రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి):  ధిక్కార స్వరానికి ప్రతీక కాళోజీ నారాయణరావు అని వక్తలు అన్నారు. ఆయన సామాన్యులను తన కవిత్వంతో చైతన్యపరిచారని వారు పేర్కొన్నారు. మంగళవారం రవీంద్రభారతి మినీ హాల్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ప్రముఖ కవులు తిరుమల శ్రీనివాసాచార్య, అమ్మంగి వేణుగోపాల్‌, తిరునగరి దేవకీదేవి, నాళేశ్వరం శంకరం, మామిడి హరికృష్ణ, జూపాక సుభద్ర, తైదల అంజయ్య, వఝల శివకుమార్‌, జ్వలిత తదితరులు హాజరై కాళోజీని స్మరిస్తూ తమ కవితలను వినిపించారు. తెలంగాణ పేద ప్రజల పక్షాన నిలిచిన ప్రజాకవి కాళోజీ అని అన్నారు. తన కవిత్వంతో తెలంగాణ భాషకు వన్నె తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. పీడిత ప్రజల గొంతుక కాళోజీ అంటూ పలువురు కవులు అభివర్ణించారు.  ఈ కార్యక్రమంలో ఘనపురం దేవేందర్‌, దేవులపల్లి వాణి, వేముగంటి మురళీకృష్ణ, తమ కవితలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి మహిళా గజల్‌ రచయిత్రి ఇందిరా బైరి రచించిన కాళోజీ గజల్‌ను గాయని హిమజా రామమ్‌ గానం చేసి అలరించారు.