క్షేత్రయ్య కీర్తి.. రాజ్యలక్ష్మి స్ఫూర్తి 

క్షేత్రయ్యను త్రివేణి సంగమం అంటారు. సంగీత, సాహిత్య, నృత్య క ళలకు ఆయన పదాలు ఎనలేని సంపదగా నిలవడమే అందుకు కారణం. అయినా కొన్ని కారణాల వల్ల, అపోహల వల్ల అన్నమయ్య పదాలకు త్యాగరాజు కీర్తనలకు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు క్షేత్రయ్య పదాలకు రాలేదు. అందుకే, ఎప్పటికైనా క్షేత్రయ్యకు కూడా అంతటి కీర్తి వచ్చేలా కృషి చేస్తానంటున్నారు.. కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి నల్లాన్‌ చక్రవర్తుల రాజ్యలక్ష్మి. 


‘‘మా ఇల్లే నా సంగీతానికి మూలం. అమ్మ యతిరాజవల్లి ఆధ్యాత్మిక గీతాలను పాడేవారు. ప్రతిరోజూ తెల్లవారు జామున నిద్రలేపి కొన్ని కీర్తనలను మాతో కూడా పాడించేవారు. మా నాన్నగారు 
నారాయణాచార్యులు. కోర్టు పనులపై ఆయన తరచూ మద్రాస్‌కు వెళ్తుండేవారు. అక్కడ నాన్నకు ఎదురైన సంగీత విద్వాంసులు, సంగీత వాతావరణం, నన్నో సంగీత విద్వాంసురాలిని చేయాలన్న తలంపు రావడానికి కారణమయ్యాయి. దివి తాలూకా తహసీల్దారుగా ఉండేవారు నాన్న. అవనిగడ్డకు చెందిన సంగీతం మాస్టారు వక్కలగడ్డ రాఘవయ్య మా ఇంటికి వచ్చి నాకు సంగీత పాఠాలు చెప్పేవారు. నిజానికి నాకు అంతోఇంతో సంగీత పరిజ్ఞానం ఏర్పడటానికి ఆయనే మూలం. ఆ తర్వాత వివాహం అయ్యాక 1957లో హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికే నేను ఎస్‌.ఎ్‌స.ఎల్‌.సి చదివాను. అదే క్వాలిఫికేషన్‌పై టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌ వచ్చాక మావారు నల్లాన్‌ చక్రవర్తుల వరదాచారి ప్రోత్సాహంతో ప్రభుత్వ త్యాగరాజ సంగీత కళాశాలలోని మ్యూజిక్‌ లెక్చరర్‌గా ఉన్న సుసర్ల శివరామ్‌గారు.. మా ఇంటికి వచ్చి ఓ ఐదేళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్పారు. ఆ తర్వాత వివిధ ప్రమోషన్‌లు వచ్చాయి. చివరికి గ్రూప్‌ ఏ ఆఫీసర్‌గా అంటే టెలిఫోన్‌ ట్రాఫిక్‌ సూపరింటెండెంట్‌గా 1996లో పదవీ విరమణ పొందాను.
 
రిటైర్‌ అయ్యాకే... 
రిటైర్‌ అయ్యాకే తెలుగు లిటరేచర్‌లో, సంగీతంలో ఎం.ఏ చేశాను. ఆలిండియా రేడియోలో మంచాల జగన్నాథరావు మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌గా ఉండేవారు. ఆయన క్షేత్రయ్య పదాలు అని ఒక పుస్తకం రాశారు. వాటిని ఆయనే స్వరపరిచారు కూడా. నేను రేడియో ఆడిషన్‌ పాసైనప్పుడు మా గురువు గారు ఆ పుస్తకాన్ని నాకు బహూకరించారు. అందులోని పదాలను పాడటానికి ప్రయత్నించమని చెప్పారు. అప్పటిదాకా నాకు క్షేత్రయ్య ఎవరో, క్షేత్రయ్య పదాలేమిటో బొత్తిగా తెలియదు. అందుకే ఆ పుస్తకాన్ని ఓ మూలన పడేసి దానివైపు తొంగి చూడలేదు. కానీ, అనుకోకుండా ఒకరోజు ఆ పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తే ఆ పదాల్లోని సాహిత్యం నన్నెంతో ఆకర్షించింది. అలా కొద్దిరోజులు చదువుతూ పోయాక ఈ పదాలను విస్తృతంగా పాడటం ద్వారా జనంలోకి తీసుకువెళ్లాలన్న తలంపు కలిగింది. గురువుగారు ఆజ్ఞాపించారు కాబట్టి నాలో అదో పట్టుదలగా మారింది. నా ప్రయత్నం కూడా అక్కడే మొదలైంది.
 
