రామ నామం.. కరకు వేటగాడిని ఆదికవి వాల్మీకిగా మార్చింది. 
రామ గానం.. కుమ్మరి మొల్లను కవితలల్లే కవయిత్రిగా అనుగ్రహించింది. 
తారక మంత్రం.. గోపన్నను రామదాసుగా తీర్చిదిద్దింది. 
రామకథ మధురాతిమధురం. అందుకే రామచరితను వాల్మీకి మొదలు ఎందరెందరో రాసి తరించారు. యుగాలు దాటినా.. ఆ యుగపురుషుడి గాథను నేటికీ కవితగా, కావ్యంగా, వచనంగా, ప్రవచనంగా రసరమ్యంగా అందిస్తూనే ఉన్నారు. అలాంటి కవి శాఖకే చెందుతారు జయలక్ష్మమ్మ. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన తెలుగుతేజం ఆమె. తెలుగులో ఓనమాలు కూడా నేర్వని ఈ నిరక్షరాస్యురాలు.. రామాయణాన్ని రమణీయంగా ఆవిష్కరించారు. లుప్తమైపోయిందనుకున్న 18వ శతాబ్దం నాటి ‘సాకమ్మ రామాయణం’ యక్షగానాన్ని ఆపోశన పట్టి.. 
‘రామకథామృత’ధారను కురిపించారు. రామాజ్ఞగా రామకథా రచనను సాగించిన 93 ఏళ్ల జయలక్ష్మమ్మ జీవితం..


 చాలా రోజుల వరకు నాకు తెలుగులో అక్షరం ముక్క రాదు. తెలుగువారమే అయినా.. తమిళనాడులో ఉంటుంది మా కుటుంబం. ఇంట్లో తెలుగులోనే మాట్లాడేవాళ్లం. నా చదువు తమిళ మాధ్యమంలోనే సాగింది. అది కూడా మూడో తరగతి వరకే. వైదిక కుటుంబం అవ్వడం చేత ఇంట్లో పద్యాలు, శ్లోకాలు, కీర్తనలు బాగానే సాగేవి. నాలో భక్తిభావం మొగ్గతొడగడానికి అవే ప్రేరణ. ‘భక్త విజయం’ పుస్తకం (తమిళం)లో భక్తుల గాథలు-శ్రీమన్నారాయణుని లీలలు నన్నెంతో ప్రభావితం చేశాయి. దీనికి తోడు ప్రతి శనివారం మా ఇంట్లో శ్రీరామునికి ప్రత్యేక పూజలు జరుగుతుండేవి. అలా చిన్నతనంలోనే రామునిపై అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. 

వేంకటేశుని అనుగ్రహం.. 
1923 సెప్టెంబరు 1న ధర్మపురి జిల్లా పాప్పారపట్టి గ్రామంలో జన్మించాను. వేంకటరమణయ్య, లక్ష్మి నా తల్లితండ్రులు. పన్నెండేళ్ల వయసులో మారేగౌనపల్లికి చెందిన వేంకటరామయ్యగారితో నా వివాహమైంది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేసేవారు. చిన్న వయసు.. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు నన్నెంతో కుంగదీశాయి. ఆరోగ్యం దెబ్బతింది. వారంలో రెండ్రోజులు బాగుంటే.. ఐదు రోజులు సుస్తీ చేసేది. ఇన్ని సమస్యల్లోనూ ఒక అదృష్టం ఏంటంటే ‘సాకమ్మ రామాయణం’ అనే ప్రసిద్ధ తెలుగు యక్షగానం నేర్చుకునే అవకాశం దొరకడం. అప్పట్లో సాకమ్మ రామాయణాన్ని సీ్త్ర బృందాలు పాడుకునేవి. ఈ యక్షగాన రామాయణంలో పాటలు, పద్యాలు, కీర్తనలు, వచనాలు ఉండేవి. రామకథ వింటూ, పాడుతూ బాధలన్నీ మరచిపోయేదాన్ని. 1962 మే నెలలో అష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో డెంకణికోటలో ఉన్న శ్రీ బేట వేంకటేశ్వర ఆలయంలో ఓ యాగం నిర్వహించారు. దానికి నేనూ హాజరయ్యాను. మరుసటి రోజు శివరాత్రి. ఆనాడు అనూహ్యమైన అనుభూతి కలిగింది. బేట వేంకటేశ్వరునిపై కీర్తనలు అల్లినట్లుగా అనిపించింది. ఇదే విషయాన్ని మావారికి చెప్పాను. కీర్తనలు రాయమంటూ వెన్నుతట్టి ప్రోత్సాహించారాయన. ‘మేలికొలుపు’ నా మొదటి తెలుగు కీర్తన. తెలుగు మాట్లాడడమే తప్ప రాయడం రాదు కాబట్టి తమిళలిపిలో రాశాను. అలా ఓ వంద కీర్తనల దాకా రాశాను. వాటిని చూసినవారంతా ‘అద్భుతంగా రాశావం’టూ ప్రశంసించారు. 

