రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి):: కార్టూనిస్టులకు సమాజంపై అవగాహన తప్పనిసరి అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌హాల్‌లో జయశంకర్‌ రాజకీయ, సాంస్కృతిక అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శేఖర్‌ టూనిజం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లం నారాయణ మాట్లాడుతూ అద్భుతమైన కార్టూన్‌లతో శేఖర్‌ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యలను కార్టూన్‌ రూపంలో అందించేవాడని అన్నారు. సీఎం ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ పరిణామాల్లోంచి జర్నలిస్టులు, కార్టూనిస్టులు పుట్టుకొచ్చారన్నారు. గతంలో తెలంగాణ కార్టూనిస్టులకు తగిన స్థానం ఉండేది కాదని అన్నారు. శేఖర్‌ అద్భుతమైన కార్టూనిస్టు అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయా పరిషత్‌ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, మామిడి హరికృష్ణ, కార్టూనిస్టులు శంకర్‌, నర్సిం, మృత్యుంజయలతో పాటు నటుడు తాగుబోతు రమేష్‌ తదితరులు పాల్గొని శేఖర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు.