కథరూపంలో చెబితే ఏదైనా ఇట్టే పిల్లల మనసులలో బలంగా నాటుకుపోతుంది.పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కథలదెంతో ముఖ్యపాత్ర. అలాంటి కథలతో పిల్లల్ని ఆకట్టుకునేదీ, వారిని తీర్చి దిద్దేదీ గురువే. అలాంటి ఉత్తమ గురువు–బాల సాహిత్యవేత్త బెలగాం భీమేశ్వరరావు. పిల్లల సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారాయన. బాలసాహితీభూషణ్‌, ‘భాషాభూషణ్‌ ’ బిరదాంకితులు. మాతృభాష మనుగడకు బాలసాహిత్యమే శరణ్యం అంటున్నారాయన.

ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార విజేత.రాబోయే బాలల దినోత్సవం (14, నవంబరు, 2019) నాడు జరిగే సభలో ఆయన 50వేలరూపాయలు కేంద్ర సాహిత్య అకాడమీ నగదు పురస్కారం అందుకుంటారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం.భీమేశ్వరరావు సొంత ఊరు పార్వతీపురం.తాతలకాలం నుంచీ వారింట్లో అందరూ ఉపాధ్యాయులే. ఆయన తాతగారు చినకూర్మన్న పార్వతీపురంలో ఉపాధ్యాయుడు. పదిమంది సంతానంలో నాలుగోవారు భీమేశ్వరరావు. ఆయన తల్లి రాజేశ్వరి. ఆయన తండ్రి గంగారాం కూడా పార్వతీపురంలోనే ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఏడుగురు అన్నదమ్ముల్లో భీమేశ్వరరావుసహా ఆరుగురూ ఉపాధ్యాయులే. ఒకేఒక్కరు మెడికల్‌ ఫీల్డ్‌లో స్థిరపడ్డారు. ఆయనకు ముగ్గురు అక్కచెల్లెళ్ళు. భీమేశ్వరరావు తమ్ముళ్ళు బి.వి.పట్నాయక్‌, కేశవరావు కూడా మూడు దశాబ్దాలుగా బాలసాహిత్యంలో కృషి చేస్తున్నారు.

సినిమాల్లో కవిపాత్రలే స్ఫూర్తి!

భీమేశ్వరరావు 1972లో పార్వతీపురంలోనే ఉపాధ్యాయవృత్తి చేపట్టి ముప్ఫైఏళ్ళు పాఠాలు బోధించి వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 2010లో ఉద్యోగ విరమణ చేశారు.సినిమాల్లో కవిపాత్రలంటే ఆయనకెంతో ఆసక్తి. ‘వెలుగునీడలు’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు చేసిన కవిపాత్ర చూసిన భీమేశ్వరరావు బాల్యంలోనే రచయితవ్వాలని కోరుకున్నారు.తండ్రి వారికి కథలు, తన చిన్ననాటి అనుభవాలు చెప్పేవారు. చందమామ, బాలమిత్ర, పరమానందయ్య శిష్యుల కథలు, భట్టి విక్రమార్క సహా భారత, రామాయణ పుస్తకాలు చదివేవారు. హైస్కూల్లో ఆయన డ్రాయింగ్‌ టీచర్‌ తాళ్ళపూడి వెంకట రమణ కూడా బాలసాహితీవేత్తే.

ఆయన చెప్పే కవితలు, గేయాలు విని స్ఫూర్తిపొందేవారు భీమేశ్వరరావు. లైబ్రరీలోనే ఎక్కువ సమయం గడుపుతూ పుస్తకాలు విపరీతంగా చదివారు.పంతులు జోగారావు, పి.వి.బి.శ్రీరామమూర్తి, ఎ.ఎన్‌.జగన్నాథశర్మ లాంటి పార్వతీపురం రచయితల కథలు పత్రికల్లో చదువుతూ, తను కూడా రచయితవ్వాలని సంకల్పించుకున్నారు. టీచర్ ట్రైనింగ్‌ పూర్తిచేసి, సొంత ఊళ్ళోనే ప్రభుత్వ స్కూల్లో చేరారు. రోజూ సాయంత్రంవేళ లైబ్రరీలోనే పుస్తక పఠనం చేస్తూ, కవితలు, కథలు రాసేవారు.చిన్న పిల్లలంటే ఉండే విపరీతమైన ఇష్టంతో ఒకటో తరగతి టీచర్‌ బాధ్యతలు చేపట్టారు. తన చేతులతో వాళ్ళకి అక్షరాలు దిద్దిస్తూ, ఎంతో సంతృప్తి చెందేవారు.

పిల్లలు ఇష్టపడే అంశాలతో బాల గేయాలు రాసేవారు. ఆయన రాసిన మొదటి గేయం ‘చిలుక’ విశాఖపట్నం నుంచి వచ్చే ‘శుభోదయం’ పత్రికలో 1979లో వచ్చింది. ‘భారతంలో అబ్బాయి’ ఆయన తొలికథ ‘యోజన’ పత్రికలో వచ్చింది.ఐక్యరాజ్యసమితి 1979ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించినప్పుడు, ప్రభుత్వ బాలల అకాడమీ,నాగార్జునసాగర్‌లో బాలసాహిత్య రచయితలకు నిర్వహించిన ఎనిమిది రోజుల శిక్షణాశిబిరానికి విజయనగరంజిల్లా నుంచి భీమేశ్వరరావు హాజరయ్యారు. డా.వెలగావెంకటప్పయ్య ఆధ్వర్యంలో కె.సభా, కొలకలూరి ఇనాక్‌, తురగాజానకీరాణి, ఏడిద కామేశ్వరరావు, వేజెండ్ల సాంబశివరావు, డా.చల్లా రాధాకృష్ణశర్మ లాంటి లబ్దప్రతిష్టులైన బాలసాహితీ ప్రముఖుల శిక్షణలో బాల సాహిత్య ప్రక్రియల్లో మెళకువలు నేర్చుకున్నారు. ఆ శిబిరం ముగింపు సభలో ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవి డా.దాశరథి దీవెనలు అందుకోవడం ఒక మరపురాని సంఘటనగా పేర్కొంటారాయన.