పాటల పూదోటలో పుట్టాడు. పాటలు వింటూ పెరిగాడు. ఇప్పుడు పాటగాడిగా మారాడు. లలిత సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు రామాచారి. ఆయన తనయుడిగా ప్రేక్షకులకు పరిచయమైన సాకేత్‌ కొమాండూరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులేస్తున్నారు. తండ్రి ఇచ్చిన సంగీత విద్యను రెక్కలుగా భావించి స్వయం కృషితో ఎదుగుతానంటోన్న ఆయనతో సింగర్స్‌ స్పెషల్‌...

నాన్న రామాచారిగారంటే లలిత సంగీత శిక్షణ ప్రపంచంలో తెలియనివారుండరు. పుట్టింది సంగీత కుటుంబంలో కాబట్టి చిన్నప్పటి నుంచీ పాటలు, సంగీతమంటే చచ్చేంత ఇష్టం. రెండో తరగతిలోనే మొదటి కచేరీ చేశా.. ఓరుగంటి లీలావతిగారు నా తొలి గురువు. ఆ తర్వాత నీతా చంద్రశేఖర్‌, మోహనకృష్ణగారి దగ్గర కర్ణాటక క్లాసికల్‌ నేర్చుకున్నా. డా.వైజర్సు బాల సుబ్రహ్మణ్యంగారు ప్రస్తుత నా గురువు. రాయల్‌ స్కూల్‌ ఆఫ్‌ లండన్‌, బెంజిమన్‌ మార్తండ్‌, థామస్‌గారి దగ్గర పియానో 5 గ్రేడ్స్‌ చేశా. వెస్ట్రన్‌ వోకల్స్‌లో త్రీగేడ్స్‌, ఆడియో ఇంజనీ రింగ్‌, మాస్టరింగ్‌ ఆశీర్వద్‌ లూక్‌ దగ్గర నేర్చుకున్నా. లలిత సంగీతానికి నాన్న గారే నా గురువు. లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీలో నాకేదో స్పెషల్‌గా బోధించేవారు కాదు. అందరితో సమానంగానే నన్నూ చూసేవారు. ఏదన్నా పోటీలు ఉన్నా చివర్లో నాచేత పాడించేవారు. ఎందుకంటే ‘తన కొడుకు కాబట్టి సాకేత్‌తో మొదట పాడించి బహుమతి అందుకున్నారు’ అన్న మాట వస్తుందని. దాంతో నేర్చుకోవాలనే కసి మరీ పెరిగింది.
 
నా వెనుక అమ్మే ఉంది...
చిన్నప్పుడు అల్లరి పిల్లలందరికీ నేను బ్రాండ్‌ అంబాసిడర్‌ని. నా అల్లరిని భరించి సంగీతరంగంలో ఆసక్తిపెరిగేలా చేసింది అమ్మే. వృత్తిరీత్యా నాన్న బిజీగా ఉండటం వల్ల ఎక్కడ సంగీత పోటీలు ఉన్నా అమ్మే నన్ను తీసుకెళ్లేది. ‘పాడాలనివుంది’, ‘సప్తస్వరాలు’ వంటి ఎన్నో పోటీల్లో పాల్గొన్నా. ‘సూపర్‌సింగర్స్‌ 8’కు మెంటర్‌గా వ్యవహరించా. ‘సూపర్‌సింగర్స్‌ జూనియర్స్‌’, ‘కలర్స్‌ ఆప్‌ మ్యూజిక్‌’ కార్యక్రమాలకు హోస్ట్‌గా చేశా. నేనీ రోజున సంగీతం స్థిరపడ్డానంటే నా వెనకున్న అమ్మే కారణం.
 
బాల్యం నుంచీ పాడుతున్నా...
చిన్నప్పుడు ఆర్‌.పి పట్నాయక్‌, మణిశర్మగారి దగ్గర కోరస్‌తో కెరీర్‌ ప్రారంభించా. పెద్దయ్యాక కీరవాణిగారి టీమ్‌లో చేరా. ‘బద్రీనాథ్‌’ నుంచీ ‘బాహుబలి’ వరకూ ఆయన దగ్గర పాడుతూనే ఉన్నా. పూర్తిస్థాయి ప్లేబ్యాక్‌ సింగర్‌గా మారాక నాకు అవకాశఽమిచ్చింది సాయికార్తీక్‌గారు. మొత్తం మీద 30 సినిమాల్లో పాడాను. ఫైనల్‌ మిక్సింగ్‌ అండ్‌ మాస్టరింగ్‌ కూడా చేశా. కీరవాణి, తమన్‌, సాయికార్తీక్‌, గోపీసుందర్‌ వంటి సంగీత దర్శకుల దగ్గర రెగ్యులర్‌గా పాడుతున్నా. కార్తీక్‌ కొడకండ్ల సంగీతం అందించిన ‘బంధూక్‌’ చిత్రంలో నేను పాడిన ‘పూసిన పున్నమివెన్నెలమేన తెలంగాణ వీణా’ పాట నాకెంతో గుర్తింపు తీసుకొచ్చింది.
 
