మహాప్రస్థానం

బలరామకృష్ణుల నిర్యాణం, వ్యాసుని సదుపదేశం విన్న తర్వాత ధర్మరాజుకి సర్వస్వాన్నీ త్యజించాలనిపించింది. మహాప్రస్థానం ప్రారంభించాలనే సంకల్పం కలిగింది. కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు ధర్మరాజు. తర్వాత కళ్ళు తెరిచి, ఎదురుగా ఉన్న అర్జునునితో ఇలా అన్నాడు.‘‘ప్రాణులన్నిటికీ కాలమే పరిణతి కలిగిస్తోంది. నాకూ ఆ కాలమే ఇప్పుడు పరిణతి కలిగించినట్టుగా ఉంది. సర్వకర్మ పరిత్యాగం తప్ప మరో ఆలోచన కలగడం లేదిప్పడు.’’ఆశ్చర్యంగా చూశాడు అర్జునుడు.‘‘వ్యాసమహర్షి చెప్పింది ఆచరించడమే తక్షణ కర్తవ్యంగా ఉంది. నీ ఉద్దేశమేమిటి?’’ అడిగాడు ధర్మరాజు.‘‘నీ మాటే నా మాట.’’ అన్నాడు అర్జునుడు. ఆ సమాధానికి ఆనందించి, భీమ,నకుల సహదేవుల్ని పిలిపించాడు ధర్మరాజు. తానూ, అర్జునుడూ తీసుకున్న నిర్ణయం తెలియజేశాడు వారికి.‘‘మీ అభిప్రాయం తెలియజేయండి.’’ అడిగాడు.‘‘నీ మాటని కాదన్నదెన్నడు? నువ్వెలా అంటే అలాగే.’’ అన్నారంతా. తమ్ముల మాటకు ఎంతగానో సంతోషించాడు ధర్మరాజు. యుయుత్సుని రప్పించాడు. మహాప్రస్థానం విషయం ఆతనికి తెలియజేశాడు. రాజ్యతంత్ర వ్యవహారాలను వివరించాడు. రాజగృహ మర్యాదలూ తీరు తెన్నులూ బోధించాడు. అతని పెద్దరికంలో పరీక్షిన్నరేంద్రునికి సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. ప్రజాపాలన ఎలా చేయాలన్నదీ సంపూర్ణంగా వివరించాడతనికి. సుభద్రాదేవిని ఆహ్వానించి ఆమెతో ఇలా అన్నాడు.‘‘సాధ్వీమణీ! నీ మనుమడు పరీక్షిన్నరేంద్రుడు భారత సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. వజ్రుడు ఇంద్ర ప్రస్థాన్ని పాలిస్తున్నాడు. నువ్వు ఈ ఇద్దరినీ, ఈ రెండు రాజ్యాలనీ సంరక్షించుకో!’’అలాగేనన్నట్టుగా సన్నగా తలూపింది సుభద్ర. కావాల్సింది అదే! మహాప్రస్థానానికి ఆమె అర్జునుని అనుసరిస్తుందేమోనని ఆందోళనగా ఉంది ధర్మరాజుకి. ఎప్పుడయితే రాజ్యాలనీ, రాజుల్నీ సంరక్షించుకునేందుకు అంగీకార సూచకంగా సుభద్ర తలూపిందో అప్పుడు ధర్మరాజు ఆందోళన అంతమయింది.

