలిసిపోతుంది. అందుకని ఒక ఇజానికి కట్టుబడకూడదు. నా లోలోపల అనుభవాల ఆధారంగా నా దృష్టికోణంతో చూస్తూ రచనలు చేస్తాను.

నా ఊరూ, ఇల్లూ

మాది శ్రీకాకుళం జిల్లా. మా స్వస్థలం కాశీబుగ్గ. మా అమ్మ బమ్మిడి సరోజిని. నాన్న రామన్న. నలుగురు అన్నదమ్ముల్లో నేను రెండోవాణ్ణి. 1969 జనవరి ఏడవ తేదీన కాశీబుగ్గలో పుట్టాను. నాకు అమ్మంటే యిష్టం. నాన్నంటే గౌరవం. నాన్నంటే ఒక శ్రమ. పునర్జీవితం ఇచ్చిన నా భార్య పద్మలత (ఇందు) అంటే నాకు మరీ యిష్టం. నాకు ఒక కుమారుడు సజన.