సృజన క్రమంలో రచయిత ఏదో ఒక చోట ఆగిపోతాడు. రాయలేని స్థితిలోకి నెట్టబడ్తాడు. అప్పుడు మెరుపులా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ప్రవేశించి ఆ రచనని పూర్తి చేసి రచయతని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ అనుభవం ప్రతి సృజనకారుడికి వుంటుంది. గొప్ప రచనల్లో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర ఎంతో వుంటుంది. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు లేని రచన చప్పగా, నిస్సారంగా వుంటుంది.

మీరు ‘ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు’ పుస్తకం వెలువరించిన నేపథ్యం ఏమిటి?

విమర్శలో శూన్యాన్ని పూడ్చే క్రమంలో ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు సిద్ధాంత పుస్తకం రాశాను. ఓ రచన ఈ కాలంలో సిజేరియన్‌ బిడ్డగా బైటికి వస్తోంది. సహజాతి సహజంగా రచన రావాలని ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు బోధిస్తాయి. రచన తన చరిత్ర తాను రాసుకుంటుంది. మంచి రచనకి రచయిత ఓ సాధనంగా ఉపకరిస్తాడు. ఆ జ్ఞానాన్ని ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు తేటతెల్లం చేస్తాయి.

ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు మీ సిద్ధాంతంగా ఎలా ప్రకటిస్తారు?

 

కాయ చెట్టు నుంచి కిందపడితే అది గురుత్వాకర్షణ సిద్ధాంతంగా అవతరించినట్లు ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సిద్ధాంతం కూడా ప్రతి రచయితకీ అనుభవైకవేద్యమే. దానికి నేను పేరు తగిలించాను, అంతే. ప్రపంచ సాహిత్య వారసత్వంగా ఈ సిద్ధాంతం నా ద్వారా బైటపడిందని నేను భావిస్తున్నాను. ప్రపంచంలో ఏ భాషలోనూ యింతవరకూ ఇలాంటి సిద్ధాంతం రాలేదు. అందుకే ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు నా సిద్ధాంతంగా ప్రకటించాను. ఇంతవరకూ మన విమర్శకులు పాశ్చాత్య, ప్రాచీన సిద్ధాంతాలను గుమ్మరించారే తప్ప స్వీయ, దేశీయ సిద్ధాంతాలను ప్రతిపాదించలేదు. నేను ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు సూత్రీకరణ ద్వారా ఆ లోటును, ఆ శూన్యాన్ని పూడ్చటానికి ప్రయత్నించాను. అదొక ప్రయత్నం. అంతేకాదు, వస్తుశిల్పాల మధ్య వైరుధ్యాలు తప్పక వుంటాయని నా వ్యాసాలలో వివరించే ప్రయత్నం చేశాను. వస్తు స్వభావం నిస్వభావం కావటమూ తెలియజేశాను.

అసలు ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు అంటే ఏమిటి?

సూక్ష్మంగా చెబితే- వస్తువు యొక్క వస్తువు ప్రచ్ఛన్న వస్తువు. శిల్పం యొక్క శిల్పం ప్రచ్ఛన్న శిల్పం. ఇదే ప్రచ్ఛన్న వస్తుశిల్పాల ప్రచ్ఛన్న రహస్యయాత్ర. రచనలో... అది తొవ్వి తీయాల్సిన అవసరం ఎంతో వుంది. భవిష్యత్తు విమర్శకి దాగిన పునాది ఇక్కడే వుంది. అదే ప్రచ్ఛన్న సాహిత్య అనాది రచనా చరిత్ర అవుతుంది. నిజానికి రచనలో దేని గురించి చెబుతున్నామో, ఆ విషయాన్ని ‘వస్తువు’ అనీ, చెప్పే పద్ధతిని ‘శిల్పం’ అనీ పరిగణిస్తుంటాం. సృజన క్రమంలో రచయిత ఏదో ఒక చోట ఆగిపోతాడు. రాయలేని స్థితిలోకి నెట్టబడ్తాడు. అప్పుడు మెరుపులా ప్రచ్ఛన్న వస్తు శిల్పాలు ప్రవేశించి ఆ రచనని పూర్తి చేసి రచయతని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ అనుభవం ప్రతి సృజనకారుడికి వుంటుంది. గొప్ప రచనల్లో ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్ర ఎంతో వుంటుంది. ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు లేని రచన చప్పగా, నిస్సారంగా వుంటుంది.

ప్రచ్ఛన్న వస్తుశిల్పాల సజీవత ఏమిటి?

ఏ రచయిత అయినా వస్తువులోకి జీవం ప్రవహింప జేయాలి. ఆ సజీవతని ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు పరిపోషి స్తాయి. ప్రయత్నపూర్వక రచనల్లో కంటే రచన తనంతట తాను వచ్చి రాయించుకొని పోయే క్రమంలోని అప్రయత్న పూర్వక రచనల్లో ప్రచ్ఛన్న వస్తుశిల్పాలు తొణికిసలాడి మహా గొప్ప రచనని అందిస్తాయి. పోతన రాసిన ‘అలవైకుంఠపురంలో..’ పద్యంగానీ, శ్రీశ్రీ రాసిన ‘కవితా! ఓ కవితా!’ గానీ ప్రచ్ఛన్న వస్తుశిల్పాల పాత్రకి ఓ చిన్ని ఉదాహరణలు మాత్రమే.

98854 73934