ఆ పుస్తకాలే రచయిత్రిని చేశాయి

సోషల్‌మీడియాలో మెరుపులా ఉరిమిన ఒక కొత్త స్వరం.. మెర్సీ మార్గరెట్‌. జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, అనుభవాలనే కవితా వస్తువులుగా చేసుకుని.. కవిత్వం రాస్తున్నారు. ఆమె వెలువరించిన ‘మాటల మడుగు’ కవితా సంపుటానికి 2016 సంవత్సరానికి గాను కేంద్రసాహిత్య అకాడమీ ‘యువ పురస్కారం’ లభించింది. ఈ సందర్భంగా మెర్సీ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు..

 
‘‘మేము క్రిస్టియన్స్‌. బొట్టు పెట్టుకోము. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో మాకు అద్దెకు ఇల్లు దొరకలేదు. చాలా బాధ కలిగింది. లక్ష్మింపేట సంఘటన జరిగినప్పుడు తీవ్రంగా ఆలోచించాను. నేను ఎదుర్కొన్న సంఘటనలతో పాటు కొన్ని సామాజిక సంఘటనలూ కులం మూలాల వైపు నడిపించాయి. ఆ తరువాత స్త్రీవాదం, దళితవాదం, కమ్యూనిజం కోణాల నుంచి ఆలోచించడం మొదలైంది. ఆ దృక్పథాల ప్రభావం నా కవిత్వంలో ప్రతిఫలించింది.
 
‘‘కవిత్వం ఆత్మభాష అంటారు కదా! అది నాకు తెలియకుండానే అలవడింది. ఆ కవిత్వం ఈ రోజున ఇంత గుర్తింపు తెస్తుందని అనుకోలేదు. నేను మొదట్లో కథారచనతోనే సాహిత్య వ్యాసంగాన్ని మొదలుపెట్టాను. అప్పటికైతే రచన గురించి ఏమీ తెలియదు. తొలి కథ రాసే సమయంలో.. స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకొక అత్యాచారం వార్తలు వచ్చేవి. తాగునీటిని సీసాల్లో పోసి అమ్ముకునే ధోరణి అప్పుడే మొదలైంది. ఇలాంటి దేశ పరిస్థితులను చూసేందుకు గాంధీ, నెహ్రూలు మళ్లీ పుట్టుకొస్తే ఎలా ఉంటుంది? అన్న ఇతివృత్తంతో కథ రాశాను. ఆ కథను ఒక పత్రికకు పంపించాను. కానీ, అచ్చుకాలేదు. అప్పటికైతే కథలు ఎలా రాయాలో తెలిసేది కాదు. మా ఇంట్లోనూ సాహిత్య వాతావరణం ఉండేది కాదు. నాన్న బ్యాంకులో చిన్న ఉద్యోగి. అమ్మ ఇంటి పట్టునే ఉండేది. ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువు సాగించాను. పుస్తకాలు కొని చదివే పరిస్థితి ఎక్కడిది? సరిగ్గా అప్పుడొక సంఘటన జరిగింది.
 
ఆలోచన కలిగింది అప్పుడే..
ఉమ్మడి రాష్ట్రంలో వ్యాసరచన పోటీలు పెట్టింది ‘విశాలాంధ్ర’. నేనొక వ్యాసం రాశాను. దానికి ద్వితీయ బహుమతి వచ్చింది. అందుకుగాను ఆ సంస్థ మూడువేల రూపాయలు విలువ చేసే పుస్తకాల బండిల్‌ను కానుకగా అందించింది. అందులో శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’, సినారె ‘విశ్వంభర’ పుస్తకాలు ఉన్నాయి. ఇంటికి వస్తూనే ఆ పుస్తకాలను చదవడం మొదలుపెట్టాను. ‘అమృతం కురిసిన రాత్రి’లో పోస్ట్‌మాన్‌ కవిత నన్ను ప్రభావితం చేసింది. కవిత్వాన్ని ఇంత సులభంగా రాయొచ్చా? అనిపించింది. ‘నేను కూడా రాయొచ్చ’న్న ఆలోచన కలిగింది. ఇక, ‘విశ్వంభర’ మొదటి పేజీలు బైబిల్‌ వాక్యాలతోనే మొదలవుతాయి. నేను స్వతహా క్రిస్టియన్‌ని కావడం వల్ల.. ఆ వాక్యాలు ఆకట్టుకున్నాయి. కవిత్వానికి ఎంతగా కనెక్ట్‌ అయ్యానో చెప్పలేను. కానుకగా ఇచ్చిన ఆ పుస్తకాలు నన్నో రచయిత్రిని చేస్తాయనుకోలేదు!
 
