రవీంద్రభారతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఈ కాలం సీరియళ్లు మహిళలను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాయని సీరియళ్లకు కూడా సెన్సార్‌ బోర్డు అవసరముందని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఎస్‌.వేణుగోపాలాచారి అన్నారు. బుధవారం రవీంద్రభారతిలో అరుణోదయ ఆర్ట్‌ క్రియేషన్స్‌ 10వ వార్షికోత్సవ టీవీ అవార్డులను ప్రదానం చేశారు. నిర్మాత లయన్‌ విజయ్‌కుమార్‌ను దాన గుణశీల బిరుదుతో, నటీనటులు ప్రీతినిగమ్‌, అడబాలను అరుణోదయ జీవన సాఫల్య పురస్కారాలతో సన్మానించారు. కళాపత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫీ సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి అవార్డుగ్రహీతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రావు, రచయిత డాక్టర్‌ ప్రభాకర్‌జైని, డాక్టర్‌ పాండు రంగారావు, మహేష్‌ అగర్వాల్‌, ఎంఏ రహీమ్‌, శ్రీరామ్‌దత్త, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షుడు షరీఫ్‌ మహ్మద్‌, రచయిత యడవల్లి రాంబాబు పాల్గొన్నారు.

ఉత్తమ నటీనటులు సుహాసిని(నా కోడలు బంగారం), నిరుపమ్‌ (కార్తీకదీపం), విలన్‌గా రాధాకృష్ణ(సావిత్రి), సహాయ నటులు శ్రావణి(స్వాతి చినుకులు), జీడిగుంట శీధర్‌(భార్య), హాస్యనటులు రోహిణి(కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా), కోటేశ్వరరావు(ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌), సంగీత దర్శకుడు మల్లిక్‌ (మనసు మమత), దర్శకుడు కాపుగంటి రాజేంద్ర(కార్తీక దీపం), ఉత్తమ సీరియల్‌- అక్క మొగుడు (సంఘం భిక్షమయ్య) అవార్డులను స్వీకరించారు.