వేగం పెరగాలిగా... 
దశాబ్దాలుగా.. క్షేత్రయ్య పదాలను విలంబంగా అంటే నిదానంగా, సుదీర్ఘంగా పాడే నియమమే ఉంటూ వచ్చింది. ఆ విషయానికి సంబంధించి పుస్తకాలు ఏమీ లేకపోయినా మౌఖికంగా ఆ భావన సమాజంలో పాతుకుపోయింది. అయితే ఈ రోజుల్లో అంత విస్తృతితో విస్తారంగా పాడితే ఎవరూ వినరని, అలా వినని కారణంగా అసలు పాడటమే మానేశారని నాకు బోధపడింది. అందుకే గంట సేపు పాడే క్షేత్రయ్య పదాన్ని కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే పాడేలా నేనే స్వరపరిచాను. ఈ ప్రయత్నంతో ఆ సంప్రదాయ రీతిని పాడుచేశానని కాదు. అసలే సమయాభావంతో సతమతమవుతున్న నేటి సమాజానికి తక్కువ వ్యవధిలో విని.. వాటి మాధుర్యాన్ని ఆస్వాదింప చేసే ప్రయత్నం చేశాను. ఈ నా ప్రయత్నానికి అత్యధికులు హర్షాన్నీ, ఆనందాన్నీ వ్యక్తం చేశారు. మొదట్లో అన్నమయ్య పదాలను స్వరపరిచిన పత్రాలేమీ లేవు. ఆ తర్వాతే కొందరు సంగీత విద్వాంసులు వాటిని స్వరపరిచి ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. క్షేత్రయ్య విషయంలో అదేమీ జరగలేదు. అలా జరగకపోవడానికి ఆయన పదాలు విలంబంగా మాత్రమే పాడాలన్న షరతు ఒక కారణమైతే, వాటిలో శృంగార భావనలే తప్ప మరేమీ లేదనే భావన మరో కారణం. అయితే అన్నమయ్యకు ఈ అవస్థ ఎదురు కాలేదు. కాకపోతే, వీరిద్దరి మధ్య ఒక ప్రధానమైన తేడా ఉంది.
 
మధుర భక్తి వేరు.. 
అన్నమయ్య పదాలు భక్తి ప్రధానమైనవైతే, క్షేత్రయ్య పదాలు మధుర భక్తి ప్రధానమైనవి. మధుర భక్తి పదకారుల దృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు. మిగతా వారంతా సీ్త్రలే. భక్తుడు ఇలా సీ్త్ర భావనతో, ప్రేయసి భావనతో భగవంతుణ్ని ఆరాధించడమే మధుర భక్తి. జీవాత్మ, పరమాత్మలో విలీనమయ్యే భావనా సాహిత్యమే ఈ మధుర భక్తిలో ఉంటుంది. మీరాబాయిది కూడా మధుర భక్తే, ఆమె కృష్ణుణ్ని ప్రేమికుడిగా ఆరాధించింది. దాని వెనకున్నది భక్తి భావనే తప్ప శృంగార భావన కాదు. కానీ, కొందరు ఈ అభిప్రాయంతో ఏకీభవించరు.. అందుకే క్షేత్రయ్య పదాలను భక్తిదాయక పదాలుగా కాకుండా, శృంగార పదాలుగా కొందరు వ్యాఖ్యానించారు. వాటిని దూరంగా ఉంచారు. ఆ క్రమంలోనే క్షేత్రయ్యను అతని స్వగ్రామమైన మువ్వ నుంచి బహిష్కరించారు. నిజానికి అన్నమయ్య కూడా వీళ్లంతా అంటున్న శృంగార పదాలు రాశారు. కాకపోతే అవి అలివేలు మంగ, శ్రీ వేంకటేశ్వరునికి సంబంధించిన వియోగ సంయోగ విషయాలైపోయాయి. అందుకే క్షేత్రయ్య పైన వచ్చిన విమర్శలు, అన్నమయ్యపై రాలేదు. నిజానికి క్షేత్రయ్య పదాల్లో పైకి శృంగారం కనిపించినా.. వాటిలో అంతర్లీనంగా ఉన్నది మువ్వ గోపాలుని పట్ల ఉన్న మధుర భక్తి భావనే. ఈ విషయాలనే ‘మువ్వ క్షేత్రజ్ఞ వైభవం’ అన్న పుస్తకంలో రాశాను. స్వగ్రామం నుంచి బహిష్కరించాక క్షేత్రాలన్నీ తిరిగాడు కాబట్టి అతని అసలు పేరు వరదయ్య పోయి క్షేత్రయ్యగా మారిందని చెబుతారు. భగవద్గీత అనుసరించి క్షేత్రం అంటే ఆత్మ కాబట్టి ఆత్మజ్ఞాన సిద్ధుడు.. క్షేత్రజ్ఞుడు కాబట్టి ఆయనకు క్షేత్రయ్య అనే పేరు వచ్చింద నేది వాస్తవిక విశ్లేషణ అవుతుంది.

మనం మారాలి 

క్షేత్రయ్య పదాలను అత్యంత నిదానంగా పాడాలంటూ భీష్మించుకుంటే ఏమయ్యింది.? ఆ పదాలను ఎవరూ వినలేని పరిస్థితి ఏర్పడింది. క్షేత్రయ్య పదాలు జనాలకు దూరం కావడానికి వాటిలో శృంగారమే ఉందన్న అపోహ ఒక కారణమైతే, విలంబనా విధానం నుంచి ఏమాత్రం వైదొలగకపోవడం మరో కారణమైంది. అందుకే క్షేత్రయ్య విషయంలో నేను రెండు లక్ష్యాలు ఏర్పరచుకున్నాను. వాటిలో ఈ మహాకవి పదాల్లో ఉన్నది శృంగార భావనే కాదని చెప్పడం ఒక లక్ష్యం అయితే.. వాటిని అన్నమయ్య పదాల్లాగే ఐదారు నిమిషాల నిడివిలో పాడే కొత్త పంథాను జనంలోకి తీసుకు వెళ్లాలన్నది మరో లక్ష్యం. ఈ నా ప్రయత్నాన్ని కొంత మంది పండితులు విమర్శించినా, ఎంతో మంది ప్రజలు ఈ విధానానికి ఆనందిస్తున్నారు. అభినందిస్తున్నారు. విమర్శించే ఆ పండితులైనా క్షేత్రయ్య పదాలను పాడే విధానం ఇది కాదు కదా అంటారే గానీ, తాము పాడి వినిపించరు. నిజానికి ముందు విమర్శించిన పండితుల్లో కూడా కొందరు ఆ తర్వాత ఆమోదిస్తున్నారు. క్షేత్రయ్య పదాలు సంగీతపరంగా, సాహిత్యపరంగా, నాట్య పరంగా ఎంతో ఉపయుక్తమైనవి. క్షేత్రయ్యపదాలను నెమ్మదిగా పాడే రోజుల్లో ఆ పదాలకు చేసే నాట్యం కూడా అదే రీతిలోనే ఉండేది. అందుకే చాలా మంది జనం వాటికి దూరమైపోయారు. అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలు పొందిన ప్రఖ్యాతి క్షేత్రయ్య పదాలకూ లభించేలా నా వంతు కృషి చేస్తాను. పాడటంలో వేగాన్ని పెంచితే, నాట్యంలో కూడా వేగం పెరుగుతుంది. ఇది జరగాలి. అందుకే ఈ కొత్త రీతులను నా వద్ద సంగీతం నేర్చుకుంటున్న వారికి చెబుతున్నాను. కొత్త తరం వారు క్షేత్రయ్య పదాలను వినూత్నంగా పాడుతూ వాటిని విశ్వవ్యాప్తం చేస్తారని బలంగా నమ్ముతున్నాను. 



‘‘రాజ్యలక్ష్మి కొన్నేళ్లుగా క్షేత్రయ్య పదాలను స్వరపరిచి గానం చేస్తున్నారు. ఆలిండియా రేడియోలో గత 40 ఏళ్లుగా గానం చేస్తుండటం వల్ల సంగీత ప్రియులకు ఆమె గొంతు చిరపరిచితం. ప్రస్తుతం ఆమెకు 79 ఏళ్లు. అయినా ఆమె స్వరం చెక్కు చెదరలేదు. క్షేత్రయ్య పదాలకు కొత్త వన్నెలు దిద్దుతోంది. క్షేత్రయ్య రాసిన 330 పదాలు, ఆయన జీవిత వృత్తాంతాన్ని తెలియజేసే ఒక పుస్తకం, సీడీలను విడుదల చేశారు’’