మధ్య తరగతి జీవితాలను తన కథల్లో, నవలల్లో ప్రతిబింబిస్తున్న కథ, నవల, నాటక రచయిత, వ్యాసకర్త. ఉత్తరాంధ్రజిల్లాల్లో రేడియోనాటకరచయితగా, ఆధ్యాత్మికవక్తగా లబ్ధప్రతిష్టులు.. అంతకుమించి ఆయన బాలల రచయిత.రచయిత తన రచనల్లో పాఠకుడికి పరిష్కారం కూడా చూపిస్తే అది గొప్ప కథ అవుతుంది, అలాంటి కథలు, మంచి పుస్తకాలు రోజూ చదువుకుంటే ఒత్తిడి మాయమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది’’ అంటున్న దూరి వెంకటరావు ఇంటర్వ్యూ..

సాహిత్య, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన విజయనగరంలో 1947 జులై రెండవతేదీన జన్మించారు వెంకటరావు. ఆయన తండ్రి సత్యనారాయణ. తల్లి కనకాంబ. నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళున్న సంతానంలో ఆఖరివారు వెంకటరావు. తండ్రి ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్‌లో పలుచోట్ల పనిచేయడంవల్ల వెంకటరావు ఐదోక్లాసువరకు ఇంట్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత సొంత ఊళ్ళోనే నేరుగా ఆరో తరగతిలో చేరి చదువు ప్రారంభించారు. ఎందరో మహనీయులకు మార్గదర్శకంగా నిలిచిన విజయనగరం ఎం.ఆర్‌.కళాశాలలో బిఎస్సీ, బిఇడి చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ హిందీ పూర్తి చేశారు.ఆనాటి విశాఖపట్నంజిల్లా పెనుగోలు ధర్మవరంలో బిఇడి టీచర్‌గా (1970) చేరిన వెంకటరావు పదేళ్ళు హెడ్మాస్టర్‌గా, తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. 2005లో సొంత ఊరులోనే పదవీ విరమణ చేసి అక్కడే స్థిరపడ్డారు.

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో అన్ని సాహిత్య ప్రకియల్నీ సృజించారు. 15 పుస్తకాలు వెలువరించారు.పావలా అద్దెతో పుస్తక పఠనంకాలేజీలో ఉండగా, బుక్‌స్టాల్స్‌ దగ్గర పావలా అద్దె చెల్లించి కథల పుస్తకాలు, నవలలు చదువుకునేవారు వెంకటరావు. అలా కొవ్వలి సహా ఆనాటి ప్రముఖ రచయితల రచనలన్నీ చదివారు. కాలేజీ మ్యాగ్జైన్‌లో ముద్రితమైన ‘పవిత్ర హృదయాలు’ ఆయన రాసిన తొలి కథ. ఆంధ్రప్రభ వీక్లీ (1974) లో ఆయన రాసిన ‘స్ర్తీలలో వ్యక్తిత్వం’ వ్యాసానికి పాతికరూపాయలు నగదు బహుమతి అందుకున్నారు.కళాశాలలో ఆంగ్లశాఖాధిపతి వి.వి.బి. రామారావు ఒక పత్రికలో రాసిన ‘స్పర్శరేఖ’ సీరియల్‌ చదివిన స్ఫూర్తితో రచయిత కావాలని సంకల్పించుకున్న వెంకటరావు తొలుత కథలు, వ్యాసాలతో సాహిత్య ప్రయాణం ప్రారంభించారు. అలా ఆయన తొలి కథ ‘పద్మప్రియ’ ‘ఆదివారం వీక్లీ’ అనే పత్రికలో ముద్రితమైంది.

ఇక అక్కడినుంచీ ఆయన రాసిన కథలు, వ్యాసాలు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యేవి.వెంకటరావు మొట్టమొదటి నవల ‘అపశృతులు’ (1975). ఆయనే సొంతంగా పబ్లిష్‌చేసి ఉత్తరాంధ్రలోని అన్ని పాఠశాలల లైబ్రరీలకు అందజేశారు. ఆంధ్రసచిత్ర వారపత్రికలో ఆయన రాసిన నవల ‘త్రివేణి సంగమం’. (1985). పత్రికలో సీరియల్‌గా వచ్చిన ఆయన తొలి నవల ఇదే.550 కథలు, పది నవలలుదూరి వెంకటరావు ఇప్పటివరకు 550 కథలు, పది నవలు, 300పైగా బాలల కథలు, మరో మూడు బాలల నవలలు, రెండు నాటకాలు రాశారు. ప్రముఖ దిన,వార, మాస పత్రికలలో అనేక వ్యాసాలు రాశారు. ఆయన కథలు ఆరు కథా సంపుటాలుగా వెలువడ్డాయి. ‘ఆశల దీపం’ (1994), ‘బహుమతి’ (2001), ‘ఆత్మీయత’ (2003), ‘అవార్డ్‌’ (2007), మల్లేషు మంగతాయారు (2012), ‘రెండు కళ్ళు (2018) కథాసంపుటాలుగా మార్కెట్లోకి వచ్చాయి.