సొంత బావే ఆమెకు కాబోయే భర్త. ఆ విషయం చిన్నప్పుడే ఫిక్స్‌ అయిపోయింది. ఆమెకీ అభ్యంతరం లేదు. కానీ జలపాతంలా ఆమె జీవితంలోకి ప్రవేశించాడు కిరణ్‌. అతని మాటలు ఆమెను కట్టిపడేస్తాయి. సమ్మోహనంగా ఉంటాయి. అతని స్పర్శ ఎంతో బాగుంటుంది ఆమెకి. కోరికలతో రగిలిపోతున్నారు ఆ ఇద్దరూ. ఎప్పుడు అవకాశం వచ్చినా ఏకాంతంగా ఒకచోట చేరుతున్నారు. కానీ అంతలో ఏం జరిగిందంటే....!

‘అస్సలు పోలికేలేదు. కిరణ్‌ ఎక్కడ బావ ఆనంద్‌ ఎక్కడ. కిరణ్‌ ఓ జలపాతం, బావ ఓ సెలయేరు. కిరణ్‌ మాటవిన్నా, మనిషి కనపడినా మనసు ఉప్పొంగుతుంది. అదే బావ ఎదురుగా ఉండి మాట్లాడినా ఉత్సాహం చల్లారుతుందేతప్ప ఉద్వేగం కలగదు’ ఇవీ స్వాతి ఆలోచనలు.బావ ఆనంద్‌తో చిన్నతనం నుంచీ కలిసిమెలిసి ఒకేచోట పెరిగింది. అతని మంచితనం, నెమ్మది తెలుసు. అతని విషయంలో తన తల్లిదండ్రులకి ఉన్న అభిప్రాయమూ తెలుసు. పుట్టినప్పటినుంచీ తామిద్దరూ భార్యాభర్తలనే తమ పెద్దల అభిప్రాయం. తనకీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ కిరణ్‌ పరిచయం అయినదగ్గరనుంచీ తన ఉద్దేశం మారిపోయింది.స్వాతికి కిరణ్‌ పరిచయమే చిత్రంగా జరిగింది.

ఒకరోజు పొద్దున్నే ఫోన్‌ చేశాడు కిరణ్‌. అదే మొదటి ఫోన్‌కాల్‌.‘నా పేరు కిరణ్‌. నేను ఇంజనీరింగ్‌ పూర్తిచేశాను. బాగానే అందంగానే ఉంటానని అందరూ అంటుంటారు. మీరు నన్ను తప్పుగా భావించకపోతే ఒక్కమాట. మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని తొలిసారి చూసినదగ్గర్నించీ నాకు మీ స్మరణే. అలా అని నావల్ల మీకు కష్టం కలుగుతుందని అనుకోవద్దు. నా వల్ల మీకు ఆనందం సంతోషమే ఉండాలి. ఉంటుందని హామీ ఇస్తున్నాను. మీకు సమ్మతం కాకపోతే మరోసారి మీకు ఫోన్‌ కూడా చెయ్యను’ అంటూ అదే పద్ధతిలో చాలాచాలా మాట్లాడాడు.స్వాతి అప్పుడే చెప్పింది. తనకి ఆనంద్‌ అనే బావ ఉన్నాడనీ, తనను అతనికే ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటున్నారనీ అందువల్ల తన మీద ఆశలేమీ పెట్టుకోవద్దని.కానీ కిరణ్‌ స్వాతిని వదల్లేదు. ‘మీరు ఏమైనా చెయ్యండి. మీకు అడ్డురాను. కానీ మీ మీద ఆరాధన చావదు. నా దారిన నేను మీకు కష్టం కలగకుండా ఆరాధిస్తూనే ఉంటాను’ అంటూ ఓ గమ్మత్తైన పద్ధతి అవలంభించాడు.