‘ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టంతో పాల్గొనేది శృంగారం అయితే, ఇద్దరిలో ఒక్కరి కోరిక మాత్రమే నెరవేరడం సెక్స్‌ అని నా భావన. శృంగారం అనేది రసభరితమైన అనుభవాన్నిఇచ్చే చర్య. ఆ అనుభవం మనిషి అంతరాళంలో ఒక సౌందర్యాత్మక భావనగా స్థిరపడుతుంది. దీనినే నేను ఈస్తటిక్‌ స్పేస్‌ అని ప్రతిపాదించాను. పుస్తకానికి అదే టైటిల్‌ పెట్టాను..’ అంటున్నారు ప్రముఖ రచయిత దగ్గుమాటి పద్మాకర్‌. ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

 
ప్రశ్న: రాయడం మొదలుపెట్టి చాన్నాళ్ళయినా చాలా ఆలస్యంగా మీ కథా సంపుటి ‘ఈస్తటిక్‌ స్పేస్‌’ వచ్చింది. ఎందుకీ ఆలస్యం? ఈ టైటిల్‌ కథలో ‘ఈస్తటిక్‌ స్పేస్‌’ అంటే ఏమిటి?
సమాధానం: నా పుస్తకం ఆలస్యంగా ప్రచురణ కావడానికి రెండు కారణాలు- ఒకటి పుస్తకానికి సరిపడా కథలు ఇంత కాలం లేకపోవడం, మరోటి కథలే ఒకదాని తరవాత ఒకటి ఆలస్యంగా రాయడం. అందరూ సాధారణంగా గమనించని, మరుగునపడిన, నాకు చాలెంజ్‌గా అని పించిన విషయాలను కథావస్తువులుగా స్వీకరించడం. బహుశా కథ రాస్తే కథ గాని, నేను గాని పాఠకులకు గుర్తు ఉండిపోవాలనే స్వార్థం ఇందుకు కారణం అనుకుంటాను. ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టంతో పాల్గొనేది శృంగారం అయితే, ఇద్దరిలో ఒక్కరి కోరిక మాత్రమే నెరవేరడం సెక్స్‌ అని నా భావన. శృంగారం అనేది రసభరితమైన అనుభవాన్ని ఇచ్చే చర్య. ఆ అనుభవం మనిషి అంత రాళంలో ఒక సౌందర్యాత్మక భావనగా స్థిరపడుతుంది. దీనినే నేను ఈస్తటిక్‌ స్పేస్‌ అని ప్రతిపాదించాను. పుస్తకానికి అదే టైటిల్‌ పెట్టాను.
 
స్త్రీలపై లైంగిక దాడులకు పాల్పడే కామోద్దీపన చర్య తాలూకు అనుభవం పేలవమైనదనీ, పరస్పర ఇష్టంతో సాగే శృంగారం అనుభవమైతే దానిని ఈస్తటిక్‌ స్పేస్‌లో దాచుకుని, ఎడబాటు కాలంలో పురుషుడు నేర చర్యలకు పాలు పడకుండా ఆవు గడ్డితిని తిరిగి నెమరు వేసుకు న్నట్టు ఆ జ్ఞాపకాలతో జీవించడం ఒక పరిష్కారంగా ఈ కథ నేను రాశాను. ఎందుకంటే అందరికీ అన్ని వేళలా శృంగారపు తాదాత్మ్యత, లేదా కోరిక తీరడం గాని సాధ్యం కాదు కాబట్టి.
 
ప్రశ్న: తొలిరోజుల్లో విరసంలో ఉన్నారు. కథలు రాయడం మొదటి నుంచి ఇప్పటిదాకా పోల్చి చూసు కుంటే మీలో భావజాలపరమైన మార్పు ఏమన్నా వచ్చిందా?
సమాధానం: విరసంలో నేను దశాబ్దం పైగా ఉన్నాను. సమాజం అనేది పట్టించుకోదగినది అని, దానిని మనం పట్టిం చుకోకపోయినా అది మనల్ని పట్టించుకుని తన దారిన ప్రతివారిని లాక్కునిపోతుందని, ఇంకా సమాజ గమనాన్ని నిర్దేశించడంలో వ్యక్తి చైతన్యం పాత్ర కూడా అనివార్యం అని నేను విరసం ద్వారా నేర్చు కున్నాను. అయితే కాలక్రమంలో సంస్థ నాయకత్వంలోని వ్యక్తులు అంతగా సమాజం పట్ల పట్టింపుని ఆచరణలో కనపరచడం లేదని, ఆచరణలో చాలా క్యాజువల్‌గా ఉన్నారని గ్రహించాక బయటకు వచ్చేసాను.
 
స్త్రీ దళిత ఉద్యమాల పట్ల చాల మమేకం కలిగి ఉండి రచనలు చేశాను. కాలక్రమంలో ఈ ఉద్యమాలపై నా అభిప్రాయాలు మారాయనడం నిజం. ఆత్మాభిమానం, వ్యక్తిత్వం పక్కకిపోయి పురుష ద్వేషం, లైంగికస్పృహ అనే విషయాల చుట్టూ స్త్రీవాద కథలు తిరగడం మొదలయ్యాక స్త్రీవాదం మీద ఆసక్తిపోయింది. లైంగిక అవసరం, లైంగిక హక్కు, లైంగిక స్వేచ్ఛ, లైంగిక విశృంఖలత అనే తేడాలను నిర్వచించుకోక పోవడంతోనే అవి ఆగిపోయాయని నా ఉద్దేశ్యం.
 
దళిత ఉద్యమాలు కూడా తమమధ్య ఉన్న అంత రాలను ఇంకా కొనసాగించుకోవడం, ఇంకా చెప్పాలంటే అసలు ఆ సమస్య ఉన్నట్టే గమనించుకోకపోవడం వల్ల ఆయా ఉద్యమాలపై నా పరిశీలన మరింత పెరిగింది. దళిత స్త్రీవాద కథలు ఇంతకుముందు రాసినా ఈ మారుతున్న అనుభవాలతో రాయడం మరింత సంక్లిష్టం అయ్యింది.
 
ప్రశ్న: కథకుడికి దృక్పథం ముఖ్యమా, లేక అనుభవం ముఖ్యమా?
సమాధానం: కథకుడికి దృక్పథం లేకపోతే చీకటిలో ప్రయాణి స్తాడు. అనుభవం లేకపోతే చీకటికి వెలుతురుకి తేడా తెలుసుకోలేడు.