‘జైలులో మనకు మిగిలేవి కలలే.. అప్రజాస్వామిక ప్రభుత్వాలు, నియంతృత్వాలు మనుషులను ఖైదు చేయవచ్చు... కానీ వారి కలలను మాత్రం దూరం చేయలేవు..’ అనే కెన్యా రచయిత గూగీ వా థియాంగో సాహితీ రంగంలోనే కాదు, మానవ హక్కుల పోరాట నేతగా ఆఫ్రికాలో సంచలనాలు సృష్టించారు. ఆయన ఇంగ్లీషులోను, తన మాతృభాష గికూయూలోను రాసిన ఆత్మకథ భాగాలు, నవలలు, వ్యాసాలు 60 ప్రపంచభాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన ఆత్మకథ ‘డ్రీమ్స్‌ ఇన్‌ ఏ టైమ్‌ ఆఫ్‌ వార్‌’ పుస్తకాన్ని తాజాగా ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా ‘యుద్ధ కాలంలో స్వప్నాలు’ పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన గూగీతో ప్రత్యేక ఇంటర్వ్యూ:

మీరు ఇంగ్లీషులో రాశారు. మీ మాతృభాష గికూయులో కూడా రాశారు. ఈ రెండింటిలో మీకు నచ్చిన భాష ఏది..?
చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతి భాషకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, మళయాళం, చైనీస్‌.. ఇలా ఒకో భాషది ఒకో వ్యక్తిత్వం. ఇది ఎంత మంది మాట్లాడుతున్నారనే విషయంపై ఆధారపడి ఉండదు. ప్రతి భాషలోను దానిని మాట్లాడే ప్రజల సంస్కృతి, చరిత్ర, జ్ఞాపకాలు నిక్షిప్తమయి ఉంటాయి. అందుకే వలసపాలకులు ముందుగా తాము విజయం సాధించిన ప్రాంతాలలోని ప్రజల సంస్కృతిపైన, భాషపైన దాడి చేస్తారు. ఎందుకంటే భాష సాధికారతకు చిహ్నం. ఉదాహరణకు 1910లో కొరియాను జపాన్‌ ఆక్రమించుకుంది. అప్పుడు వారు కొరియా భాషపైన.. కొరియా పేర్లపైన నిషేధం విధించారు. ఇంగ్లీషువారు అమెరికాను ఆక్ర మించినప్పుడు కూడా స్థానికుల విషయంలో ఇదే జరిగింది. వలసపాలకులు స్థానిక భాషలను అవమానిస్తారు. వాటిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తారు. స్థానికులను బానిసలుగా చేసుకొనే ప్రక్రియలో ఇదంతా ఒక భాగం. చరిత్రను వెదికితే ఇలాంటి ఉదంతాలు ఎన్నో కనిపిస్తాయి. ఇప్పుడు నా విషయానికి వద్దాం. నేను నా మాతృభాషలోను రాశాను. ఇంగ్లీషులోను రాశాను. కానీ నా మాతృభాషంటేనే మక్కువ ఎక్కువ. ఇప్పుడు కేవలం నా మాతృభాషలో మాత్రమే రాస్తున్నా. నా పుస్తకాలను తెలుగు సహా ప్రపంచంలో అనేక భాషల్లోకి అనువదించారు. ఈ విధంగా చూస్తే నా ప్రయోజనం నెరవేరినట్లే!
 
ప్రపంచంలో అనేక భాషలు అవసానదశకు చేరుకుంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని ఎలా చూడాలి?
భాషను ఒక సమాజం అభివృద్ధి చేస్తుంది. ఆ సమాజం ఉన్నంత కాలం భాష కూడా ఉంటుంది. భాషలు వాయిద్య పరికరాలలాంటివి. ప్రపంచంలో కొన్ని వాయిద్యాలు ఉంటే చాలు.. ఇన్ని రకాలెందుకు.. అనుకుంటామా? పాటలు పాడేందుకు ఒక గొంతు ఉంటే చాలు.. రకరకాల గొంతులు ఎందుకు.. అనుకుంటామా? అనుకోం కదా.. భాష కూడా అంతే. ఒక భాషను మాట్లాడేవారి సంఖ్య ఎంత ఉన్నా పర్వాలేదు.. కానీ భాష మాత్రం మనగలగాలి. అందుకోసమే భాషల కోసం పోరాడేవారికి నా మద్దతు ఇస్తా. వారి కోసం పోరాడే యోధుడిని నేను.
 
