ప్రభుత్వ సలహాదారు రమణాచారి 

జానపద కళాకారులకు గోపాల్‌రాజ్‌భట్‌ పురస్కారాలు 

రవీంద్రభారతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు జానపదాలను ప్రపంచానికి చాటిన మహోన్నతుడు గోపాల్‌రాజ్‌భట్‌ అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి అభివర్ణించారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దక్షిణాత్య ఆర్ట్స్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జానపద కళాబ్రహ్మ డా.సి.గోపాల్‌రాజ్‌భట్‌ 91వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి మాట్లాడుతూ జానపద కళలకు తొలిసారిగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని గోపాల్‌రాజ్‌ భట్‌ను కీర్తించారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు వెన్నుదన్నుగా ఉందని అన్నారు. దీంట్లో భాగంగా వృద్ధ కళాకారులకు రూ.3వేల పింఛన్‌ అందించేందుకు సిద్ధమైందని గుర్తుచేశారు.   భట్‌ను స్పూర్తిగా తీసుకుని ఈతరం కళాకారులు ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బి.శివకుమార్‌ మాట్లాడుతూ గోపాల్‌రాజ్‌భట్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. గంభీరమైన ఆహార్యంతో హుందాగా ఉండేవారని అన్నారు. జానపద కళాకారులను ప్రోత్సహించిన మొట్టమొదటి కళాకారుడని గుర్తుచేశారు. ప్రముఖ కళాకారుడు, గోపాల్‌రాజ్‌ భట్‌ కుమారుడు రాఘవరాజ్‌భట్‌ మాట్లాడుతూ తన తండ్రి కళాకారుల కోసం చేసిన కృషిని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గోపాల్‌రాజ్‌భట్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని నేతలు హామీలు ఇచ్చారని, అయితే ఇప్పటికైనా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, నాట్య గురువు సుధాకర్‌, నాటక ప్రయోక్త డా.కోట్ల హనుమంతరావు, అనితారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు దురిశెట్టి రామయ్య, మూర్తి జగన్నాథంలకు గోపాల్‌రాజ్‌ భట్‌ జీవన సాఫల్య పురస్కారాలు, అందాసి నారాయణకు యువ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సభకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దక్షిణాత్య ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.