‘నీలి గోరింట’లోని కవితలన్నీ ఇంచుమించు స్త్రీ వాద కవితలే. ఇంటా బయటా నిరంతరం స్త్రీల శరీరాల మీద హింస జరుగుతూనే వుంది. ‘నీలి గోరింట’ అసలు ఈ దేహం ఎవరిది? అని ప్రశ్నిస్తుంది. అద్దె గర్భాల అమానవీయతను, అప్పులు తీర్చలేక భర్తలు మరణిస్తే తనువుల్ని తాకట్టుపెట్టి అప్పుల్ని తీర్చమనే బంధువులులతో కూడిన సమాజాన్ని ‘నీలి గోరింట’ ప్రతిఫలిస్తుంది.

మీ కవితా నేపథ్యం ఏమిటి? 

మాది విజయవాడ. నాన్న గారు మందరపు కాసులు గారు. చిన్నప్పటి నుంచి దగ్గర కూర్చోబెట్టుకొని పేపర్లు, పుస్తకాలు చదివించే వారు. మా నాన్నగారు కూడా పత్రికలకు లేఖలు రాసేవారు. విజయవాడలో సాహిత్య సభలు తరచు జరుగుతుండేవి. ఎప్పుడూ వెంటపెట్టుకొని తీసుకువెళ్లే వారు. అలాగ నాకు సాహిత్యం అంటే అభిరుచి కలిగింది. మా స్కూల్లో శ్రీ దేవరకొండ చిన్నికృష్ణశర్మ తెలుగు చెప్పేవారు. ఆ మాస్టారు కవి కూడా. క్లాసులో పాఠాలు బాగా చెప్పేవారు. మధురమైన కంఠంతో పద్యాలు చదివేవారు.అప్పుడు నేను కూడా పద్యాలు రాయాలని అనుకున్నాను. మా చుట్టాలింట్లో పెళ్ళిళ్లకు, పుట్టిన రోజులకు ఛందోబద్ధమైన పద్యాలు రాసే దాన్ని. ఆ తర్వాత క్రమక్రమంగా వచన కవిత్వంలోకి అడుగు పెట్టాను. కవిత్వం రాసే కొత్తలో కనిపించిన ప్రతిదాని మీదా కవిత్వం రాసేదాన్ని. అలా మొదట రాసిన కవితలతో ‘సూర్యుడు తప్పిపోయాడు’ కవితా సంపుటి ప్రచురించాను. పెరిగి పెద్దయేకొద్దీ సమాజంలోని అసమానతలు, పితృస్వామ్య ధోరణి, స్త్రీలపట్ల వివక్ష నన్ను కలవరపరిచాయి.

ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం, తాగొచ్చి అకారణంగా కొట్టడం, తిట్టడం, మగపిల్లల్ని ఒక రకంగానూ ఆడ పిల్లలను ఒక రకంగానూ పెంచడం చూసి మనసులో రగిలేభావాలను అక్షరాల అగ్నిజ్వాలలుగా వెలిగించాను. ప్రేమతో అల్లుకోవాల్సిన వివాహ బంధం ఆర్థిక బంధంగా మారి కరెన్సీకాటు ఎలా వేస్తుందో ‘సర్పపరిష్వంగం’లో చెప్పాను. అప్పుడు ఆంధ్ర జ్యోతి వారపత్రికలో ‘ఈ వారం కవిత’ వేసేవారు. ఆ పేజీలో ఒకటే కవిత, కవిత్వానికి తగిన బొమ్మ ఉండేవి. ‘ఈ వారం కవిత’లో కవిత వచ్చిందంటే కవులకు కొండెక్కినంత సంబరం. ప్రతిష్టాత్మకం. ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘చేరాతలు’ వచ్చేవి. ప్రతి వారం వీక్లీలో ఎవరి కవిత వచ్చింది అని, చేరాతల్లో ఏ కవిత గురించి రాసారు అని కవులకు కుతూ హలంగా వుండేది. ఒక సారి జ్యోతిలో ‘ఈ వారం కవిత’గా నా ‘సర్పపరిష్వంగం’ కవిత వచ్చింది. తర్వాత ఆ కవిత గురించి చేరాతల్లో వచ్చింది. అప్పటి నుంచి నాకు స్త్రీ వాద కవయిత్రిగా గుర్తింపు వచ్చింది.కడుపులో వున్నది ఆడ పిల్ల అని తెలిస్తే ఆ పిం డాన్ని అక్కడికక్కడే హత మార్చడం మీద నిషిద్ధాక్షరి, అందాల పోటీల మీద ‘సంతకాలు చేద్దాం రండి’ కవిత రాసాను. ఇంకా మరిన్ని కవితలతో నిషిద్ధాక్షరి ప్రచురించాను. నిషిద్థాక్షరి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘నీలి గోరింట’ వచ్చింది.

ఈ తర్వాతి సంపుటికి ‘నీలి గోరింట’ అని పేరు పెట్టాలని ఎందు కనిపించింది? ఈ కవితా సంపుటిలోని కవితా వస్తువేమిటి?