రవీంద్రభారతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్లను డా.సి.నారాయణరెడ్డి పురస్కారంతో పాటు గేయ రత్నాకర బిరుదుతో సత్కరించారు. మంగళవారం రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్‌, ప్రాజ్ఞిక ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన సంగీత సాహిత్య సమలంకృతే కార్యక్రమంలో భాస్కరభట్లకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి పురస్కారగ్రహీతను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజ్ఞిక సంస్థ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. సంగీత ప్రపంచానికి సినారె చేసిన సేవలు మరువలేనివని అన్నారు.

సినారె పేరిట పురస్కారాన్ని నెలకొల్పి సినీ గేయ రచయితకు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ సి.ఎం.డి బండారు సుబ్బారావు, వై.కె.నాగేశ్వరరావు, మహ్మద్‌ రఫీ, మార్గం రాజేష్‌, గీతామూర్తి, ఎన్‌.వి.సుభాష్‌, నవీన, మోహన్‌ తదితరులు పాల్గొని భాస్కరభట్లను అభినందించారు. సభకు ముందు ప్రముఖ గాయకుడు ప్రవీణ్‌ నేతృత్వంలో సంగీత సాహిత్య సమలంకృతే శీర్షికన సంగీత విభావరి నిర్వహించారు. ప్రముఖ గాయకులు మధుర గీతాలను ఆలపించి అలరించారు.