కళా ప్రపంచంలో తోట వైకుంఠానికి ఒక విశిష్ట స్థానముంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సాధించిన అతి కొద్ది మంది భారతీయ పెయింటర్స్‌లో ఒకరైన వైకుంఠం పెయింటింగ్స్‌తో  హైదరాబాద్‌లో ఒక ప్రత్యేకమైన ఆర్ట్‌షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.. 
 
చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో ఆర్ట్‌షో నిర్వహిస్తున్నారు. ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే ఎలా అనిపిస్తోంది..? 
మనం జీవించిన కాలాన్ని భవిష్యత తరాల వారికి అందించటంలో కళ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నా పెయింటింగ్స్‌లో నేను చూసిన దృశ్యాలు, మనుషులు కనిపిస్తారు. నాకు స్ఫూర్తి మా ఊరే! ఉదాహరణకు ఏటా సంక్రాంతికి ఊరు వెళ్లేవాళ్లం. పశువులను కడిగేవాళ్లం. వాటిని అలంకరించేవాళ్లం. ఆడించేవాళ్లం. ఈ తరం వాళ్లకి అవేవీ తెలియవు. అవన్నీ నా పెయింటింగ్స్‌లో ప్రతిఫలిస్తుంటాయి.
 
తెలంగాణ మహిళ అనగానే వైకుంఠం పెయింటింగ్‌ గుర్తుకు వస్తుందనేవాళ్లు అనేక మంది.. ఈ చిత్రీకరణ ఎలా సాధ్యమయింది.. 
ఏ కుటుంబంలోనైనా మహిళ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంట్లో మగాడు బయట తిరుగుతాడు. అన్ని చక్కదిద్దేది మహిళే. చిన్నప్పుడు మా ఇంట్లో- నాన్న తరచూ ఊర్లు వెళ్లేవాడు. కొన్నిసార్లు వారం రోజుల తర్వాతొచ్చేవాడు. ఆ సమయంలో మాకు కావాల్సినవన్నీ మా అమ్మే చూసుకొనేది. నాకు రాత్రి భయమయితే అమ్మ దగ్గరకు వెళ్లి పడుకొనేవాడిని. అందుకే నా పెయింటింగ్స్‌లో తెలంగాణ మహిళ కనిపిస్తుంది.
 
మీ పెయింటింగ్స్‌లో కనిపించే మహిళా రూపాలు మీ అమ్మవేనా? 
చాలా మంది విమర్శకులు మా అమ్మ బొమ్మే నా ఆర్ట్‌లో కనిపిస్తుందంటారు. నా బొమ్మల్లో కనిపించే పెద్ద బొట్టు మా అమ్మదే. ఆమె మిగిలిన వారికన్నా పెద్ద బొట్టు పెట్టుకొనేది. అదే విధంగా పెయింటింగ్స్‌కు సంబంధించిన రకరకాల నేపథ్యాలు నేను చూసినవే. మేము కొమటిలమైనా మాకు కొంత వ్యవసాయం ఉండేది. అమ్మ వ్యవసాయం చూసుకొనేది. ఎండకు ఎండేది. వానకు తడిసేది. రాత్రి నాకన్నా ఆలస్యంగా పడుకొనేది. ఉదయాన్నే నాకన్నా ముందే లేచేది.
 
మీ చిత్రాల్లో కనిపించే ఆభరణాలు కూడా మీ అమ్మవేనా? 
లే.. మా అమ్మ బీదది..(నవ్వులు) మా నాయనమ్మకు నగలుండేవి. ఆవిడ డబ్బున్నది. మేము స్థిరపడిన తర్వాత మా అన్నయ్య - ‘‘అమ్మ..నువ్వు నగలు చేయించుకోవాలి..’’ అంటే ‘‘నాకొద్దు బిడ్డా.. నేను కష్టపడి పనిచేసుకుంటున్నా.. ఆనందంగా ఉన్నా..’’ అంది. ఇక ఆభరణాల విషయానికి వస్తే- మా ఇంటి పక్కన కంసాలులు ఉండేవారు. వారి దగ్గర పుస్తకాల్లో రకరకాల ఆభరణాల బొమ్మలుండేవి. చిన్నప్పటి నుంచి ఆ బొమ్మలను నా డ్రాయింగ్‌ బుక్‌లో వేసేవాడిని. మా ఊర్లో ఉండే కొంత మంది కంసాలులు- ఆదిలాబాద్‌ వంటి దూరప్రాంతాలకు పోయి అక్కడ ఆదివాసీలకు నగలు చేసేవారు. అవి పెద్దపెద్దగా ఉండేవి. వారు ఊరు వచ్చి- ఆ ఆభరణాల డ్రాయింగ్స్‌ గీసి చూపించేవారు. ఇలా ఆభరణాలపై నాకు ప్రత్యేక శ్రద్ధ ఏర్పడింది.
 
తెలంగాణ సంస్కృతి మీ పెయింటింగ్స్‌లో బలంగా ప్రతిఫలించడం వెనకున్న కారణాలేమిటి? 