నలభయ్యేళ్లకు అక్షరాభ్యాసం 

కీర్తనలు రాస్తున్న నాకు పద్యాలు రాయాలనే కోరిక కలిగింది. పద్యాలంటే ఛందస్సు తెలిసుండాలి. యతి, ప్రాసలపై పట్టుండాలి. తెలుగు అక్షరాలు రాయడమే తెలియదు.... పద్యాలెలా రాయగలను! ఇవేవీ పట్టించుకోలేదు. ఇంట్లో పిల్లలు వేమన, సుమతి, భాస్కర శతకాలు చదవగా వినేదాన్ని! పద్యాలూ అలాగే రాయాలని భావించి.. ఆటవెలదిలో కొన్ని పద్యాలు రాశాను. వాటిని మావారు తన సహోద్యోగులైన తెలుగు పండితులకు చూపించారు. ‘పద్యాల్లో భావం బాగుంది కానీ, వ్యాకరణ దోషాలు సవరించాల’ని చెప్పారట వాళ్లు. ఎలాగైనా తెలుగు భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. అలా 40వ ఏట తెలుగు ఓనమాలు దిద్దడం మొదలుపెట్టాను. నా భర్త, అత్తగారు నాతో తెలుగు అక్షరాభ్యాసం చేయించారు. అప్పటికే నాకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. పదాల వరకు నేర్చుకున్న తర్వాత నా రెండో కుమార్తె రమామణి నా గురువైంది. తర్వాత ఛందస్సులో పట్టు సాధించాను. గతంలో నేను రాసిన పద్యాల్లోని వ్యాకరణ దోషాలను పరిహరించి.. వాటిని మరింత అందంగా తీర్చిదిద్దాను. మొదట్లో తేటగీతి, ఆటవెలది, కందం, సీస పద్యాలు రాసేదాన్ని. భాషాజ్ఞానం పెరిగే కొద్దీ అన్ని వృత్తాల్లోనూ (ఛందస్సు) పద్యాలు రాయడం మొదలుపెట్టాను. 

శక్తి కూడదీసుకుని..

కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే.. రచనా వ్యాసంగం కొనసాగించాను. నా ఉత్సాహాన్ని గమనించిన మావారు ఒకరోజు రామాయణం రాయాలని కోరారు. రామాయణం నేను రాయడమా అనుకుంటూనే.. భగవంతునిపై భారం వేసి 2007లో ‘రామాయణం’ రాయడం మొదలుపెట్టాను. అప్పటికే వృద్ధాప్యంతో శరీరం బలహీనమైపోయింది. అనారోగ్యంతో కొన్నాళ్లు మంచానికే పరిమితమయ్యా. శక్తి కూడదీసుకుని ‘శ్రీరామ పట్టాభిషేకం’ వరకు రాయగలిగా. నా కుమార్తె రమామణి సహకారంతో మిగిలిన కావ్యాన్ని పూర్తిచేశా. 1,500 పద్యాలతో ‘శ్రీరామ కథామృతం’ పూర్తయింది. ప్రాచీన కాలం నాటి ‘సాకమ్మ రామాయణం’ విన్నందుకు సార్థకత కలిగింది. 

ఇదే ఆధారం.. 

