విజ్ఞాన సర్వస్వ నిధి డా. గుంజి వెంకటరత్నం. మహాభారతంపై పరిశోధన చేసి విజ్ఞాన సర్వస్వ గ్రంథాలు రచించి సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన పండితుడు . ప్రశ్నించే గుణం, విశ్లేషణాత్మకమైన పరిశోధనతో తెలుగులో ఎన్‌సైక్లో పీడియాలు తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. 15–20 శతాబ్దాలమధ్య కాలం నాటి తెలుగువారి సమగ్ర సాంఘిక జీవితాన్ని, విజ్ఞాన సర్వస్వాల రూపంలో మనకు అందించారు వెంకట రత్నం.మన నైతికబలం, ఆత్మ బలం ప్రాచీన సాహిత్య అధ్యయనమే అంటున్న ఆయన ఇంటర్వ్యూ.

మాది నెల్లూరుజిల్లా గోనుపల్లి గ్రామం. మా నాన్నగారు గుంజి వెంకటేశ్వర్లు. తల్లి వెంకట లక్ష్మమ్మ. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో మైకా గనులకు ప్రసిద్ధిగాంచిన కల్చేడు గ్రామంలో నాన్నగారు కాంట్రాక్టులు చేశారు. .1937 మే 16న పుట్టాను. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. నాన్నగారు భారత, భాగవతాలు, అమరకోశం క్షుణ్ణంగా చదువుకున్న వ్యక్తి. ఇంట్లో రామాయణ, భారత, భాగవతగ్రంథాలు, మూడు రకాల శంకరనారాయణ నిఘంటువులతోపాటు గూడూరు గ్రంథాలయంలో చదువుకున్న ప్రాచీన సాహిత్యం, కాకతీయుల చరిత్ర నాపై ప్రభావం చూపించాయి. ఆరవతరగతిలో టీచరు చెప్పిన పాపయ్యశాస్త్రిగారి పుష్పవిలాపం నాపై చెరగని ముద్రవేసింది. గొప్ప గొప్ప టీచర్లు నన్ను మంచి విద్యార్థిగా తీర్చిదిద్దారు. స్నేహితుడు మల్లెల గురవయ్య సహవాసంలో పద్యాలు రాసేవాణ్ణి.నెల్లూరులో 1961నాటికి స్పెషల్‌ బి.ఏ చదువు పూర్తచేశాను.

గుమస్తా ఉద్యోగం నుంచి రీడర్‌ స్థాయికి

సాహిత్యాభిలాష ఉన్నప్పటికీ, బంధువుల ప్రోద్బలంతో నాలుగేళ్ళు మైకా గనుల వ్యాపారం చేశాను. ఐతే అక్కడి డాంబికాలు, దబాయింపులు, మోసాలు నాకు గిట్టలేదు. ఆర్థికంగా దెబ్బతిని కార్లలో తిరిగేస్థాయి నుంచి సైకిల్‌ కూడా లేనిస్థితికి చేరుకున్నాను. పొట్టచేతపట్టి స్నేహితులందరం వరంగల్‌ చేరుకున్నాను. నెల్లూరులో ఆస్తిపాస్తులన్నీ అమ్మి వరంగల్‌లోనే స్థిరపడ్డాను.అజాంజాహి మిల్లులో 92 రూపాయలు జీతానికి గుమస్తాగా పనిచేస్తూ, మరోవైపు ఉస్మానియా పి.జి.సెంటర్లో ఎం.ఏ చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడనై, 1970లో చందాకాంతయ్య మెమోరియల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ (సికెఎం)లో లెక్చరర్‌గా చేరాను. బిరుదురాజు రామరాజుగారి ప్రోత్సాహం, సాహితీ కల్పవృక్షం కోవెల సుప్రన్నాచార్య గైడెన్స్‌లో ఉన్నత చదువులు చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదట ఎం.లిట్‌ చేసింది నేనే.

వృత్తి రీత్యా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగుహెడ్‌ స్థాయికి ఆ తర్వాత రీడర్‌ స్థాయికి చేరాను. సికెఎం కాలేజీ పిజి సెంటర్‌ కో–ఆర్డినేటర్‌గా, కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌ యూజి–పి.జి కోర్సుల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యునిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఎన్‌సైక్లోపీడియా సెంటర్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యుడిగా పనిచేశాను. 1995లో రిటైరై 1996లో రత్నం హైస్కూ్‌ల్‌ స్థాపించి నిర్వహించాను. దానిని నా వారసుడికి అప్పగించి తర్వాత పూర్తిగా సాహిత్య అధ్యయనం, రచనావ్యాసంగం చేస్తున్నాను. 2009లో డా.గుంజి వెంకటరత్నం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించి పేద విద్యార్థులకు సేవలు అందిస్తున్నాను. శ్రీరత్నగర్భ గణపతి ఆలయ నిర్మాణ కమిటీ కార్యదర్శిగా, గౌరవ అధ్యక్షునిగా ఉంటూ ఆలయాన్ని అభివృద్ధిపరిచాను.

హంసవింశతి విజ్ఞాన సర్వస్వంఒకవైపు లెక్చరర్‌గా పనిచేస్తూ, మరోవైపు సుప్రసన్నాచార్య గైడెన్స్‌లో, ‘హంసవింశతి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు’ అనే అంశంపై ఏడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందాను. నాలుగు వ్యాల్యూమ్స్‌గా నా పరిశోధనాపత్రం రూపొందించాను. ఇందులో మొదటి రెండు సంపుటాలను హంసవింశతి విజ్ఞాన సర్వస్వం’ గా వెలువరించాను. హంస వింశతి అంటే హంస చెప్పిన 20 రాత్రుల కథలు అని అర్థం. ఇందులో 17,18 శతాబ్దాల నాటి తెలుగు సమాజ విజ్ఞాన సర్వస్వం నిక్షిప్తమైంది. ఆనాటి కులాలు, కులవృత్తులు, వృత్తిపరికరాలు, ఇళ్ళు, ఆయుర్వేద వైద్యం, పిల్లల ఆటలు, పాటలు సహా నాటి సమాజ చరిత్ర గల దీని గొప్పతనాన్ని సి.పి.బ్రౌన్‌ కూడా గుర్తించి గ్రంథస్థం చేశాడు. ఈ గ్రంథంలో చాలా గొప్ప సైన్స్‌ ఉంది. విశ్వవిద్యాలయస్థాయిలో పిహెచ్‌డిలో ఇలాంటి ప్రయోగం చేయడం నానుంచే ప్రారంభమైంది.