తెలుగునాట చిత్రకళారాధన పెంపొందాలి

చిత్ర కళను వారసత్వంగా పొందిన డిజిటల్‌ గీతల మాంత్రికుడు , వాటర్‌ కలర్స్‌ పెయింటింగ్స్‌లో సిద్ధహస్తుడు ‘గిరిధర్‌. అటు మాన్యువల్‌ ఆర్ట్‌లోనూ, ఇటు డిజిటల్‌ ఆర్ట్‌లోనూ చేయితిరిగిన చిత్రకళాకారుడు . ఇటీవలే ఇంటర్నేషనల్‌ వాటర్‌ కలర్స్‌ సొసైటీ ఎగ్జిబిషన్‌లో ఆయన పెయింటింగ్‌ ప్రశంసలందకుంది .చిత్రకళకు ప్రాచుర్యం, ప్రజాదరణ పెరగాలంటే , ‘చిత్ర సంత’లు, ఆర్ట్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని, డ్రాయింగ్‌ క్లాసులు పునరుద్ధరించాలంటున్న గిరిధర్‌ ఇంటర్వ్యూ

కృష్ణాజిల్లా మచిలీపట్నం మా ఊరు. మా తాతగారు అరసవల్లి కామాచార్య. వాస్తుసిద్ధాంతి. ఆయన వాస్తుసిద్ధాంత గ్రంథాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నారు. నాన్న అరసవల్లి విశ్వనాథబాబు. అమ్మ రాధాదేవి. నాకు ఇద్దరు అక్కలు. 1973 ఫిబ్రవరి 4వ తేదీన నేను పుట్టాను. నాన్న కమర్షియల్‌ డిజైన్‌ ఆర్టిస్ట్‌గా విజయవాడలో స్థిరపడ్డారు. చిలకలపూడి ఆభరణాల తయారీకి డిజైనింగ్‌ చేస్తూ, నిర్మల ప్రాసెస్‌ నిర్మలబాబుగా, ఎ.వి.బాబుగా పేరొందారు. నా బాల్యం నుంచీ ఇంట్లో ఆర్ట్‌ వాతావరణమే. దాంతో నాకు తెలియకుండానే చిత్ర కళాకారుడుగా ఎదిగాను. నేను టెన్త్‌ క్లాస్‌లోకి వచ్చేసరికి నాన్న విజయవాడలో మొట్టమొదటి ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌..సన్‌రైజ్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్స్‌ పెట్టి దెబ్బతినడంతో నాన్నగారికి వృత్తిలో అండగా నిలబడ్డాను.

ఒకపూట కాలేజీ చదువు, రెండోపూట ఆర్ట్‌ డిజైనింగ్‌లో కమర్షియల్‌ ప్రోడక్ట్‌ వర్క్‌ చేసేవాణ్ణి. ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్‌, గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించిన ఈశ్వర్‌ మా మావయ్య. ఆయన డిజైన్‌వర్క్‌ చూసి నాకు నేనుగా చిత్రకళలో మెళకువలు నేర్చుకుంటూ నావర్క్‌కి మెరుగులు దిద్దుకునేవాణ్ణి.డిగ్రీపూర్తయ్యాక 1997లో చిత్రకళాకారుడిగా స్థిరపడ్డాను. డిజిటల్‌ ప్యాడ్‌పై గీతలు గీస్తూ, ఆధునిక టెక్నాటజీని ఒంటబట్టించుకునేవరకు, అంటే 1998వరకు కుంచెతోనే బొమ్మలు గీశాను. కంప్యూటర్‌ డిప్లమో, మైసూర్‌ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బి.ఎఫ్‌.ఎ) కోర్స్‌ చేశాక చాలా సులభంగా సృజనాత్మకంగా డిజిటల్‌ వే లో డిజైనింగ్‌, పెయింటింగ్‌ వర్కులు చేయడం ప్రారంభించాను. కాన్వాస్‌ పెయింటింగ్‌, కలర్‌ పెయింటింగ్‌ సహా అన్ని రకాల వర్కులూ చేస్తాను.

ఐదువేలకు పైగా పుస్తకాలకు ముఖచిత్రాలు

ప్రధానంగా నేను ఎంచుకున్నది ప్రింట్‌ మీడియా డిజైనింగ్‌. విజయవాడలో ఉన్న ప్రసిద్ధిచెందిన బుక్‌ పబ్లిషింగ్‌ హౌస్‌లన్నింటికీ ముఖచిత్రాలు గీసేవాణ్ణి. అలా ఇరవైయేళ్ళలో ఐదువేలకు పైగా పుస్తకాలకు ముఖచిత్రాలు గీశాను. ఈ రంగంలో నాకు మంచి గుర్తింపు రావడానికి ప్రధానకారకులు శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వరరావుగారే.చాలాకాలంగా ఆర్టిస్టులందరూ కంప్యూటర్‌కే అలవాటుపడ్డారు. అయితే నేను అటు కుంచెపట్టుకునీ, ఇటు డిజిటల్‌ ప్యాడ్‌పైన ఆర్ట్‌ డిజైనింగ్‌ చేయగలను. ఇలా తెలుగునాట డిజిటల్‌ ఆర్ట్‌ వర్క్‌–మాన్యువల్‌ ఆర్ట్‌ వర్క్‌ రెండూ చేయగల అతి తక్కువమందిలో నేనూ ఒకణ్ణి. డిజిటల్‌ వర్క్‌ మొనాటనస్‌గా అనిపించటంతో, వెరైటీ చూపించడం కోసం 2012నుంచి మళ్ళీ కుంచె పట్టుకున్నాను. కంటెంట్‌ ఆధారంగా కుంచెతోనే బొమ్మలు గీయడం, టైటిల్‌ అక్షరాలు కూడా క్రియేటివ్‌గా కుంచెతోనే రాయడంతో, ఇప్పుడు చాలామంది దీన్నే లైక్‌ చేస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతోవాటర్‌ కలర్స్‌ పెయింటింగ్‌

వాటర్‌ కలర్స్‌తో పెయింటింగ్‌ నాదైన ప్రత్యేకత. దీనిలో మంచి గ్రిప్‌ సంపాదించాను. ఎవరికైనా, ఎక్కడైనా వాటర్‌ కలర్స్‌ పెయింటింగ్‌లే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటర్‌ కలర్స్‌తో పోట్రైట్స్‌, ల్యాండ్‌స్కేప్స్‌ వేస్తాను. డిజిటల్‌లో ప్రొట్రైట్స్‌, పెయింటింగ్స్‌, కాన్వాస్‌మీద ఆయిల్‌ పెయింటింగ్‌, ఆక్రలిక్‌ పెయింటింగ్‌ చేస్తాను.