వ్యక్తి వికాసానికి దోహద పడాలి
ప్రగతిశీల రచనలు రావాలి
ఆర్య సమాజంతో అనుబంధం
తొలి పుస్తకం ‘అనాది చిత్రం’

‘సాహిత్యంతో ఆనందప్రాప్తి జరగాలి. శారీరక, మానసిక, ప్రాకృతిక, భౌతిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూర్చే రచనలు రావాలి’ అని మహబూబ్‌నగర్‌ పట్టణ వాసి, కవి, విశ్రాంత ఉపాధ్యాయుడు కూర హన్మయ్య అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎక్కువగా ఉద్వేగ పూరితంగా, అహంభావ భావాలతో ఉన్న రచనలు వస్తున్నాయన్న ఆయన, వాటి స్థానంలో ప్రగతి శీల సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. సాహిత్యం సమష్టి ప్రయోజనం కోసం కాదు, వ్యష్టి ప్రయోజనం కోసమన్నది తన నిశ్చిత అభిప్రాయమన్నారు. కవిత్వం, వర్తమాన సాహిత్యం, అభిప్రాయా లు, అనుభవాలపై ‘ఆంధ్రజ్యోతి’తో తన మనోభావాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

నాన్న వద్దన్నారు

ఏడో తరగతిలో ఉన్నప్పుడే పిల్లల కవిత్వం రాసేవాడిని. కలువబాల, వేంకటేశ్వర మహాత్మ్యం పేరుతో రాశాను. వాటిని మా నాన్న చూసి కోపం చేశారు. అది విద్యకు ద్రోహం చేయడ మేన న్నారు. అది నీ స్థాయి కాదు. ఇంకా చాలా చదవాల్సి ఉందని చెప్పారు. దీంతో రాయడం ఆపేశాను. ఆ తర్వాత ఆర్యస మాజ్‌తో అనుబంధం నాలో చాలా మార్పు తెచ్చింది. కోస్గిలో ఉపాధ్యా యుడిగా పని చేస్తున్నప్పుడు ప్రముఖ కవి ప్రభులింగ శాస్ర్తితో సాన్నిహిత్యం నాలో కవిని మేల్కొలిపింది. 1997లో ‘అనాది చిత్రం’ కవితా సంకలనం వెలువరించాను. 2009లో ‘మహో త్థానం’ (ఖండ కవితలు) ముద్రితమయ్యింది. 2017లో ‘కృతి’ కవితలు, గేయాల సంకలనం వెలువడింది. సీతా రామమయం ముద్రణకు సిద్ధంగా ఉంది.

మహోత్థానం

అద్వైతం నాకు అవగతమయ్యాక మహాకవి శ్రీశ్రీ భావాలు పాక్షికంగా ఉన్నట్లు అనిపించింది.  శ్రీశ్రీపై నాకు చాలా గౌరవం ఉం ది. కానీ ఆయన భావన, భావం తప్పు అని నా అభిప్రాయం. ఆయన భావాన్ని పాక్షికంగా దర్శించారని అంటాను నేను. ‘మహాప్రస్థానం’ కవితలోని భావాలను ఖండిస్తూ నేను రాసిన కవిత్వంతో కూడినదే ‘మహోత్థానం’. ఆయన కావాలని ఆ మార్గాన్ని ఎన్ను కున్నారో ఏమో నేను చెప్పలేను. ఆయనను కలిసే అవకాశం వచ్చి ఉంటే బాగుండేదని నాకు ఇప్పటికీ అని పిస్తూ ఉంటుంది. ఆయన్ను కలిసి ఉంటే ఇలా ఎందుకు రాశారని అడగాల నిపిస్తూ ఉంటుంది. 

మా ఊరు
మా ఊరు కోస్గి. దాని అసలు పేరు కౌశిక. అది చారిత్రక గ్రామం. కాకతీయుల కన్నా ప్రాచీనమైనది. ఊరికి నాలుగు వైపులా కందకాలు, దర్వాజాలు ఉండేవి. వాటిల్లో తూర్పు దర్వాజా మాత్రం ఇప్పటికీ మిగిలిఉంది. కోట గోడలు కూడా శిథిలమైపోయి. నాటి చారిత్రక ఆనవాళ్లు ఊరినిండా శిథిలావస్థలో కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరాన గొప్ప శివాలయం ఉండేది. దాని గోపురం నీడ ఊరి పక్కనే పారే ఉప్పు సముద్రం చెరువులో కన్పించేదట. దాన్ని మేము కూడా చూడలేదు.