భాష.. రచన.. ఈ రెండూ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడటంతో పాటుగా మిగిలిన ప్రపంచంతో అనుసంధానం కావటానికి ఉపయోగపడేవి కదా..
అనుసంధానం కావటానికి అయితే ఫర్వాలేదు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. బానిసత్వంలో సమానత్వం ఉండదు. నేను బానిసను అని చెప్పుకోవటంలో గర్వం ఉండదు. భాష విషయం కూడా అంతే! నా ఉద్దేశంలో మాతృభాష పునాదిలాంటిది. పునాది సరిగ్గా లేకపోతే ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది. రోదసిలోకి వెళ్లే రాకెట్‌కు కూడా పునాది గట్టిగానే ఉండాలి. లేకపోతే కక్ష్య తప్పుతుంది. నేను ఎయిర్‌పోర్టుల్లో చూస్తూ ఉంటా. చిన్న చిన్న పిల్లలు వాళ్ల అమ్మానాన్నలను వదిలి పరిగెత్తుతూంటారు. మధ్యలో వెనక్కి చూస్తూ ఉంటారు. అమ్మనాన్న కనిపిస్తే ముందుకు పరిగెడతారు. వారు కనబడకపోతే కంగారుపడి వెనక్కి వచ్చేస్తారు. భాష కూడా అలాంటిదే. మాతృభాషపై సాధికారత సాధించగలిగితే ప్రపంచంలో ఏ భాషలోనైనా నెగ్గుకురావచ్చు. అందుకే వలసవాదులు స్థానిక భాషలను నిర్వీర్యం చేసి ఆ స్థానంలో తమ భాషను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తారు.
 
ప్రపంచీకరణ తర్వాత ఇంగ్లీషును ప్రపంచ భాషగా భావించేవారి సంఖ్య, ఆ భాషలో రాసే రచయితల సంఖ్య పెరిగింది కదా..
నా ఉద్దేశంలో భాషల్లో హెచ్చుతగ్గులు ఉండకూడదు. నాది ఎక్కువ.. నీది తక్కువ అనే భావన కూడదు. ఇంగ్లీషు అందరికీ ఉపయోగపడే ఒక సాధనమే అయితే ఫర్వాలేదు. కానీ చాలా సందర్భాలలో అలా కనబడదు. ఇక గ్లోబలైజేషన్‌ అంటే గోబులేజేషన్‌ (మింగివేయటం). కొందరు ఇంకొందరిని మింగేస్తున్నారు. ధనిక దేశాలు మరింత ధనికదేశాలవుతున్నాయి. పేద దేశాలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నాయి. ఇక్కడ కూడా రకరకాల హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వనరులైనా తమవే అని భావించే దేశాలు.. కార్మికులను మాత్రం తమ దేశాలలోకి రానివ్వవు. వారిపై ఆంక్షలు విఽధిస్తాయి. కొంద రికి మాత్రమే రాజమందిరాలు.. మిగిలిన వారందరికీ కారాగారాలు అనే సిద్ధాంతం సరికాదు.
 
