ప్రముఖ కవి, కథారచయిత మోహన్‌ రుషి.ఈ ‘ఉక్కపోత సమాజం’ , విలువలు లేని సమాజంలోంచి పుట్టిందే నా కవిత్వం,మనిషి అంతరంగ వేదనే నా కవిత్వం అంటున్న మోహన్‌ రుషి ఇంటర్వ్యూ...

నల్లగొండజిల్లా మిర్యాలగూడ మా సొంత ఊరు. నాన్నగారు ఆనందపు భావనా రుషి. అమ్మ రాజమల్లమ్మ. మేం నలుగురు సంతానం. నాకు ఒక అక్క, ఒక చెల్లెలు, తమ్ముడు.1973సెప్టెంబరులో నేను పుట్టాను. నా అసలు పేరు ఆనందపు మోహన్‌. నాన్నగారి పేరులోని రుషి తీసుకుని మోహన్‌ రుషి అని పెన్‌ నేమ్‌ పెట్టుకున్నాను. నాన్నగారు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిత్‌. కవిత్వం రాసేవారు. మా ఇంటి నిండా ప్రాచీన గ్రంథాలు ఉండేవి. బాల్యంనుంచీ అవన్నీ చదివేవాణ్ణి. అవి చాలక రోజుకు రెండు మూడు లైబ్రరీల చుట్టూ తిరిగేవాణ్ణి. అలా సాహిత్యంపట్ల ఆసక్తి కలిగింది.హైదరాబాద్‌లో ఉంటూ మిత్రుడు పొన్నాల చంద్రశేఖర్‌తో కలిసి ప్రతి ఆదివారం ఆబిడ్స్‌ నుంచి కోఠి వరకు వేటగాళ్లలా తిరుగుతూ ఆణిముత్యాల్లాంటి పాత పుస్తకాలు సేకరించేవాణ్ణి. అలా సేకరించిన సాహిత్య అకాడమీవారి పలు భారతీయ భాషల, ఆంగ్లానువాదాలు విస్తారంగా చదివాను.1996లో చదివిన Herman hess ఫిక్షన్‌ నవల ‘సిద్ధార్థ’ నా జీవితంమీద విపరీతమైన ప్రభావం చూపించింది.

సత్యాన్వేషణకోసం చేసిన తాత్విక ప్రయాణమే ఆ పుస్తకం. చలం రాసిన ‘జీవిత ఆదర్శం’, హరివంశరాయ్‌ బచ్చన్‌ జీవిత చరిత్ర పుస్తకాలు నాకు చాలా ఇష్టం. ‘జరిగితే మంచిదే, జరక్కపోతే ఇంకా మంచిది’ అనే బచ్చన్‌ ఆశావాదం నాకు నచ్చిన అంశం. దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, కిషన్‌చందర్‌, జయకాంతన్‌ (తమిళరచయిత), తగళి శివశంకరపిళ్ళై (మలయాళం), ప్రేమ్‌చంద్‌, సొదుం జయరామ్‌ లాంటివారి రచనలు చాలా చాలా ఇష్టం.

అచ్చులో తొలి కవిత

మా బాబాయి చక్రపాణి కవిత్వం రాసేవారు. ఒకసారి ఆయన వచన కవిత్వం చదివి, ‘ఓహో! కవిత్వం ఇలా రాయవచ్చు’ అని అర్థంచేసుకున్నాను. బి.ఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ నుంచి కవిత్వం రాయడం ఆరంభించాను.ఆంధ్రప్రభ సండే ఎడిషన్‌లో 1992లో వచ్చిన ‘గుర్తింపు’ నా తొలి కవిత. 30 రూపాయలు పారితోషికం వచ్చింది.

ఆ స్ఫూర్తితో ఆంధ్రజ్యోతి వీక్లీ సహా అన్ని పత్రికల్లోనూ రెగ్యులర్‌గా కవిత్వం రాసేవాణ్ణి. సికింద్రాబాద్‌లో ఎం.ఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌, బిఇడి పూర్తిచేసి ఓ ఆర్నెల్లు టీచర్‌ ఉద్యోగం చేశాను. క్రియేటివ్‌ రైటింగ్‌ అంటే ఇష్టం కావడంవల్ల దానినే వృత్తిగా ఎంచుకోవాలని భావించి 1994లో హైదరాబాద్‌ ఈటీవీలో స్ర్కిప్ట్‌ రైటర్‌గా ఏడాదిన్నర పనిచేశాను. సినిమారంగంలో స్థిరపడేందుకు నాలుగేళ్ళు తీవ్రంగా ప్రయత్నించాను. రవితేజ నటించిన ‘మనసిచ్చా’ సినిమాలో ఒక పాట రాశాను. నాజర్‌, రేవతి, సోనాలి కులకర్ణి నటించిన ‘ఎల్లమ్మ’ చిత్రానికి ఒక సంభాషణ రచయితగా ఉండి, అందులో ఒక పాట కూడా రాశాను. సరైన బ్రేక్‌త్రూ లేకపోవంతో 2001లో ఈటీవీ–2 లో చేరాను. ఆ తర్వాత కంపోజ్‌ ఇంప్రషన్స్‌ యాడ్‌ ఏజన్సీలో క్రియేటివ్‌ రైటింగ్‌ వృత్తిలో స్థిరపడ్డాను.కవిత్వంతోపాటు నేను ‘థర్డ్‌ డిగ్రీ’ అనే కథ కూడా రాశాను. ఈ కథ కినిగేడాట్‌కామ్‌లో వచ్చింది. మనిషికి కనబడకుండా జీవితం కొట్టే కనిపించని దెబ్బలే ‘ఈ థర్డ్‌ డిగ్రీ’ కథ సెంట్రల్‌ థీమ్‌.