తొలి కవిత ‘ఆంధ్రజ్యోతి’లోనే వచ్చింది..
మన ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి అద్భుతమైన మాధ్యమం సోషల్‌ మీడియా. 2009లో ఫేస్‌బుక్‌లో ఖాతా ప్రారంభించాను. తొలిరోజుల్లో ‘మనసు పలికే మౌన రాగం’ పేరుతో పేజీని ఓపెన్‌ చేశాను. అందులో నాకు తోచిన అభిప్రాయాలు, కవితలను పోస్టు చేసేదాన్ని. ఎవరు ఎలా ప్రతిస్పందిస్తారోనన్న భయం ఉండేది. ఆ తరువాత ‘కవిసంగమం’లో చేరాక.. ఎంతోమంది రచయితలతో పరిచయ భాగ్యం కలిగింది. ఎలాంటి కవితా వస్తువులను ఎంపిక చేసుకోవాలి? రచనా శైలి ఎలా ఉండాలి, ఏం చదవాలి అన్న విషయాలు తెలిశాయి. కవులతో చర్చలు ఎంతో ఉపకరించాయి. అప్పటి నుండి ఫేస్‌బుక్‌లో తరచూ కవితల్ని పోస్టు చేయడం అలవాటుగా మారింది. కొన్ని కవితలకైతే బోలెడన్ని కామెంట్లు వచ్చేవి. అభినందనలతో పాటు అభిప్రాయభేదాలూ ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎఫ్‌బీలో రాస్తూ రాస్తూ పోతుంటే - ‘ఫేస్‌బుక్‌లో ఎన్ని రోజులు రాసినా రైటర్‌వి కాలేవు, నీ కవితలు ఏ ప్రధాన పత్రికల్లోనో అచ్చవ్వాలి. అప్పుడే రైటర్‌ అనిపించుకుంటావు’ అన్న మాటలు వినిపించాయి. ఆ మాటల వల్ల పత్రికల వైపు దృష్టి మరల్చాను. అప్పుడు రాసిన కవిత ‘ప్రశ్నల గది’. ఆ కవిత 2012లో ఆంధ్రజ్యోతి ‘వివిధ’లో ప్రచురితం అయ్యింది. అదే నా తొలి ముద్రిత కవిత. మాటల్లో చెప్పలేని ఆనందం అది. అప్పటి నుంచి పత్రికలకు కవితలూ రాస్తూ వస్తున్నాను. ఈ క్రమంలోనే ‘మాటల మడుగు’ పేరిట పుస్తకరూపంలో కవితా సంపుటిని తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడమీ ‘యువ పురస్కారం’ వచ్చింది.
 
కొత్తతరానికి ‘సోషల్‌ మీడియా’ వేదిక!
ప్రతి పత్రికకూ కొన్ని పరిమితులు ఉంటాయి. కాదనలేం. మనం రాసినవన్నీ ప్రచురితం కావు. అందుకనే నేను ఫేస్‌బుక్‌ ఎంచుకున్నాను. ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. ఎవరికీ ఏ అభ్యంతరాలూ ఉండవు. ముఖ్యంగా నాలాంటి కొత్తతరం యువతీ యువకులు చాలామందే ఫేస్‌బుక్‌ పుణ్యమాని రచయితలు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టినప్పుడు - ఒక కవితను రాసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాను. కొందరన్నారు ‘మెర్సీ! నువ్వు ఇదివరకు రాసిన కవితలు అంత సులభంగా అర్థం అయ్యేవి కావు. నోట్ల రద్దు మీద రాసిన కవితలు చాలా బాగా అర్థం అయ్యాయి. ఇలాంటి సులభశైలిలో రాస్తే ఎక్కువ మంది చదువుతారు కదా!’ అంటూ కామెంట్లు పెట్టారు. కవిత్వ భాష మార్మికమైనది, ప్రతీకాత్మకమైనది. తరచూ కవిత్వం చదివే వాళ్లకు ఆ కవితలు అర్థం అవుతాయి. సామాన్యులు కష్టపడాల్సి వస్తుంది. ఫేస్‌బుక్‌లో నెటిజన్ల అభిప్రాయం నా రచనా శైలిని కొంత వరకు మార్చింది. అందుకని వీలైనంత సులభంగానే రాయడానికి ప్రయత్నిస్తున్నా..’’ అంటున్న మెర్సీ కవిత్వానికి ఆలంబన.. మానవీయస్పందన! సామాజిక ఆక్రందన!! అందుకే ఆమె ఒక కవితలో
‘‘అవును,
ఒకప్పుడు నోటి నిండా మాటలు వుండేవి..
మాటలకు రుచి ఉండేది..
మసక కన్నుల్ని వెలిగించే నిప్పురవ్వలుండేవి..
చెమట చుక్కల్ని కౌగిలించుకునే చేతులుండేవి..
కడుపు నింపే ధాన్యపు గింజల్లా వుండేవి..’’ అంటూ రెండు తరాలకు వారధిలా కనిపిస్తారు.
- మల్లెంపూటి ఆదినారాయణ