కొద్ది రోజుల క్రితం ‘మాష్‌అప్‌’ అనేది యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ‘అకపెలా’ వీడియోలు ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ‘అందాలలో అహో మహోదయం’తోపాటు పలు పాటలు సంగీత ప్రియుల మదిని దోచేశాయి. ఆ వీడియోల క్రియేటర్‌ అనుదీప్‌ దేవరకొండ. ఆయనను పలకరిస్తే తన సంగీత ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.

మాది అనంతపురం. నాన్న జయరాం చంద్రమూర్తి, బ్యాంక్‌ ఉద్యోగి. అమ్మ కమల, చిన్న బిజినెస్‌ చేస్తారు. నేను పుట్టింది అనంతపురంలోనే! పెరిగిందంతా హైదరాబాద్‌లో. సంగీత నేపథ్యం ఏమీలేని కుటుంబం మాది. చిన్నప్పటి నుంచీ నాకు పాడటమంటే ఇష్టం. నాలో మంచి సింగర్‌ ఉన్నాడని అమ్మే గుర్తించింది. ఆవిడ ప్రోత్సాహంతో ఎనిమిదో తరగతి చదువుతుండగా ‘పాడాలనివుంది’ కాంపిటీషన్‌లో పాల్గొన్నా. ఆ తర్వాత చదువు, హాస్టల్‌లో ఉండటంతో సంగీతం వైపు దృష్టి సారించలేదు.
 
2008లో ‘సరిగమప’లో పాడి ఫైనల్స్‌ వరకూ వచ్చా. అప్పుడే చదువు పూర్తయి రెండేళ్లపాటు ఐటీ జాబ్‌ చెయ్యడంతో సంగీతానికి దూరమయ్యా. ప్రైవేట్‌ జాబ్‌ బోర్‌గా అనిపించి సంగీతంలోనే స్ధిరపడాలని గట్టిగా నిర్ణయించుకు జాబ్‌ మానేశా. అప్పటి వరకూ సంగీతంలో ఏ కోర్స్‌ చెయ్యలేదు. 2013 నుంచీ మధు పొన్నాస్ గారి దగ్గర వోకల్స్‌, కృష్ణ బాలేశ్‌గారి దగ్గర హిందూస్థానీ నేర్చుకుంటున్నా. టీవీ షోల్లో పాడటం, యూ ట్యూబ్‌లో నా ఆల్బమ్స్‌ పెట్టడం వల్ల నాకు మంచి అవకాశాలొచ్చాయి.
కోరస్‌తో ప్రారంభించా...
టీవీ షోల వల్ల కీరవాణిగారు, అనూప్‌ రూబెన్స్‌, తమన్‌ వంటి సంగీత దర్శకుల దగ్గర కోరస్‌ పాడే అవకాశం వచ్చింది. ప్లేబ్యాక్‌ సింగర్‌గా ‘అహా నా పెళ్లంటా’ సినిమాలో ఓ గ్రూప్‌ సాంగ్‌లో గళం కలిపా. ఆ తర్వాత యూ ట్యూబ్‌లో నా వీడియోలు చూసి సన్నీ.ఎం.ఆర్‌ పిలిచి ‘ఉయ్యాలా జంపాలా’లో టైటిల్‌ సాంగ్‌ పాడించారు. అక్కడి నుంచీ బిజీ అయ్యా. అనూప్ రూబెన్స్‌ ‘పిల్లా నువ్వులేని జీవితం’ టైటిల్‌ సాంగ్‌ అవకాశమిచ్చారు. తమన్‌గారి దగ్గరా పాడాను. ఓసారి జిబ్రాన్‌గారికి డెమో పంపించా. ఆయన గుర్తుంచుకుని ‘హైపర్‌’ సినిమాకు పిలిచి ‘కమ్‌బ్యాక్‌’ సాంగ్‌ పాడించారు. ఇటీవల ఆయన సంగీతంలోనే ‘ఖాకీ’లో రెండు పాటలు పాడా. శేఖర్‌ చంద్ర, సునీల్‌ కశ్యప్‌, జె.బి వంటి సంగీత దర్శకుల దగ్గరా పనిచేశా. ‘బాహుబలి’లో పచ్చబొట్టు పాటకు ఓ వెర్షన్‌ నా చేత పాడించారు. నా వాయిస్‌ సూట్‌ కాలేదేమో! ఆ పాట మిస్‌ అయ్యా.
నమ్మకం తక్కువేమో!
తెలుగు సినిమాల్లో తెలుగు సింగర్స్‌కి అవకాశం రావట్లేదు అంటే.. దానికి చాలా కారణాలు ఉంటాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఒక సింగర్‌ అనుకుంటే.. హీరో, దర్శకనిర్మాతలు ఇంకా పాపులర్‌ సింగర్‌తో పాడించాలనుకుంటారు. ప్రజెంట్‌ ట్రెండింగ్‌లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌ స్టూడియోలు చెన్నైల్లో ఉండటంతో అక్కడివాళ్లను పిలుస్తుంటారు. మన దగ్గర టాలెంట్‌ లేకపోవడం కారణం కాదు. తెలుగులో ఎక్కువమంది సింగర్స్‌ ఉన్నారు. కాంపిటీషన్‌ గట్టిగా ఉంది. ఏ సంగీత దర్శకుడైనా తన ఆల్బమ్‌కి గుర్తింపు తీసుకొచ్చే వాయిస్ తో పాడించడానికి ఇష్టపడతారు. అది ఫేమ్‌ వచ్చే వరకే. ఆ తర్వాత ‘బాగా పాడగలరు’ అనుకున్న సింగర్స్‌కి అవకాశం ఇవ్వొచ్చు. మన దగ్గర అది జరగడం లేదు. పాడిన ప్రతి పాటని హిట్‌ చేసే గాయనీగాయకులు మన దగ్గర ఉన్నా ఇక్కడివాళ్ల మీద నమ్మకం తక్కువేమో అని అనిపిస్తుంటుంది.
తిట్టించుకున్నవారూ ఉన్నారు...
పాట కంపోజింగ్‌ ఎలా ఉన్నా.. పాడేవారి గొంతులో ఆ పాటకు తగ్గ క్యూట్‌నెస్‌, శ్రుతీ, లయ కరెక్ట్‌గా వస్తే... అది తప్పకుండా హిట్‌ అవుతుంది. అది సాధనతోనే సాధ్యమవుతుంది. నా పాటలన్నీ వేరే సింగర్‌తో పోల్చుకోవడానికి కుదరన్నంత డిఫరెంట్‌గా ఉంటాయి. రికార్డింగ్‌కి నేను ఎక్కువ టైమ్‌ కేటాయిస్తా. మన సింగర్‌లను కాదని బాలీవుడ్‌, తమిళంలో టాప్‌ సింగర్‌ల దగ్గరకు వెళ్లి గంటలు గంటలు వెయిట్‌ చేసిన వారూ, అదే తరుణంలో ‘గెటవుట్‌’ అని తిట్టించుకున్నవారూ ఉన్నారు. మన దగ్గర టాలెంట్‌ సింగర్స్‌ ఉండగా వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి తిట్టించుకునే కర్మ ఏంటో అర్థం కాదు.
‘అకపెలా’తో గుర్తింపు..
నేనూ, సింగర్‌ లిప్సిక కలిసి ‘అకపెలా’ ప్రక్రియలో మూడు పాటలు చేశాం. అకపెలా అంటే ఓ పాటలో ఎన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌ వినిపిస్తాయో వాటన్నింటినీ గొంతుతో పాడుతూ పాటను తయారు చెయ్యడం. అలా ఓ పాట చెయ్యడానికి పది నుంచి పదిహేను రోజులు పడుతుంది. మేం చేసిన ‘అందాలలో అహో మహోదయం’, ‘ఎదుట నిలిచింది చూడు’, ‘అలే అలే’ పాటలు యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవి చేశాకా నాకు మరింత గుర్తింపు పెరిగింది.
 
