మాజీ మంత్రి దాడి వీరభద్రరావు విజ్ఞప్తి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ

విశాఖపట్టణం, అనకాపల్లిటౌన్‌, మే 25: దివంగత ముఖ్యమంత్రి, ఎన్టీఆర్‌ జయంతిని రాష్ట్ర కళానీరాజన దినోత్సవంగా నిర్వహించాలని మాజీ మంత్రి, నాటక రచయిత దాడి వీర భద్రరావు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు.ఈ విషయమై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కళాకారులకు గుర్తింపు ఉండేలా మహానటుడు ఎన్టీ రామారావు జన్మదినాన్ని రాష్ట్ర కళానీరాజన దినోత్సవంగా పరిగణించాలని సమాచారశాఖ మంత్రిగా 1995లో తాను చేసిన ప్రతిపాదనలను.. ముఖ్యమంత్రి ఆమోదించగా ప్రభుత్వ కార్యదర్శి కేవీ రమణాచారి ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

ఎన్టీఆర్‌ ఆఖరి జన్మదినమైన 1995 మే 28న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడమైందన్నారు. హైదరాబాద్‌ తెలుగు లలిత కళాతోరణంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అప్పటి ఆర్థిక రెవెన్యూశాఖా మంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ ఉత్సవం కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులైన తొమ్మిది మంది కళాకారులను నగదు పురస్కారాలతో ఆనాడు సత్కరించామన్నారు. తెలుగు లలిత కళాతోరణంలో అప్పుడు ఎన్టీఆర్‌ ప్రసంగిస్తూ కళాకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, బస్సుల్లో రాయితీలు, అన్ని మండల కేంద్రాల్లో ఆరుబయట రంగస్థలాలు తదితర వాటిని ప్రకటించారన్నారు.

అంతేకాకుండా ప్రతి జిల్లా కేంద్రంలోను, పలు ప్రధాన కేంద్రాల్లోను 30 వరకు అత్యాధునిక సదుపాయాలతో ఒక్కొక్కటి ఐదు కోట్ల రూపాయలతో ఎన్టీఆర్‌ సాంస్కృతిక కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తుందని ప్రకటించారన్నారు. హాడ్కో చైర్మన్‌ అబిడ్స్‌లో ఎన్టీఆర్‌ను కలిసి హోడ్కో తరపున పూర్తి ఆర్ధిక సహయం చేయగలమని హామీ కూడా ఇచ్చారన్నారు.ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం కళానీరాజన దినోత్సవ పేరును తొలగించి ఆత్మగౌరవ దినంగా ప్రకటించిందన్నారు. అయితే ఆ పేరు రాజకీయపరంగా ఉన్నందున తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని పూర్తిగా రద్దు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జన్మదినాన్ని రాష్ట్ర కళాకారుల దినోత్సవంగా తిరిగి పునరుద్దరించాలని లేఖలో కోరామన్నారు. ఎన్టీఆర్‌ ఆఖరి ప్రకటనను గౌరవించే విధంగా.. విశాఖలో మహానాడులో నిర్ణయాలు తీసుకుని తెలుగు సంస్కృతికి పట్టం కట్టాలని దాడి విజ్ఞప్తి చేశారు.