రవీంద్రభారతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ప్రతిభకు గుర్తింపుగా వచ్చే పురస్కారాలు మన బాధ్యతను మరింతగా పెంచుతాయని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఆదర్శ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వైద్యరత్న. సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు బి.సత్తయ్య, హరికృష్ణ, ఎన్‌.వసుంధర, బి.సుభాష్‌, డి.వేణుగోపాల్‌కు వైద్యరత్న, జె.బి.మునిరత్నం, ఎన్‌.సురే్‌షబాబు, ఎన్‌వీవీఎ్‌సపీ సుధాకర్‌లకు సేవారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోశయ్య మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి గౌరవించడం అభినందనీయమన్నారు. ఆదర్శ ఫౌండేషన్‌ విలక్షణ కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతోందని తెలిపారు.

విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ పురస్కారాలు సేవాభావాన్ని పెంచడానికి దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వై.కె.నాగేశ్వరరావు, మహ్మద్‌ రఫీ, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, సుబ్బారావు, కుసుమ భోగరాజు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు గాతారహే మేరాదిల్‌ శీర్షికన సంగీత విభావరి నిర్వహించారు. గాయకులు పలు తెలుగు, హిందీ పాటలు ఆలపించి అలరించారు.