నేను కంఠస్తం చేసిన రామాయణం ‘సాకమ్మ రామాయణం’ అనడానికి అనేక రుజువులు ఉన్నాయి. ఆ రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, సుందరకాండ ముగింపులో సాకమ్మ తన గురించి ప్రస్తావించుకున్నారు. ‘శ్రీరామ పట్టాభిషేకం’ చివరలో సాకమ్మ తన వంశం గురించి, కుటుంబం గురించి వివరంగా పేర్కొన్నారు. 

తమిళలిపి.. తెలుగు కాపీ 

ఈ ‘సాకమ్మ రామాయణం’ నాకు కంఠతః వచ్చు. వివాహానికి ముందు మా అమ్మమ్మ సుబ్బాలమ్మ దగ్గర కొంత భాగం నేర్చుకున్నాను. మా ఆయన అమ్మమ్మ అమ్మాళమ్మ దగ్గర మరికొంత నేర్చుకున్నా. ప్రతి రోజూ నేను నేర్చుకున్న రామాయణాన్ని ఆలపిస్తూ ఉండేదాన్ని. అలా మొత్తం రామాయణం నోటికి వచ్చేసింది. దానిని గతంలోనే తమిళలిపిలో రాసుకున్నా. తెలుగు నేర్చుకున్న తర్వాత తెలుగులో రాశాను. ప్రస్తుతం చేతిరాత ప్రతి మాత్రమే ఉంది. పద్యాలు, పాటలు, కీర్తనలు, ద్విపదలు, వచనాలతో నిండి ఉన్న అద్భుతమైన కావ్యమిది. ఒకప్పుడు జన బాహుళ్యంలో విస్తృత ప్రచారంలో ఉన్న ఈ యక్షగాన కావ్యాన్ని ఇప్పుడు పాడేవారు లేరు. ప్రభుత్వం, సాహితీ సంస్థలు ముందుకొచ్చి దీనిని పుస్తక రూపంలో తీసుకురావాలని కోరుతున్నా. అలా చేయడం వల్ల లుప్తమైపోతున్న కమనీయమైన రామకావ్యాన్ని భావి తరాలకు అందించినవారం అవుతాం. 
డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై 


ఎన్నో రచనలు 
జయలక్ష్మమ్మ తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ పలు రచనలు చేశారు. ఇందులో రెండు ముద్రితం. మరికొన్ని టైపింగ్‌ దశలో ఉన్నాయి. ఆధ్యాత్మిక రచనలే కాదు, సమాజంలోని లోపాలను ఎత్తిచూపుతూ కూడా రచనలు చేశారామె. 13 శతమణిమాల కీర్తనలు, 27 కావ్యరూప రచనలు, 7 శతకాలు, 10 అక్షరమాలలు, సహస్రమణిమాల స్తోత్రము, నామావళి స్తోత్రాలు, తమిళంలో తొమ్మిది రచనలు, కన్నడలో కీర్తనలు రాశారు. 


ఆరుద్ర ఏం చెప్పారంటే? 
ఆరుద్ర రాసిన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ గ్రంథంలో సాకమ్మ రామాయణ ప్రస్తావన ఉంది. 18వ శతాబ్దానికి చెందిన ‘సాకమ్మ రామాయణం’లోని బాలకాండను.. 1912లో అన్నదానం రామలక్ష్మమ్మ ముద్రించినట్లు పేర్కొన్నారు ఆరుద్ర. మిగిలిన రామాయణం గురించి ఆయన ప్రస్తావించలేదు. అందువల్ల అది అలభ్యమని సాహితీలోకం భావిస్తోంది. ‘సాకమ్మ రామాయణం’తో పాటు సాకమ్మ లిఖించిన ‘ముక్తికాంతా కల్యాణం’ గ్రంథం కూడా జయలక్ష్మమ్మ దగ్గర తెలుగు, తమిళ లిపిలో రాతప్రతి ఉంది. జయలక్ష్మమ్మతో మాట్లాడాలనుకునేవారు 
092831 12057 ఫోన్‌ నెంబరులో సంప్రదించవచ్చు.