నాది రియలిస్టిక్‌ పెయింటింగ్‌ కాదు. అంటే మనుషులు యథాతథంగా కనిపించరు. నా చిత్రలేఖన శైలికి తగినట్లుగా ఉంటారు. ఇక నేపథ్యం విషయానికి వస్తే- నేను బరోడాలో చదువుకుంటున్నప్పుడు- అక్కడ కొందరు విదేశీ విద్యార్థులుండేవారు. వారు ‘మీ భారతీయులు పికాసోలాంటి విదేశీ పెయింటర్స్‌ను కాపీ కొడతారు’ అనేవారు. ఆ సమయంలోనే చిత్రకళలో మన మూలాలను వ్యక్తీకరించాలన్న ఆలోచన నాకు బలంగా నాటుకుపోయింది. దీనికో కారణముంది. మన మూలాలను ప్రతిఫలించేదేదైనా చాలా బలంగా ఉంటుంది. ఉదాహరణకు సత్యజిత రే , గౌతమ్‌ఘోష్‌ల సినిమాలు తీసుకోండి. అవి అంత బావుండటానికి- గ్రామీణ నేపథ్యమే కారణం. వారి సినిమాల్లో పాత్రలకు మేకప్‌ ఉండదు. సామాన్య ప్రజలు ఎలా ఉంటారో పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అంటే మూలాలు బలంగా ఉన్న ఏ కళ అయినా బావుంటుంది. అందుకే నేను తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పెయింటింగ్స్‌ వేయటం మొదలుపెట్టాను.

బ్లాక్‌ అండ్‌ వైట్‌తో మొదలుపెట్టి కలర్‌ పెయింటింగ్స్‌ వైపు మళ్లారు.. మీకు ఈ రెండింటిలో ఏవి ఎక్కువ ఇష్టం.. 
ఇప్పటికీ నాకు బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటేనే ఇష్టం..(నవ్వులు) కానీ కలర్‌ కూడా జీవితంలో ఒక ముఖ్యమైన భాగమే. ఒక సినిమా నిర్మాణ సమయంలో నరసింగ్‌ (దర్శకుడు బి.నరసింగరావు) వచ్చి డ్రాయింగ్స్‌ చూసి చాలా బావున్నాయి.. కానీ కలర్స్‌ ఏం వాడాలి? అన్నాడు. సాధారణంగా మనం వాడే రంగులు, యూరోపియన్‌ రంగులకు చాలా తేడా ఉంటుంది. మన వాళ్లు చాలా కాంతివంతమైన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి రంగులు వాడతారు. మీరు పల్లెటూర్లకు వెళ్లి చూడండి.. అక్కడ ప్రజలు వేసుకొనే బట్టల రంగులు చూడండి.. పట్టణాలలో పై నుంచి కిందిదాకా ఒకటే రంగు వేస్తారు. పల్లెల్లో రకరకాల రంగుల దుస్తులు వేసుకుంటారు.. అంత దాకా ఎందుకు.. ఇంట్లో పూలేమి లేకపోతే.. తంగేడు పువ్వు తెంపి జడలో తురుముకుంటారు.
 
మీకు అనేక ప్రశంసలు లభించి ఉంటాయి.. వాటిలో తృప్తినిచ్చింది.. 
నా పెయింటింగ్‌ చూసి అవతల వ్యక్తి ముఖంలో ఆనందం కనిపించినప్పుడు వచ్చే తృప్తికి ఏది సరిపోలదు. అదే నాకు స్ఫూర్తిని ఇస్తుంది. ముందుకు నడిపిస్తుంది.
 
నేటి కళాకారులపై మీ అభిప్రాయం.. 
చాలా మంది మంచి కళాకారులున్నారు. అయితే కొద్ది మంది మాత్రమే విజయవంతమవుతున్నారు. మిగిలిన వారందరికీ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు నేను ఈ మధ్య కొరియా వెళ్లా. అక్కడ ఆర్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆర్ట్‌ కాలేజీ నుంచి బయటకు రాగానే ప్రభుత్వమే వారికి కొన్ని మౌలిక సదుపాయలు కల్పిస్తుంది. వారి ఆర్ట్‌ను ప్రదర్శించటానికి కొన్ని గ్యాలరీలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ప్రభుత్వమే కొన్ని పెయింటింగ్స్‌ను కూడా కొంటుంది. వీటి వల్ల ఒక కళాకారుడు కొద్ది కాలం ఇబ్బంది పడకుండా తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతాడు. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. అందుకే హైదరాబాద్‌లో దాదాపు మూడు వేల మంది పెయింటర్స్‌ ఉన్నా- వారికి తగినంత పేరు రావటం లేదు.
 
నా చిత్రాలు చాలా సింపుల్‌గా ఉంటాయి. టూ డైమెన్షనల్‌గానే ఉంటాయి. లైటింగ్‌ కూడా ఫ్లాట్‌గా ఉంటుంది. 

ఒకప్పుడు పల్లెల్లో సాయంత్రం బయట కూర్చునేవారు. పాటలు పాడుకొనేవారు. రాత్రిళ్లు నాటకాలు వేసేవారు. కానీ టీవీ రావటంతో ఇవన్నీ మారిపోయాయి. 

నాకు బిస్మిలాఖాన్‌ షెహనాయ్‌ అంటే ప్రాణం. ఆయన ఒకసారి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ కార్యక్రమానికి మేమందరం వెళ్లాం. వాన పడటంతో పదిమంది తప్ప మిగిలినవాళ్లందరూ చెల్లాచెదురయ్యారు. బిస్మిలాఖాన్‌ మమల్ని- ‘‘వాన పడుతోంది కదా.. వేదిక పైకి వచ్చేయండి..’’ అన్నారు. అందరం పైకి ఎక్కితే వేదిక కూలిపోతుందని మేము భయపడ్డాం. కానీ ఆయన పర్వాలేదు పైకి వచ్చేయండి.. అన్నారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. 

ముంబయికి చెందిన ఇండియా ఫైన్‌ ఆర్ట్‌ సంస్థ హైదరాబాద్‌, మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో నిర్వహిస్తున్న ‘భావతరంగం- ఎ రిట్రాస్పెక్టివ్‌’ అనే ఎగ్జిబిషన్‌ ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది.
 
సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 
ఫోటోలు: లవకుమార్‌