మరువలేని క్షణమది...
చిన్నప్పటి నుంచీ నాకు శంకర్‌ మహదేవన్‌గారంటే పిచ్చి. ఆయన ప్రభావం నాపై ఎక్కువగా ఉండేది. ‘ఆల్‌రెడీ ఇండస్ట్రీలో ఓ శంకర్‌ మహాదేవన్‌ ఉన్నాడు. ఇంకో శంకర్‌ మహదేవన్‌ ఉంటే ఆయన పాటలు నీకు వస్తాయి. నువ్వు డిట్టో ఆయనలాగే పాడుతున్నావ్‌. ఆ స్టైల్‌ మార్చుకుని నీ స్టైల్లో పాడు’ అని కీరవాణిగారు చెప్పారు. అప్పటి నుంచీ నాలో మార్పు వచ్చింది. సంగీతదర్శక త్రయం శంకర్‌, ఎహసాన్‌, లాయ్‌ అంటే చాలా ఇష్టం. నా స్టూడియోలో వారి ఫొటో ఉంటుంది. ‘నమో వెంకటేశాయ’లో శంకర్‌ మహదేవన్‌ ఓ పాట పాడుతుంటే కీరవాణిగారు పిలిచి ‘మీ గురువు వచ్చారు ఎలా పాడుతున్నారో చూసి నేర్చుకో’ అని స్టూడియోలో కూర్చొబెట్టారు. ఆ క్షణాల్ని ఎప్పటికీ మరచిపోలేను.
 
చెల్లి నా ధైర్యం...
చెల్లికి నేను బలం అయితే తను నా ధైర్యం. నాకు మ్యూజిక్‌ మీద ఎంత పట్టుందో తనకు లౌక్యం మీద అంత పట్టుంది. నేను ముక్కుసూటి మనిషిని. లౌక్యంగా మాట్లాడటం చేతకాదు. ‘ముక్కుసూటిగా ఉండకు.. కాస్త లౌక్యంగా ఉండరా’ అని తరచూ చెబుతుంటుంది. అలా ఎలా ఉండాలో చెల్లెలి దగ్గర నేర్చుకుంటున్నా. ఆ విషయంలో తనే నా గురువు. అమ్మా, నాన్న, నేను, చెల్లి ఫ్రెండ్స్‌లా ఉంటాం. నాకు భార్యగా వచ్చే అమ్మాయి కూడా అలాగే ఉండాలి.
 
చివరి శ్వాసవరకూ...
లలిత సంగీత శిక్షణలో రామాచారిగారు ఓ బ్రాండ్‌. ఆయనకు నేనేమీ పెద్ద పేరు తీసుకు రానవసరం లేదు. ఉన్న పేరుని తగ్గించకుండా ఉంటే చాలు. అలాగే నా శ్వాస ఉన్నంత వరకూ లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీని నడుపుతా. రామాచారిగారి అబ్బాయిగా నాకున్న లక్ష్యాలివి. మంచి పాటలు పాడాలి, టాప్‌ సింగర్‌గా ఎదగాలి. పేరుతోపాటు డబ్బు కూడా సంపాదించాలి అన్నది సింగర్‌గా నాకున్న కోరికలు. డబ్బుంటేనే కదా ఫ్యామిలీని బాగా చూసుకోగలం.
 ఓ పాట బాగా రావాలంటే దాని సిట్యువేషన్‌కి తగ్గ వాయిస్‌, సాంగ్‌ టఫ్‌నెస్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కమాండ్‌ చాలా ముఖ్యం. పాటలో బెటర్‌మెంట్‌ ఏం చెయ్యాలో చెప్పకుండా ‘ఇంకేదన్నా చెయ్యండి’ అంటే సంగీత దర్శకుడికి ఏం కావాలో క్లారిటీ లేనట్లే. అలాంటి సందర్భాల్లోనే పాటలు సరిగ్గారావని నా అభిప్రాయం.
 
 సంగీతాన్ని వ్యాపారంగా చూసినప్పుడు క్వాలిటీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. గొంతు సమస్య ఉన్నప్పుడు చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతా.
 
గుర్తింపు తెచ్చిన పాటలు
లెట్స్‌ డూ (ఇంటెలిజెంట్‌)
బొమ్మ అదిరింది, టైటిల్‌ సాంగ్‌ (జవాన్‌)
మహా పద్మ (ఓం నమో వెంకటేశాయ)
జంతర్‌మంతర్‌ (ద్వారక)
సెల్ఫీరాజా టైటిల్‌ సాంగ్‌.
 
 ఆలపాటి మధు