సంతోషమనిపించిందతనికి. భారతయుద్ధంలోనేగాక, ద్వారకలో మరణించిన వారందరికీ పరలోక సౌఖ్య సంపత్తి కలగాలని ఆశిస్తూ అసంఖ్యాకంగా గోవులనూ, భూములనూ, బంగారాన్నీ దానం చేశాడు ధర్మరాజు. కృపాచార్యునికి పరీక్షిన్నరేంద్రుని శిష్యునిగా అప్పగించాడు. తర్వాత పౌర జానపద ప్రముఖులందరినీ రప్పించి, వారితో ఇలా అన్నాడతను.‘‘మహాజనులారా! పాండవులం మేము అయిదుగురం మహాప్రస్థానానికి సిద్ధమాయ్యాం. మీరు అనుమతించగలరని ఆశిస్తున్నాం.’’ప్రముఖులంతా దిగ్భ్రమ చెందారు. కళ్ళు చెమర్చాయి అందరికీ.‘‘మహారాజా! తరతరాలుగా మిమ్మల్ని ఆశ్రయించుకుని మేము బతుకుతున్నాం. మమ్మల్ని వదలి వెళ్ళడం మీకు న్యాయమా?’’ అడిగారు. ధర్మరాజు తగిన సమాధానం ఇచ్చాడు వారికి. ఓదార్చాడు. శాంతించారంతా. పాండవుల మహాప్రస్థానానికి అంగీకరించారు. ప్రస్థాన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అంతలోనే హస్తినాపుర వాసుల్లో విపరీత లోభం ప్రజ్వరిల్లింది. ఇళ్ళ విషయాల్లో ‘ఇది నాదంటే నాది’ అంటూ గొడవలేర్పడ్డాయి. ఉమ్మిడి కుటుంబంగా ఉండే అన్నదమ్ములు విడిపోసాగారు. సహదేవుడు అది గమనించి ఆశ్చర్యపోయాడు. రాజ్యంలో ఎన్నడూ ఇలాంటి గొడవలు లేవు. ఇప్పుడు ప్రవేశించాయి. అంటే కలియుగం ప్రవేశించినట్టేనని నవ్వుకున్నాడు. ఆ సంగతి ధర్మరాజాదులందరికీ చెప్పాడతను. పగలబడి నవ్వుకున్నారంతా.‘‘ఇక ఈ జీవితాలు చాలు, పదండి.’’ అన్నాడు ధర్మరాజు. అన్న మాటకు ఎదురు చెప్పలేదెవరూ. సమస్త ఆభరణాలూ పరిత్యజించి, నార చీరలు ధరించారు. అగ్నిహోత్రాల్ని నీటిలో ప్రక్షేపించారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ద్రౌపదీదేవి సహా రాజభవనం దాటారు. పాండవులు అయిదుగురూ, ఆరవదిగా ద్రౌపదీదేవి, వారిని అనుసరిస్తూ ఏడవదిగా ఓ శునకం ముందుకు నడిచారు. వారిని చూసేందుకు పుర జనులంతా ఇంటి గుమ్మాల ముందు నిలిచారు. పాండవుల మహాప్రస్థానం, ఒకనాటి వారి అరణ్యవాసాన్ని గుర్తు చేసింది.

యుయుత్సుడు,పరీక్షిన్మహారాజు, అంతఃపుర కాంతలు కొంతమంది పాండవులను అనుసరించారు. బాధగా కన్నీరు పెట్టుకున్నారు. పాండవులు హస్తినాపుర సింహద్వారం దాటారు. వారిని అనుసరిస్తున్నవారు కూడా సింహద్వారం దాటి ముందుకు వచ్చారు. ధర్మరాజు గమనించాడు వారిని. ‘ఆగిపోండి’ అని హెచ్చరించలేదు. తల వంచుకుని స్థిర చిత్తంతో ముందుకు నడుస్తున్నాడు. ధర్మరాజు అలా మౌనంగా ఉండడాన్ని గమనించి, ఇక సెలవు తీసుకోవడం మంచిదనుకున్నారు అనుసరిస్తున్న జనం. పాండవులందరికీ ప్రదక్షిణ నమస్కారాలు చేసి, వెను తిరిగారంతా. పరీక్షిన్మహారాజు, యుయుత్సుడు కూడా వెను తిరిగి హస్తినాపురికి చేరుకున్నారు. ఉలూచి నాగలోకానికి వెళ్ళిపోయింది. చిత్రాంగద కుమారుడు భభ్రువాహనుణ్ణి చేరుకుంది.