గుర్తింపు తెచ్చిన పాటలు
లాలీ లాలీ (ఖాకీ)
అద్దిరబ్బనా (సోగ్గాడే చిన్నినాయనా)
కమ్‌బ్యాక్‌ కమ్‌బ్యాక్‌ (హైపర్‌)
ఇట్టాగే రెచ్చిపోదాం (టెంపర్‌)
ఉయ్యాల జంపాలా టైటిల్‌సాంగ్‌
పిల్లానువ్వులేని జీవితం టైటిల్‌ సాంగ్‌
ఏమైందో ఏమో నా మదిలో (వీకెండ్‌ లవ్‌)
ఈ వేళలోనా (సినిమా చూపిస్త మావ)
 
పరిశ్రమలో ఎవరూ ఎవరికీ సాయం చెయ్యరు. మన ప్రతిభే నిలబెడుతుంది. పాడిన పాట నచ్చకపోవడం, ఆల్బమ్‌లో తొలగించడం వంటివి జరిగినప్పుడు బాధ కలుగుతుంది. ఫెయిల్యూర్‌ చాలా సీరియ్‌సగా తీసుకుంటా. ఆ అనుభవం చాలా నేర్పిస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ బిజీగా ఉన్నప్పటికీ ఏదో వెలితి. అది నిండే మంచి రోజు రాకపోదు అని నమ్ముతున్నా. ఎదుగుదలలో ఈ రోజుకీ, రేపటికీ తేడా ఉండే చాలనిపిస్తుంది. ప్రస్తుతం అదే నా గోల్‌.
 
- ఆలపాటి మధు