మీ మొదటి రెండు నవలలు- ‘ద రివర్‌ బిట్వీన్‌’, ‘వీప్‌ నాట్‌, ఛైల్డ్‌’- కాలేజీలో ఉన్నప్పుడే రాశారు. అప్పటికి మీరు రచయితగా ఒక పరిపక్వ దశకు చేరుకున్నాననుకుంటున్నారా?
ఈ రెండు నవలలు ఒక ఔత్సాహికుడిగానే రాశా. ఇప్పటికీ నాకు ఒక రచయితగా అంత సంతృప్తి లేదు. నాకు ఒక రచయిత హోదా రావాలంటే నేను ఇంకా రాయాల్సి ఉంది. ‘ఏ గ్రెయిన్‌ ఆఫ్‌ వీట్‌’, ‘పెటల్స్‌ ఆఫ్‌ బ్లడ్‌’- ఈ రెండు నవలలు రాసిన తర్వాత ఇక ఇంగ్లీషులో రాయకూడదని నిర్ణయించుకున్నా! ఇప్పటికి కూడా నేను నా మాతృభాషలో సంతృప్తి కలిగించే రచనను చేయలేకపోయా! రాయటమనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పటికప్పుడు రాస్తూనే ఉండాలి.
 
మీ రచనలలో మీరు అతి ముఖ్యమైనవిగా భావించేవి ఏవైనా ఉన్నాయా?
మనలోని బాధను తొలగించుకోవటానికి రచనలు చేస్తాం. మానవుల సమస్యలు తొలగిపోవాలంటే మానవులే పోరాడాలి. ఇలా చూస్తే నేను రాసిన రచనలన్నీ ముఖ్యమైనవే. ఒకో రచన చేసేటప్పుడు ఒకో విధమైన అనుభవం ఎదురవుతూ ఉంటుంది. ‘డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌’ను కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాశాను. ఇది మా నా మాతృభాషలో వచ్చిన తొలి ఆధునిక నవల. ‘విజార్డ్‌ ఆఫ్‌ ది క్రో’ కూడా ముఖ్యమైనదే. నా మిత్రులతో సరదాగా దీనిని రెండు ఆరెంజ్‌ల మధ్య రాశాను అంటూ ఉంటా. ఈ నవలను న్యూజెర్సీలోని ఆరంజ్‌లో ప్రారంభించి కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలో పూర్తిచేశా.
 
మీ పుస్తకాన్ని సాయిబాబా జైలులో అనువాదం చేశారు.. ఇది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది..?
జైలు జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందువల్ల సాయిబాబా పరిస్థితి ఎలా ఉందో నేను ఊహించుకోగలను. 1977 నుంచి 79 వరకూ నేను కెన్యాలోని కామిటి జైలులో ఉన్నా. అది హైక్యూరిటీ జైలు. నాకు ఎటువంటి సదుపాయాలు ఉండేవి కావు. తీవ్రమైన ఒత్తిడి ఉండేది. ఆ సమయంలోనే ‘డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌’ పుస్తకం రాశా. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో బతకాల్సి వచ్చినప్పుడు.. జైలులో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు మిగిలేవి కలలు మాత్రమే! అప్రజాస్వామిక ప్రభుత్వాలు, నియంతృత్వాలు మనుషులను ఖైదు చేయవచ్చు. కానీ వారి కలలను మాత్రం దూరం చేయలేవు. జైలు గోడలు మనం కలలు కనే సామర్థ్యాన్ని తగ్గించవచ్చు. కానీ మన నుంచి కలలను మాత్రం వేరు చేయలేవు.
 
అంతటి దుర్భర పరిస్థితుల్లో కూడా మనుషులను ముందుకు నడిపించేది ఏమిటి?
భవిష్యత్తు మీద ఆశ. మీకో ఉదాహరణ చెబుతాను. విత్తును చీల్చుకొని మొలక వస్తుంది. ఈ మొలక పెరుగు తున్నప్పుడే వేరు కూడా ఉద్భవిస్తుంది. కొద్ది కాలం తర్వాత విత్తే ఉండదు. ఈ విత్తే ఆశ. వర్తమానంలోనే గతం ఉంటుంది. భవిష్యత్తు కూడా ఉంటుంది. కొన్ని సార్లు నిరంకుశ ప్రభుత్వాలు- వర్తమానం మాత్రమే మంచిదని.. గతం కానీ భవిష్యత్తు కానీ ఉండవని చెబుతూ ఉంటాయి. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటి సమయంలోనే మనం భవిష్యత్తు కోసం పోరాడాలి. అదే మనను ముందుకు నడిపిస్తుంది. ఎప్పుడైనా వర్తమానంతో ముడిపడిన భవిష్యత్తే మంచిది. అది ఒక ప్రవాహంలాంటిది.
 
