చిక్కడపల్లి, మే 23(ఆంధ్రజ్యోతి): త్యాగరాయగానసభ ఓ సాహితీ మల్టీప్లెక్స్‌ మహల్‌ అని వక్తలు పేర్కొన్నారు. శంకరం వేదిక, త్యాగరాయగానసభల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి గానసభ పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ కళా వెంకట దీక్షితులు ప్రథమ వర్ధంతి, స్మారక పురస్కార బహూకరణ కార్యక్రమం జరిగింది. సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్‌కు, కళా వెంకట దీక్షితులు స్మారక(రూ.10,000) పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ ఎ.చక్రపాణి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ప్రఖ్యాత నర్తకి పద్మశ్రీ శోభానాయుడు, తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యులు జూలూరు గౌరీశంకర్‌, సంఘసేవకులు డాక్టర్‌ విజయకుమార్‌ తదితరులు ప్రసంగించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య సాంస్కృతిక రంగాల మల్టీప్లెక్స్‌ మహల్‌ గానసభ ఒక్కటేనన్నారు. గానసభకు తన జీవితాన్నే అంకితం చేసిన ధన్యజీవి కళా దీక్షితులు అన్నారు. మౌనశ్రీ మల్లిక్‌కు పురస్కారం ఇవ్వడం అభినందనీయం అన్నారు. శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.