మీరు జీవితంలో ఒక రచయితగా రిగ్రెట్‌ అయిన సందర్భాలేమైనా ఉన్నాయా?
అప్పుడప్పుడు 1962 నుంచి.. అంటే నేను రాయటం మొదలుపెట్టినప్పటి నుంచి నా మాతృభాషలోనే రచనలు చేస్తే బావుండేదేమో అనే ఆలోచన వస్తుంది. ఆ సమయంలో ఇంగ్లీషులో రాయటం సాధారణమైన విషయం అనుకొనేవాడిని. నేను నా రచనలన్నీ నా మాతృభాషలోనే చేస్తే మరింత మార్పు వచ్చేదేమో అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా ఎక్కువ మనఃశాంతి దొరికేదేమో!
 
మార్పు నిరంతర ప్రక్రియ
మార్పు నిరంతరమైన ప్రక్రియ. వర్తమానంలో మార్పు చాలా నెమ్మదిగా అనిపి స్తుంది. కొన్ని సార్లు అసలు మార్పే జరగటం లేదేమో అనిపిస్తుంది. కానీ చరిత్రను గమనిస్తే.. మార్పు జరుగుతూనే ఉంటుందని.. మరింత అభివృద్ధి చెందిన సమాజం వైపు మానవుడు ప్రయాణిస్తూనే ఉంటాడని అర్థమవుతుంది. అప్పుడు నిరాశ ఉండదు. అంతే కాదు.. మార్పు ఎప్పుడూ సమాజ హితాన్ని కోరేవారివైపే ఉంటుంది.
 
దూరంగా ఉన్నా..
గత మూడు దశాబ్దాలుగా నేను కెన్యా నుంచి దూరంగా నివసిస్తున్నా. నేను నా దేశం నుంచి దూరంగా ఉండచ్చు. కానీ ఆ దేశం నాదనే భావన నరనరాల్లోను ఇంకిపోయింది. నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు నాకు మద్దతు ఇచ్చారు. 1982లో నా నవలను పబ్లిష్‌ చేసే ముందు కెన్యా పబ్లిషర్‌ హెన్రీ చకావా వేళ్లను నరికేశారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కెన్యా ప్రజలే నాకు మద్దతు ఇచ్చారు. ఇస్తూనే ఉన్నారు.
 
హైదరాబాద్‌తో అనుబంధం
ఉగాండాలో నేను చదువుతున్నప్పుడు సూజీథారు నా సహ విద్యార్థిని. తనను మళ్లీ కలవటం చాలా ఆనందంగా ఉంది. 1996లో నేను తొలిసారి వచ్చినప్పటి అనుభవాలు నాకు ఇంకా జ్ఞాపకమున్నాయి. ఒక రోజు ఉదయాన్నే లేచి మేము వరంగల్‌కు బయలుదేరాం. మీలాగే ఒక జర్నలిస్టు మిత్రుడు కారులోనే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మధ్యలో ఒకచోట టీ తాగటానికి ఆగాం. ఆ షాపు ఓనరు టీ కాచే పద్ధతి.. నా చిన్నప్పుడు కెన్యాలో భారతీయులు టీ కాచుకొనే పద్ధతిని గుర్తుచేసింది. నా చిన్నతనం గుర్తుకొచ్చింది. ఇది ఒక మరచిపోలేని అనుభవం. వరంగల్‌ వెళ్లినప్పుడు ఒక స్తూపాన్ని చూశాం. అప్పుడు మమ్మల్ని కలవటానికి అనేక మంది వచ్చారు. ఇప్పుడు దాన్ని కూల్చేశారట. ఇలా హైదరాబాద్‌తో ముడిపడిన అనుభూతులు అనేకమున్నాయి.
ఇంటర్వ్యూ   సి.వి.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